ఏపీ పోలవరం.. తెలంగాణకు శాపం

by  |
ఏపీ పోలవరం.. తెలంగాణకు శాపం
X

దిశ, ఖమ్మం ప్రతినిధి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు తెలంగాణకు శాపంగా మారబోతోంది. భద్రాచలం ఏజెన్సీతో పాటు ముంపు మండలాలను జలసమాధి చేయబోతుంది. ఎంతో మంది నిర్వాసితులు కాబోతున్నారు. వేల ఎకరాలలో పంట నీట మునగనుంది. తెలంగాణ అయోధ్యగా విరాజిల్లుతున్న భద్రాద్రి రామాలయం కూడా ముంపునకు గురికాక తప్పదని గతంలోనే నిపుణులు హెచ్చరించారు. టీఆర్ఎస్ ప్రభుత్వం ఎన్నోసార్లు కేంద్రానికి విన్నవించినా స్పందన లేదు.

శరవేగంగా పనులు పూర్తి చేసుకుంటున్న ఈ ప్రాజెక్టు పురోగతిని ఇటీవల ఏపీ సీఎం జగన్ దగ్గరుండి పరిశీలించారు. అక్కడే అధికారులతో సమీక్ష నిర్వహించారు. వచ్చేది ఏడాదికల్లా పనులు పూర్తిచేయాలని, ఒక్క మి.మీ కూడా ఎత్తు తగ్గించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. దీంతో పోలవరంపై మళ్లీ చర్చ మొదలైంది. ఏజెన్సీ వాసులు మాత్రం భవిష్యత్తును తలచుకుని వణికిపోతున్నారు.

అప్పుడు పోరాడి ఇప్పుడు మౌనం

రాష్ట్ర విభజనకు ముందు పోలవరం డిజైన్ మార్చాలని పోరాడిన టీఆర్ఎస్ విభజన అనంతరం పోరాటం చేయడం లేదు. ఎత్తు తగ్గించాలని ఏపీ ప్రభుత్వానికి నామమాత్రపు సూచనలు తప్ప చేసిందేమీ లేదు. రాష్ట్ర ప్రభుత్వం కనీసం పోలవరంతో జరిగే నష్టాన్నైనా తగ్గించాలని, సాధ్యమైనంత త్వరగా శాశ్వత పరిష్కార మార్గాలు అన్వేషించాలని ఏజెన్సీవాసులు కోరుకుంటున్నారు. ప్రాజెక్టు నిర్మాణంతో రామాలయం కనుమరుగు కాక తప్పదనే అభిప్రాయం వ్యక్తమవుతున్నా కేసీఆర్ సర్కార్ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని భక్తులు మండిపడుతున్నారు.

1956లో వచ్చిన వరదలు భద్రాచలాన్ని ముంచెత్తాయి. అప్పుడు 75.6 అడుగులు గోదావరి నీటిమట్టం నమోదైంది. 32 లక్షల క్యూసెక్కుల వరద నీటికే ఆనాడు భద్రాచలం అతలాకుతలమైంది. పట్టణం సగం వరకు మునిగిపోయింది. భద్రాద్రి రామాలయం నీటిలో మునిగిపోయింది. 50లక్షల క్యూసెక్కుల సామర్థ్యంతో ప్రాజెక్టు పూర్తయితే భారీ స్థాయిలో ముప్పు తప్పదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రామాలయంలో పాటు ఐటీసీ, హెవీ వాటర్ ప్లాంట్, సీతారామ, దుమ్ముగూడెం ప్రాజెక్టులకూ ప్రమాదం తప్పదని భావిస్తున్నారు. వందలాది గ్రామాలు ముంపు బారిన పడక తప్పదని, వేలాది ఎకరాలలో పంట నీట మునగడం ఖాయంగా చెబుతున్నారు.

62 అడుగులకు నీటిమట్టం

రెండు నెలల క్రితం కురిసిన వర్షాలకు గోదావరి నీటి మట్టం 62 అడుగులకు చేరింది. దీంతో ఏజెన్సీ అంతా జలదిగ్బంధంగా మారింది. వేల ఎకరాలలో పంట పొలాలు నీట మునిగాయి. ఎంతో మంది పునరావాస కేంద్రాలలో తలదాచుకున్నారు. పోలవరం బ్యాక్ వాటర్ ఎగదన్ని గోదావరిలో నీటి మట్టం పెరిగిందని ఏజెన్సీవాసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ముంపుపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని కోరుతున్నారు. 150 అడుగుల ఎత్తులో పోలవరం నిర్మాణం జరిగితే.. భద్రాచలం వద్ద 365 రోజులూ గోదావరి నీటి మట్టం తొలి ప్రమాద హెచ్చరిక అయిన 43 అడుగులకు తగ్గకుండా ఉంటుందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. వరదల సమయంలో ఈ ప్రాంతం అంతా అతలాకుతలం అయ్యే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం, దుమ్మగూడెం, మణుగూరు, అశ్వాపురం, చర్ల మండలాలకూ ప్రమాదం పొంచి ఉందని చెబుతున్నారు.

కరకట్ట సంగతేమిటో?

పోలవరం బ్యాక్ వాటర్ కారణంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలతో పాటు ఛత్తీస్ గఢ్, ఒడిశా సరిహద్దులోని గోదావరి పరీవాహక ప్రాంతాలు ముంపునకు గురికానున్నాయి. అన్నింటికంటే తెలంగాణకే ఎక్కువ నష్టం జరుగనుంది. 1886లో వచ్చిన వరదలలో గోదావరి నీటి మట్టం 75.6 అడుగులకు చేరింది. అప్పడు దాదాపు సగం భద్రాచలం నీటిలో మునిగిపోయింది. ఆ పరిస్థితిని అంచనా వేసుకుని 80 అడుగుల ఎత్తులో గోదావరి కరకట్టను నిర్మించారు. పోలవరం పూర్తయితే వచ్చే వరదల నేపథ్యంలో ఇప్పుడున్న కరకట్ట పటిష్టతపై కూడా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.. భవిష్యత్ లో వరదలను తట్టుకునే స్థాయిలో కరకట్టను ఇంకా పటిష్ట పరిచి ఎత్తు పెంచాలని, భద్రాచలం చుట్టూ ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ముంపు ప్రాంతవాసులకు కూడా శాశ్వత పరిష్కార మార్గాలు చూపాలంటున్నారు.

Next Story