బౌలింగ్ ఓకే..మరి బ్యాటింగ్ ?

by  |
బౌలింగ్ ఓకే..మరి బ్యాటింగ్ ?
X

మహిళా టీ20 ప్రపంచ కప్‌‌లో పాల్గొనేందుకు ఆస్ట్రేలియా వెళ్లిన భారత మహిళా క్రికెట్ జట్టుపై మొదట ఎలాంటి అంచనాలు లేవు. యువ క్రీడాకారిణులతో కూడిన జట్టు ప్రపంచ కప్ లాంటి మెగా టోర్నీలో ఏ మేరకు రాణిస్తుందనే అనుమానాలే ఎక్కువగా ఉండేవి. కానీ అందరి అనుమానాలను పటాపంచలు చేస్తూ యువ మహిళా జట్టు.. హ్యాట్రిక్ విజయాలు నమోదు చేసింది. హర్మన్‌ప్రీత్ కౌర్ నేతృత్వంలో వరుస విజయాలతో సెమీస్‌కు చేరి ఔరా అనిపించింది. శనివారం శ్రీలంక జట్టుతో తలపడనుంది.

అయితే బౌలర్లు విశేషంగా రాణించడంతోనే ఈ మూడు మ్యాచుల్లో గెలుపు సాధ్యమైందన్నది వాస్తవం. బ్యాట్స్ఉమెన్‌లో ఓపెనర్ షెఫాలీ వర్మ తప్ప ఎవరూ కూడా ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఇన్నింగ్స్ ఆడలేదు.
భారత జట్టు ఆడిన మూడు మ్యాచుల్లో తొలుత బ్యాటింగే చేసింది. ఆస్ట్రేలియాపై 132, బంగ్లాదేశ్‌పై 142, న్యూజిలాండ్‌పై 133 పరుగులు మాత్రమే చేయగలిగింది. మూడు మ్యాచుల్లో కూడా షెఫాలీపైనే జట్టు బ్యాటింగ్ ఆధారపడింది. మరో ఓపెనర్ స్మృతి మంధానా, మిడిల్ ఆర్డర్‌లో కెప్టెన్ హర్మన్ ప్రీత్, వేదాకృష్ణమూర్తి ఫామ్‌లో లేకపోవడం జట్టును కలవరపెడుతోంది. రేపటి మ్యాచ్‌లోనైనా పరుగులు రాబట్టి ఫామ్‌లోకి వస్తేగానీ సెమీస్‌లో ధైర్యంగా ఆడే అవకాశం ఉండదు. ఈ మ్యాచ్ నామమాత్రమే అయినా..సెమీస్‌కు ముందు ప్రాక్టీస్ మ్యాచ్‌గా ఉపయోగపడనుంది.

ఇక బౌలింగ్‌ విషయానికొస్తే..ముఖ్యంగా స్పిన్నర్లు పూనమ్ యాదవ్, దీప్తి శర్మ, రాజేశ్వరిలు మ్యాచ్‌ను ఇండియా వైపు లాగేస్తున్నారు. పరుగులు ఇవ్వకపోవడమే కాక వరుసగా వికెట్లు తీస్తూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తున్నారు. మిగతా మ్యాచుల్లో కూడా వీరి ఇలాగే కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తే భారత జట్టు తప్పకుండా తమ లక్ష్యాన్ని చేరుకోవడం ఖాయమని విశ్లేషకులు భావిస్తున్నారు.


Next Story