అమెరికా పాప్ సింగర్.. సంగీత సంచలనం

by  |
అమెరికా పాప్ సింగర్.. సంగీత సంచలనం
X

దిశ, ఫీచర్స్ : సంగీత ప్రపంచంలో కళాకారుడి ప్రతిభకు గుర్తింపుగా ఇచ్చే అత్యంత ప్రెస్టీజియస్ అవార్డ్ ‘గ్రామీ’(గోల్డెన్ గ్రామ్‌ఫోన్). సినీ రంగంలో ఆస్కార్‌ను ఎంత ప్రతిష్టాత్మకంగా భావిస్తారో యువ గాయనీగాయకులు, సంగీత దర్శకులు, రచయితలు గ్రామీ కోసం అంతగా తపిస్తుంటారు. పాప్, రాక్, ఆర్‌అండ్‌బీ, ర్యాప్, కంట్రీ, జాజ్, ఫోక్, క్లాసికల్, న్యూ ఏజ్ విభాగాల్లో సత్తా చాటిన సంగీత కళాకారులు గ్రామీని సొంతం చేసుకుంటారు. గ్రామీ అవార్డుల చరిత్రలో ఇప్పటివరకు ఎన్నో రికార్డులు నమోదు కాగా, తాజాగా అమెరికన్ సింగర్, లిరిక్ రైటర్, యాక్ట్రెస్, డైరెక్టర్, హ్యుమానిటేరియన్ బేయాన్స్.. 28వ గోల్డెన్ గ్రామ్‌ఫోన్ గెలిచి, ప్రెస్టీజియస్ మ్యూజిక్ అవార్డ్ చరిత్రలో అత్యధిక అవార్డులు పొందిన ఫిమేల్ ఆర్టిస్ట్‌గా అవతరించింది. ప్రజెంట్ఎరాలో మోస్ట్ సిగ్నిఫికెంట్ పాప్ స్టార్లలో బేయాన్స్ ఒకరు కాగా, తొమ్మిదేళ్ల వయసు నుంచి అలుపెరగకుండా పాటలు పాడుతున్న ఈ సంగీత సంచలనంపై ప్రత్యేక స్టోరీ.

బేయాన్స్ గ్రామీ అవార్డుల్లో రికార్డు వేట కొనసాగిస్తోంది. ఇప్పటివరకు బేయాన్స్ పేరు మీద 79 నామినేషన్స్ నమోదు కాగా, మరే ఫిమేల్ సింగర్ కూడా ఈ రికార్డ్‌ను చేరుకోలేదు. అంతేకాదు ఒకేరోజు 6 గ్రామీ అవార్డులు గెలుచుకుని, అమెరికన్ సింగర్ అడెలెతో సమంగా మరో రికార్డ్‌ను తన పేరిట లిఖించుకుంది. ఈ క్రమంలో వరుసగా 7సార్లు గ్రామీలు గెలుచుకున్న సింగర్‌గానూ చరిత్ర సృష్టించింది. ఇటీవలే 28వ అవార్డు గెలుచుకున్న బేయాన్స్.. అత్యధిక గ్రామీలు సొంతం చేసుకున్న సింగ‌ర్ అలీస‌న్ క్రాస్(27 గ్రామీలు) పేరు మీద ఉన్న రికార్డును తిర‌గ‌రాసింది.

ప్రస్తుతం హంగేరియన్ బ్రిటిష్ కండక్టర్, మ్యూజిక్ డైరెక్టర్ జార్జ్ సోల్టి మాత్రమే 31 గ్రామీలతో బేయాన్స్ కంటే ముందున్నాడు. అంతేకాదు ఆమె జీవితంలో ప్రత్యేకంగా నిలిచిన అదే రోజున తన 9 ఏళ్ల కుమార్తె బ్లూ ఐవీ కార్టర్, తల్లి బేయాన్స్‌తో చేసిన ‘బ్రౌన్ స్కిన్ గర్ల్’లోని పాత్రకు గాను ఫీచర్డ్ ఆర్టిస్ట్‌గా ఘనత పొందింది. ఈ క్రమంలో గ్రామీని గెలుచుకున్న రెండో అతి పిన్న వయస్కురాలుగా నిలిచింది. కాగా జార్జ్ ఫ్లాయిడ్ మరణం నేపథ్యంలో బ్లాక్ లైవ్స్ మేటర్ నిరసనల చుట్టూ కేంద్రీకృతమైన ‘బ్లాక్ ఈజ్ కింగ్’‌ ఆల్బమ్‌లోని ‘బ్లాక్ పరేడ్’ పాట బేయాన్స్‌కు రికార్డ్ గోల్డెన్ గ్రామ్‌ఫోన్‌ను తెచ్చిపెట్టింది.

