ఐపీఎల్‌ నిడివి తగ్గనుందా..?

by  |
ఐపీఎల్‌ నిడివి తగ్గనుందా..?
X

బీసీసీఐకి కాసుల వర్షం కురిపించే ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఏప్రిల్ 15కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. షెడ్యూల్ ప్రకారం ఈ మెగా టోర్నీ మరో 15 రోజుల్లో ప్రారంభం కావల్సి ఉండగా.. కరోనా దెబ్బకు ఐపీఎల్‌ను వాయిదా వేయక తప్పని పరిస్థితి. కాగా ఇవాళ బీసీసీఐ, ఐపీఎల్ గవర్నింగ్ బాడీ, స్టార్ స్పోర్ట్స్ ప్రతినిధులు, ఫ్రాంచైజీల ఓనర్లతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు.

ఐపీఎల్ నిడివి తగ్గించడం లేదా పూర్తిగా రద్దు చేయడం మేలని ఫ్రాంచైజీ ఓనర్లు అభిప్రాయపడ్డారు. మరింతగా వాయిదా వేస్తే విదేశీ క్రికెటర్లు అందుబాటులో ఉండరని.. అలాగైతే ఐపీఎల్ కళ తగ్గుతుందని ఓనర్లు స్పష్టం చేశారు. ఏప్రిల్ 15 నాటికి కరోనా తీవ్రత తగ్గుతుందని.. ఐపీఎల్ రద్దు ఆలోచన వద్దని కోల్‌కతా నైట్ రైడర్స్ యజమాని షారుఖ్ ఖాన్ అభిప్రాయపడ్డట్లు తెలుస్తోంది.

మరోవైపు ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ నిర్వహిస్తే మంచిదనే అభిప్రాయాన్ని సునీల్ గవాస్కర్, వీవీఎస్ లక్ష్మణ్ వ్యక్తం చేశారు. కానీ ప్రేక్షకులు లేకుండా ఐపీఎల్ నిర్వహించడం కష్టమని గవర్నింగ్ బాడీ తేల్చేసింది. ప్రస్తుత పరిస్థితుల్లో విదేశాల్లో ఆడటం కూడా కుదరని పరిస్థితి కాబట్టి ఇండియాలోనే ఎలాగోలా నిర్వహించాలని స్టార్ స్పోర్ట్స్ ప్రతినిధులు పట్టుబట్టారట. ఐపీఎల్ రద్దు వల్ల స్టార్‌కే కాకుండా ఫ్రాంచైజీలకు కూడా నష్టమే కాబట్టి మరో ప్రత్యామ్నాయం ఆలోచించాలని సూచించినట్లు తెలుస్తోంది.

బీసీసీఐ ఆరేడు ప్రత్యామ్నాయాలు సూచించినా ఫ్రాంచైజీలు ఏకాభిప్రాయానికి రాలేదని సమాచారం. ఏప్రిల్ రెండో వారంలో మరో సారి సమావేశమై ఐపీఎల్ భవితవ్యాన్ని తేల్చేద్దామని ఒక నిర్ణయానికి వచ్చారు.

Tags: BCCI, IPL, Governing Body, Star sports, franchises

Next Story