ఏపీ ప్రజలకు బాబు బహిరంగ లేఖ..!

by  |
ఏపీ ప్రజలకు బాబు బహిరంగ లేఖ..!
X

కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు లేఖల పర్వం కొనసాగిస్తున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ, గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ, ఏపీసీఎం జగన్‌లకు లేఖలు రాసిన బాబు తాజాగా ఏపీ ప్రజలకు బహిరంగ లేఖ రాశారు. ప్రలజకు రాసిన లేఖలను చంద్రబాబు తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశారు. ఈ లేఖలో… రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాష్ట్రాన్ని పెనం పై నుంచి పొయ్యిలోకి నెట్టిందని ఆవేదన వ్యక్తం చేశారు.

గత వారం రోజుల్లో రాష్ట్రంలో కరోనా కేసులు రెట్టింపు అయ్యాయని గుర్తు చేశారు. కరోనా తీవ్రతను గురించి తాము ప్రభుత్వాన్ని ముందు నుంచే హెచ్చరిస్తున్నామని అన్నారు. వైఎస్సార్సీపీ నేతల నిర్లక్ష్యం వల్లే కరోనా విస్తరించిందని ఆరోపించారు. ముఖ్యమంత్రి జగన్‌ చేస్తోన్న వ్యాఖ్యలు ప్రజలను ఆవేదనకు గురి చేస్తున్నాయని అన్నారు. జగన్ నిర్ణయాల వల్ల వలస కార్మికుల పరిస్థితి దుర్భరంగా మారిందని, కూలీలు తమ సొంత గ్రామాలకు చేరేందుకు వందల కిలోమీటర్లు నడవడం చూస్తుంటే మనసు కలిచివేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

రైతులు తమ పంటలను పొలంలో, రోడ్డు మీద వదిలేస్తున్నారని, భవన నిర్మాణ కార్మికులు, చేతి వృత్తులు, ఆటోడ్రైవర్లు ఉపాధి కోల్పోయారని బాబు అన్నారు. కరోనా కట్టడి కంటే స్థానిక ఎన్నికలే ముఖ్యంగా వైఎస్సార్సీపీ వ్యవహరిస్తోందని మండిపడ్డారు. లాక్‌డౌన్‌ ఉన్నప్పటికీ మద్యం విక్రయాలు జరుగుతున్నాయని అన్నారు. విపత్తులు వచ్చినప్పుడే నాయకత్వ సమర్థత బయటపడుతుందన్నారు. కానీ, ప్రస్తుతం ఏపీ పరిస్థితి చూస్తే, కరోనా నియంత్రణ చేతకాక కరోనాతో కలిసి జీవించాల్సిందే అన్నట్టు పాలకులు చేతులెత్తేసిన పరిస్థితి నెలకొందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో పౌరులుగా మనమే బాధ్యతను నిర్వర్తించాలని దిశా నిర్దేశం చేశారు. మన ఊరు-మన వార్డు-మన సమాజాన్ని మనమే కాపాడుకోవాలని సూచించారు. ఆరోగ్యంలో ముందు జాగ్రత్తలు పాటిస్తూ, శారీరక ఆరోగ్యాన్ని, మానసిక దృఢత్వాన్నీ పెంచుకోవాలని హితవు పలికారు. మనం క్షేమంగా ఉందాం, మన సమాజాన్ని సురక్షితంగా ఉంచుదామని పిలుపునిచ్చారు.

Tags: tdp, chandrababu naidu, open letter, ysrcp, jagan, open letter to ap people

Next Story

Most Viewed