మ్యూజికల్ ఎవల్యూషన్

1993లో ‘గర్ల్ టైమ్’ అనే బ్యాండ్‌లో.. లో ప్రొఫైల్ కంటెస్టెంట్‌గా బేయాన్స్ జర్నీ మొదలైంది. ‘స్టార్ సెర్చ్’ అనే రియాలిటీ షోలో ‘గర్ల్ టైమ్’ గ్రూప్ పార్టిసిపేట్ చేయగా, వారికి రెండో స్థానం దక్కింది. ఈ విజయమే ప్రపంచ సంగీత చరిత్రలో తన ముద్రవేయడానికి ఓ స్టెప్పింగ్ స్టోన్‌లా నిలిచింది. ఆ తర్వాత ‘డెస్టిని చైల్డ్’ మ్యూజిషియన్ బ్యాండ్‌లో చేరడంతో తన జీవితం మలుపు తిరిగింది. ఈ క్రమంలో తన తొలి ఆల్బమ్ ఫెయిల్ అయినా, రెండో ఆల్బమ్ ‘ద రైటింగ్ ఆన్ ది వాల్’ మాసివ్ సక్సెస్ సాధించడంతో పాటు15 మిలియన్ కాపీలకు పైగా అమ్ముడైంది. ఇక అప్పటి నుంచి తను వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2003 నుంచి సోలో ఆర్టిస్ట్‌గా ప్రయాణం ప్రారంభించిన బేయాన్స్.. 6 స్టూడియో ఆల్బమ్స్, 5 లైవ్ ఆల్బమ్స్, 3 కంపైలేషన్(సంకలన) ఆల్బమ్స్, ఓ సౌండ్‌ట్రాక్‌ను విడుదల చేసింది. ఈ క్రమంలోనే ప్రపంచంలోని అత్యంత ప్రభావవంతమైన టాప్ 100 వ్యక్తుల్లో బేయాన్స్‌ను ఒకరిగా టైమ్ మ్యాగజైన్ పేర్కొంది. పవర్‌ఫుల్ మ్యూజిక్ సూపర్‌స్టార్‌గా లెక్కలేనన్ని అవార్డులు, ప్రశంసలను గెలుచుకున్న బేయాన్స్ 400 మిలియన్ డాలర్లకు పైగా ఆస్తిని కలిగి ఉంది. మూడు దశాబ్దాల కెరీర్‌లో అత్యంత శక్తివంతమైన ఫిమేల్ మ్యూజిక్ ఆర్టిస్ట్‌గా, పాప్ క్వీన్‌గా నిలిచింది. అందుకే ఆమె అభిమానులు తనను ముద్దుగా ‘క్వీన్ బే’ అని పిలుచుకుంటారు.

సమాజానికి తన వంతుగా..

2013లో మిసెస్ కార్టర్ వరల్డ్ టూర్ సందర్భంగా.. బేయాన్స్ తన ‘బేగుడ్’ ఇన్షియేటివ్ ప్రారంభించి, దీని ద్వారా సిక్ చిల్డ్రన్స్‌కు, నిరాశ్రయులకు సాయం చేయడంతో పాటు హైతీ, హ్యూస్టన్, టెక్సాస్‌లో తీవ్రమైన వాతావరణ సంఘటనలతో బాధపడుతున్న వారికి సాయం చేసింది. అదే సంవత్సరం నీటి సంక్షోభంతో బాధపడుతున్నవారి కోసం అభిమానుల సాయంతో 80వేల డాలర్ల విరాళాలు సేకరించి మిచిగాన్‌లోని ఓ స్వచ్ఛంద సంస్థకు డొనేట్ చేసింది. తూర్పు ఆఫ్రికాలోని బురుండిలో 120,000 మందికి పరిశుభ్రమైన నీటిని అందించేందుకు బేగుడ్‌ఫర్‌బురుండి (BEYGOOD4BURUNDI)ని ప్రారంభించింది. ఉమెన్ ఎంపవర్‌మెంట్ గురించి పోరాడే బేయాన్స్.. ‘ధైర్యంగా, సృజనాత్మకంగా, చేతనంగా, నమ్మకంగా ఔట్ ఆఫ్ ది బాక్స్ ఆలోచించటానికి భయపడని యువతులను ప్రోత్సహిస్తే.. నిజంగా ప్రపంచాన్ని ముందుకు నడిపించే నాయకులు అవుతారు’ అంటోంది. బ్లాక్ లైవ్స్, లింగ వివక్షపై కూడా తన గళాన్ని వినిపిస్తోంది. తన పవర్‌హౌస్ పర్ఫామెన్స్‌తో స్త్రీవాద సందేశాలను ఇవ్వడమే కాకుండా, బ్లాక్స్ హిస్టరీ, కల్చర్‌కు నివాళి అర్పిస్తోంది. తన కెరీర్ ప్రారంభంలో వివక్షకు గురైన బేయాన్స్.. ప్రస్తుతం తనలాంటి వారికి మార్గం చూపించడాన్ని బాధ్యతగా భావిస్తోంది.

ఎవరేం అనుకున్నా అభ్యంతరం లేదు..

నేను యువ కళాకారులకు తలుపులు తెరిచేందుకు సాయపడటం అదృష్టంగా భావిస్తాను. ఇక్కడ తమ ప్రతిభను చాటుకోవడానికి, ఇక్కడి వరకు తాము రావడానికి ఎన్నో సాంస్కృతిక, సామాజిక అడ్డంకులన్నాయి. అందుకే నేను జాతి, వర్ణ, లింగ, ప్రాంత వివక్షలు లేకుండా ఈ ఫీల్డ్‌ను ప్రతిభావంతమైన కళాకారులతో సమం చేయడానికి ప్రయత్నిస్తున్నాను. ఈ విషయంలో నేను నాకు వీలైనంత చేయాలనుకుంటున్నాను. ఎవరు ఏమనుకున్నా నాకు అభ్యంతరం లేదు. ప్రస్తుతం నేను మీ అందరి ప్రేమాభిమానులు అందుకోగలుగుతున్నాను. ఇతరులు కూడా ఇలాంటి ఆశీర్వాదాన్ని పొందాలని భావిస్తున్నాను. ఇదే అభిమానాన్ని వారి మీద కూడా చూపించాలని నేను కోరుకుంటున్నాను. ‘ప్రపంచం కోసం మిమ్మల్ని మీరు తగ్గించుకోవటానికి ప్రయత్నించవద్దు; ప్రపంచమే మిమ్మల్ని ఫాలో కావాలి – బేయాన్స్, అమెరికన్ పాప్ సింగర్



Next Story

Most Viewed