నిజమైన తెలంగాణ వాదులైతే ప్రభుత్వాన్ని కూల్చేయండి: బండి సంజయ్

736
bandi-sanjay-padayatra

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు నిజమైన తెలంగాణ వాదులైతే వెంటనే ప్రభుత్వాన్ని కూల్చేయాలని బండి సంజయ్ సంచలన సవాల్ విసిరారు. సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించకుండా.. ప్రగతి భవన్‌కు పరిమితమైన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్మల్ జిల్లాలో బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన తెలంగాణ విమోచన దినోత్సవ కార్యక్రమంలో భాగంగా భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు. ఈ సభలో ప్రసంగించిన బండి సంజయ్ నిర్మల్ గడ్డ పోరు గడ్డ అంటూ అభివర్ణించారు.

శివాజీ చేతిలో కత్తి చూడు.. అమిత్ షా సత్తా చూడు.. తల తల మెరిసే తల్వార్ చూడు.. మన సమర యోధుల వీరత్వం చూడు అంటూ బండి సంజయ్ నినాదించారు. అనేకమంది బలిదానాలతో నిర్మల్ జిల్లా అందరిలో స్ఫూర్తి నింపిందన్నారు. దాదాపు వెయ్యి మందిని మర్రి చెట్టుకు ఉరి తీశారని.. ఆ వీర యోధుల ఘనత చాటి చెప్పడానికే బీజేపీ ఈ సభ నిర్వహించినట్టు చెప్పుకొచ్చారు. తెలంగాణ సమర యోధుల వీరత్వం గురించి భవిష్యత్తు తరాలకు తెలియజేయాలన్న ఉద్దేశంతోనే భారతీయ జనతా పార్టీ ప్రతి ఏడాది విమోచన దినోత్సవ వేడుకను అధికారికంగా నిర్వహిస్తోందన్నారు.

కానీ, తెలంగాణ మొత్తం విమోచన దినోత్సవం జరుపుకుంటుంటే ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రగతి భవన్‌లో ఉంటారా? అంటూ బండి సంజయ్ ప్రశ్నించారు. కనీసం జెండా ఎగురవేయకపోవడం అవమానకరం అన్నారు. వెంటనే బయటకు వచ్చి తెలంగాణ ప్రజలకు క్షమాపణ చెప్పాలన్నారు. అసెంబ్లీ సాక్షిగా సర్దార్ పటేల్‌ను అవమానపరిచారన్నారు. ప్రజల చేత ఎన్నుకోబడిన ఎమ్మెల్యేలు, మంత్రులు నిజమైన తెలంగాణ వాదులైతే వెంటనే ప్రభుత్వాన్ని కూల్చేయాలన్నారు. కర్ణాటక, మహారాష్ట్రలో విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటుంటే.. తెలంగాణను మాత్రం కేసీఆర్ మూడు ముక్కలు చేశారన్నారు. ఒక్క ముక్క ఓవైసీ, మరో ముక్క కొడుకు, మూడో ముక్కను అల్లుడికి ఇచ్చారంటూ ఎద్దేవా చేశారు. ఎంతో మంది పోరాటాలు చేసి, ప్రాణ త్యాగాలు చేసినా వారికి కనీసం విలువ లేకుండా చేశారని మండిపడ్డారు. బీజేపీ అధికారంలోకి రాగానే అమరుల కుటుంబాలను ఆదుకుంటామని.. వారికి పెన్షన్ కూడా ఇస్తామన్నారు. మోడీ, అమిత్ షా ఆశీర్వాదంతో గల్లీ గల్లీలో బీజేపీ ఎదుగుతోందన్నారు.

ఎంఐఎం పార్టీ అరాచకాలు రాష్ట్రంలో పెరుగుతున్నాయన్నారు. భైంసాలో ఎంతోమంది మీద దాడి చేశారన్నారు. వారిని ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ మర్చిపోదన్నారు. విమోచన దినోత్సవం వద్దని చెప్పిన మేథావి ఎవరో చెప్పాలి.. వాడిని ఇక్కడే నిండు సభలో ఉరేసి చంపుతామంటూ బండి సంజయ్ కేసీఆర్‌ను హెచ్చరించారు. సర్దార్ పటేల్ చరిత్ర తిరగరాసే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదన్నారు. వీరుల చరిత్రను కనుమరుగు చేసి కేవలం కల్వకుంట్ల చరిత్రను మాత్రమే ప్రదర్శించడం సరికాదన్నారు. త్వరలోనే బీజేపీ అధికారంలోకి వస్తోందని.. సీఎం కేసీఆర్ కుటుంబాన్ని తరిమికొడతామన్నారు. అవినీతి చరిత్రను బయటపెడుతామని హెచ్చరించారు. నీచుల చరిత్రను పాఠ్యాంశంలో పెడుతామని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణకు కేసీఆర్ చేసిన ద్రోహాన్ని కూడా పాఠ్యాంశంలో చేర్చుతామన్నారు. కాషాయ జెండాను త్వరలోనే తెలంగాణలో ఎగురవేసే క్షణం దగ్గరలోనే ఉందన్నారు. మూర్ఖుడి చేతిలో బంధీ అయి ఉన్నానని తెలంగాణ తల్లి ఆర్తనాధాలు పెడుతోందని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రజలందరూ ఏకతాటిపైకి వచ్చి ఆ తల్లికి విముక్తి కలిగించాలని బండి సంజయ్ అన్నారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..