రూపా గురునాథ్‌కు బీసీసీఐ నోటీసులు

by  |
రూపా గురునాథ్‌కు బీసీసీఐ నోటీసులు
X

దిశ, స్పోర్ట్స్ : తమిళనాడు క్రికెట్ అసోసియేషన్ (టీఎన్‌సీఏ) అధ్యక్షురాలు రూపా గురునాథ్‌కు బీసీసీఐ శుక్రవారం నోటీసులు జారీ చేసింది. మధ్యప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ (ఎంపీసీఏ) శాశ్వత సభ్యుడు సంజీవ్ గుప్తా ఇచ్చిన పిర్యాదు మేరకు.. రూపా గురునాథ్‌కు ‘పరస్పర విరుద్ద ప్రయోజనాలు’ అనే కారణంగా బీసీసీఐ ఎథిక్స్ అధికారి జస్టీస్ డీకే జైన్ ఆమెకు నోటీసులు పంపించారు. బీసీసీఐ మాజీ అధ్యక్షుడు ఎన్.శ్రీనివాసన్ కూతురైనా రూపా గురునాథ్ గత ఏడాది టీఎన్‌సీఏ అధ్యక్షురాలిగా పదవీ బాధ్యతలు చేపట్టారు. ఒక రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు బాస్‌గా ఎన్నికైన తొలి మహిళగా ఆమె గుర్తింపు పొందారు.

కాగా, ఆమె ఇండియా సిమెంట్స్‌ బోర్డులో డైరెక్టర్‌గా ఉన్నారు. ఐపీఎల్‌లో ఫ్రాంచైజీగా ఉన్న చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు ఇండియా సిమెంట్స్ ప్రమోటర్‌గా ఉంది. ఒకవైపు ఐపీఎల్‌లోని ఫ్రాంచైజీతో సంబంధాలు ఉన్న వ్యక్తి.. రాష్ట్ర క్రికెట్ అసోసియేషన్‌కు అధ్యక్షురాలిగా ఉండటం పరస్పర విరుద్ద ప్రయోజనాల కిందకు వస్తుందని సంజీవ్ గుప్తా తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిశీలించిన జస్టీస్ డీకే జైన్.. డిసెంబర్ 24లోపు దీనిపై సంజాయిషి ఇవ్వాలని కోరారు. బీసీసీఐ లేదా రాష్ట్ర అసోసియేషన్‌లో బాధ్యతాయుతమైన పదవిలో ఉన్న ఏ వ్యక్తి అయినా.. మరో పదవిలో ఉండకూడదు అనేది నిబంధనగా ఉన్నది. దీనిని ఆమె ఉల్లంఘించింది కాబట్టి అధ్యక్ష పదవికి అనర్హురాలిగా ప్రకటించాలని కోరుతున్నారు. కాగా. ఇండియా సిమెంట్స్ పదవిని వదిలేస్తే.. టీఎన్‌సీఏ అధ్యక్ష పదవికి ఎలాంటి ఢోకా ఉండదని క్రికెట్ నిపుణులు అంటున్నారు.



Next Story

Most Viewed