ఆయేషా మీరా హత్య కేసు.. సత్యంబాబు సంచలన ఫిర్యాదు

by  |
ఆయేషా మీరా హత్య కేసు.. సత్యంబాబు సంచలన ఫిర్యాదు
X

దిశ, ఏపీ బ్యూరో: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన బీఫార్మసీ విద్యార్థిని అయేషా మీరా హత్య కేసులో నిర్దోషిగా విడుదలైన సత్యంబాబు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించారు. నిర్దోషిగా విడుదలైన తనకు ఇప్పటి వరకు ఎలాంటి న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేశాడు. సత్యంబాబు ఫిర్యాదుపై జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్ గురువారం ఢిల్లీలో విచారణ జరపనుంది. విచారణలో పాల్గొనేందుకు సత్యంబాబుతోపాటు దళిత సంఘాల ప్రతినిధులు, పౌరహక్కుల సంఘం నేతలు ఇప్పటికే ఢిల్లీకి చేరుకున్నారు.

అలాగే విచారణకు హాజరుకావాలని విజయవాడ పోలీసులకు కమిషన్ నోటీసులు జారీ చేయడంతో ఒక ఏసీపీని విచారణ నిమిత్తం అధికారులు ఢిల్లీకి పంపారు. ఈ వ్యవహారంపై కమిషన్ ఎలా స్పందిస్తుందన్నది ఆసక్తికరంగా మారింది. ఇకపోతే అయేషా కేసులో విజయవాడ పోలీసులు సత్యంబాబును అరెస్ట్ చేశారు. ఈ కేసులో సత్యంబాబు తొమ్మిదేళ్ల జైలు శిక్ష అనుభవించాడు. 2017లో హైకోర్టు ఆయనను నిర్దోషిగా తేల్చడంతో జైలు నుంచి విడుదలయ్యాడు.

సత్యంబాబును నిందితుడిగా చూపించిన అప్పటి పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వం అతడికి నష్టపరిహారం ఇవ్వాలని హైకోర్టు ఆదేశించింది. ఈ రెండూ అమలుకాని పక్షంలో జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను ఆశ్రయించవచ్చని హైకోర్టు తన తీర్పులో స్పష్టం చేసింది. సత్యంబాబుకు రూ.10 లక్షలు, రెండు ఎకరాల భూమి, ఇల్లు మంజూరు చేశామని హైకోర్టు తీర్పు తర్వాత కృష్ణా జిల్లా అధికారులు ప్రకటించారు. అయితే ఆ మూడు ఇప్పటి వరకు తనకు అందలేదని జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌‌కు ఇచ్చిన ఫిర్యాదులో సత్యంబాబు పేర్కొన్నాడు.


Next Story