బ్యాక్ బెంచ్ స్టూడెంట్..!

by  |
బ్యాక్ బెంచ్ స్టూడెంట్..!
X

ఆగస్టు పదిహేను నాడు
ఓ అమ్మాయి….
ఫేస్ బుక్ లో
ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టింది.

మాట్లాడుతూ ఉన్న
బ్యాక్ షేడ్ ప్రొఫైల్ పిక్
పోల్చుకో లేక…
పేరుని చూసి కన్ ఫామ్ చేశా.

ఆమె ముఖ పుస్తక
పేజీల నిండా..
సామాజిక సమకాలీన
సమస్యల మీద
సందిస్తున్న ప్రశ్నలే.!

దేశ భక్తి అంటే ఏమిటి..?
నన్ను ఆకర్శించిన ప్రశ్న
ఆమె భావజాల ప్రవాహంలో
నాకు నేను కనబడ్డ.!

రాజకీయ దేశ భక్తి గుద్దిన
దేశ ద్రోహి ముద్రకు
ధీటైన సమాధానమే ఇచ్చింది.!

ఆశ్చర్యంతో…
ముఖపుస్తకంలో
నా స్టూడెంటువా..?
అని ప్రశ్న పెట్టా….

సార్….
నమస్కారంతో మొదలై
మాటల మత్తడి
అక్షరాల అలుగై పారింది.!

“మాట్లాడే జీవి
మనిషి మాత్రమే
మాట అవసరమున్న కాడ
మాట్లాడక పోవడం
చారిత్రక ద్రోహామే”.!

మీ బోధన
నా మనో ఫలకంలో
నాటిన బీజం
ధిక్కారం వృక్షమై
ప్రతిఘటన స్వరమై
ముఖ పుస్తకంలో…
ఇలా మిమ్మల్ని కలుసుకుంది.!

నేను..
రెండువేల ఎనిమిది బ్యాచ్
భయంతో వనికి పోయిన
బ్యాక్ బెంచ్ స్టూడెంట్ ని.!
మాట నోట పెకలని
పి(ప)రికి మ(న్ను)ను పి(పె)ల్లని.!

నా అక్షరాలనే
నా ముందు పరిచి
తనను తాను పరిచయం
చేసుకున్న తీరు ముచ్చటేసింది.

ప్రతి పదవ తరగతి బ్యాచ్
వీడ్కోలు సభలో…
బ్యాక్ బెంచ్ స్టూడెంట్లే
ప్రశ్నల కొడవల్లై
ప్రకాశిస్తరనే నా విశ్వాసం
ఈ అమ్మాయిగా సాకారమైంది.!

-చిలువేరు అశోక్


Next Story

Most Viewed