బజాజ్ ఆటో అరుదైన రికార్డు..

by  |
బజాజ్ ఆటో అరుదైన రికార్డు..
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయ దిగ్గజ వాహన తయారీ సంస్థ బజాజ్ ఆటో సరికొత్త రికార్డులను నమోదు చేసింది. మంగళవారం కంపెనీ స్టాక్స్ ర్యాలీ చేయడంతో తొలిసారిగా రూ. లక్ష కోట్ల మార్కెట్ క్యాప్ మైలురాయిని సాధించింది. దీంతో ఈ ఘనత సాధించిన నాలుగో ఆటో రంగ కంపెనీగా స్థానం సంపాదించుకుంది. ఇదివరకు ఈ మైలురాయిని మారుతీ సుజుకి, టాటా మోటార్స్, మహీంద్రా కంపెనీలు చేరుకున్నాయి. 2020లో ఏడాదిలో అనేక కంపెనీలు కొత్త రికార్డులను నమోదు చేశాయి. నవంబర్‌లో దేశీయ టెక్ దిగ్గజం టీసీఎస్ రూ. 10 లక్షల కోట్ల మార్కెట్ క్యాప్‌ను సాధించగా, మరో టెక్ సంస్థ ఇన్ఫోసిస్ రూ. 5 లక్షల కోట్ళ మారును, బజాజ్ ఫైనాన్స్ రూ. 3 లక్షల కోట్ల మారును దక్కించుకున్నాయి. కరోనా ప్రభావం ఉన్నప్పటికె పలు రంగాల్లో వేగవంతమైన వృద్ధి తిరిగి రావడమే దీనికి ప్రధాన కారణమని పరిశ్రమ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

మంగళవారం నాటి మార్కెట్ సెషన్‌లో బజాజ్ ఆటో షేర్ ధర రూ. 3,460కి చేరుకుంది. అనంతరం ఊగిసలాటకు గురై మార్కెట్లు ముగిసే సమయానికి రూ. 3,434 వద్ద ఉంది. ప్రీమియం మోటార్‌సైకిళ్ల ఉత్పత్తికి కొత్త ప్లాంట్‌ల కోసం కంపెనీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైన నేపథ్యంలో దేశీయంగానే కాకుండా విదేశాల్లోనూ నిరంతర వృద్ధి సామర్థ్యంపై ఆశలున్నాయని బజాజ్ ఆటో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేశ్ శర్మ తెలిపారు. ఏడాదికి లక్ష మోటార్‌సైకిళ్లను తయారు చేసే సామర్థ్యం కలిగిన కొత్త ప్లాంట్‌లో కేటీఎం, హస్క్‌వర్నా, ట్రయంఫ్ వంటి ప్రీమియం బ్రాండ్‌లను తయారు చేయనుంది. ఈ ప్లాంట్‌ను 2022-23 రెండో భాగం నాటికి ప్రారంభించాలని కంపెనీ భావిస్తోంది.

Next Story

Most Viewed