ఇళ్ల పట్టాల రద్దుతో ఆందోళన

by  |
ఇళ్ల పట్టాల రద్దుతో ఆందోళన
X

దిశ ప్ర‌తినిధి, ఖ‌మ్మం: మంజూరు చేసిన ఇళ్ల ప‌ట్టాల‌ను ర‌ద్దు చేయ‌డంతో ల‌బ్ధిదారులు ఆందోళ‌న‌కు దిగారు. ఖ‌మ్మం జిల్లా ర‌ఘునాథ‌పాలెం మండ‌లం శివాయిగూడెంలో శ‌నివారం పెద్ద ఎత్తున ల‌బ్ధిదారులు నిరాహార దీక్ష‌కు పూనుకున్నారు. ఖమ్మం పట్టణంలోని 2,864మంది నిరుపేదలకు 2009లో ఆనాటి కాంగ్రెస్‌ ప్రభుత్వం.. ప్రస్తుత రఘునాథ‌పాలెం మండలం శివాయిగూడెం గ్రామ పరిధిలోని భూముల్లో పట్టాలు మంజూరు చేసింది. పేద‌లు ఇళ్లు నిర్మించుకునేందుకు వీలుగా లోన్లు కూడా అంద‌జేయాల‌ని బ్యాంకుల‌ను ఆదేశించింది. దీంతో మొత్తం ద‌ర‌ఖాస్తుల్లో 200 మందికి లోన్లు అంద‌జేసేందుకు బ్యాంకులు సంసిద్ధ‌త వ్య‌క్తం చేశాయి. అయితే ఇళ్ల స్థ‌లాలు పొందిన ప్రాంతంలో నీటి, రోడ్డు నిర్మాణాలు లేక‌పోవ‌డంతో ల‌బ్ధిదారులు గృహ నిర్మాణాలు చేప‌ట్ట‌లేదు.

ఆ త‌ర్వాత అధికారంలోకి వ‌చ్చిన టీఆర్‌ఎస్ ప్రభుత్వం కూడా రోడ్లు, నీటి వ‌స‌తి క‌ల్పిస్తామ‌ని హామీ ఇచ్చింది. కానీ ఇవేమీ త‌ర్వాత అమ‌లుకు నోచుకోలేదు. ఉన్న‌తాధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్ర‌యోజ‌నం లేకుండాపోయింద‌ని, ప్ర‌స్తుతం ఇళ్ల ప‌ట్టాల‌ను కూడా ర‌ద్దు చేయ‌డం అన్యాయ‌మ‌ని ఆందోళ‌న చేప‌ట్టారు. శివాయిగూడెం వ‌ద్ద శ‌నివారం సుమారు 500 మంది నిరాహార దీక్ష‌ చేప‌ట్టారు. త‌మ‌కు న్యాయం జ‌రిగేంత వ‌ర‌కు ఉద్య‌మం కొన‌సాగిస్తామ‌ని తెలిపారు. విష‌యం తెలుసుకున్న ర‌ఘునాథ‌పాలెం, సీఐ, ఎస్సై ఘటనా స్థలానికి చేరుకుని ఆర్డీవోతో మాట్లాడేలా ఏర్పాటు చేస్తామ‌ని హామీ ఇవ్వ‌డంతో లబ్ధిదారులు ఆందోళ‌న విర‌మించారు.

Next Story