హైకోర్టులో జగన్ సర్కార్‌కు ఎదురుదెబ్బ 

by srinivas |
High Court
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర హైకోర్టులో వైసీపీ ప్రభుత్వానికి చుక్కెదురైంది. ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ పాఠశాలలు, జూనియర్‌ కళాశాలలకు ఫీజులు ఖరారు చేస్తూ ఏపీ ప్రభుత్వం ఆగస్టు 24న తీసుకొచ్చిన జీవోలు 53,54 లను హైకోర్టు తోసిపుచ్చింది. మేనేజ్‌మెంట్‌ నుంచి ప్రతిపాదనలు తీసుకుని కొత్త నోటిఫికేషన్‌ ఇవ్వాలని ధర్మాసనం ఆదేశించింది. తూర్పుగోదావరి జిల్లా ప్రైవేటు పాఠశాలల అసోసియేషన్ అధ్యక్షుడు దాసరి దుర్గా శ్రీనివాసరావు, ఇతర విద్యాసంస్థల యాజమాన్యం జీవోలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను విచారణకు స్వీకరించిన ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది.

రాష్ట్రంలోని ప్రైవేట్ విద్యాసంస్థల్లో రుసుములను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఏకపక్షంగా జీవోలు జారీ చేసిందంటూ పిటిషనర్ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఫీజులు ఖరారు చేసే ముందు విద్యాసంస్థల్లోని మౌలిక సదుపాయాల కల్పన, విద్యాబోధనకు అయ్యే ఖర్చుపై ఆలోచించి విడుదల చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్ణయించిన జీవోలతో విద్యాసంస్థల నిర్వహణ, మెరుగైన బోధన సాధ్యం కాదని పిటిషనర్ తరపు న్యాయవాదులు వాదించారు. ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యాబోధనపై సంతృప్తి చెందిన తర్వాతే తల్లిదండ్రులు పిల్లలను స్కూల్లో చేర్పిస్తారన్న విషయాన్ని ధర్మాసనం ముందుకు తీసుకువచ్చారు. దీంతో ఇరు వాదనలు విన్న ధర్మాసనం జీవోలను తోసిపుచ్చుతూ తీర్పు వెల్లడించింది.

Next Story

Most Viewed