మరింత ముదిరిన హెచ్‌సీఏ వివాదం

by  |
మరింత ముదిరిన హెచ్‌సీఏ వివాదం
X

దిశ, స్పోర్ట్స్ : హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (Hyderabad Cricket Association) ఆఫీస్ బేరర్ల మధ్య ఏర్పడిన వివాదం చిలికి చిలికి గాలి వానలా మారుతున్నది. అధ్యక్షుడు అజారుద్దీన్‌పై పలు ఆరోపణలు చేస్తూ సభ్యులు బీసీసీఐ కార్యదర్శి (BCCI Secretary) జై షాకు లేఖ రాశారు. తాజాగా ఇద్దరు ఉద్యోగులు తనతో పాటు అంపైర్ (Umpire) యూసుఫ్‌ను దూషించారని, మా ఇద్దరిపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆశ్రయిస్తూ ఉప్పల్ పోలీసులకు పిర్యాదు చేశారు. హెచ్‌సీఏ కోశాధికారి (HCA Treasurer) సురేందర్ అగర్వాల్, అసోసియేషన్ సభ్యుడు సయ్యద్ మొయిజుద్దీన్‌లు ఇలా ప్రవర్తించారని పేర్కొంటూ అజారుద్దీన్ పోలీసులను ఆశ్రయించారు.

అజార్ పిర్యాదుతో కేసు నమోదు చేసినట్లు ఉప్పల్ సీఐ రంగస్వామి స్పష్టం చేశారు. హెచ్‌సీఏ అంబుడ్స్‌మన్, ఎథిక్స్ అధికారిగా దీపక్ వర్మను అజారుద్దీన్ ఏకపక్షంగా నిర్ణయించారని ఆరోపిస్తూ ఇటీవల ఆఫీస్ బేరర్లు ఆయనపై తిరుగుబాటు చేసిన విషయం తెలిసిందే. దీపక్ వర్మ విషయం ఏజీఎంలో చర్చించకుండానే నెలకు రూ.2 లక్షల వేతనంతో ఈ నెల మొదటి వారంలో అజార్ నియమించారు. ఇదే సభ్యుల మధ్య వివాదానికి దారి తీసింది.

తాజాగా ఇద్దరు ఉద్యోగులు తమపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని అజార్ పోలీసులకు పిర్యాదు చేయడంతో ఈ వివాదం మరింతగా ముదిరింది. మరోవైపు అజారుద్దీన్‌కు వ్యతిరేకంగా మెజార్టీ సభ్యులు కార్యదర్శి విజయానంద్ నేతృత్వంలో భేటీ అయినట్లు తెలుస్తున్నది. ఈ నెల 15న అపెక్స్ కౌన్సిల్ సమావేశం జరగాల్సి ఉండగా ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. హెచ్‌సీఏలోని మెజార్టీ సభ్యులు, క్లబ్స్ మద్దతుతో అజారుద్దీన్‌పై క్రమశిక్షణ చర్యలు తీసుకునే దిశగా అసమ్మతి వర్గం పావులు కదుపుతున్నట్లు తెలుస్తున్నది.

Next Story