మెదక్ డీసీసీబీ చైర్మన్‌కు జాతీయస్థాయి ఉత్తమ అవార్డు

134
Devender Reddy

దిశ, కొండపాక: జాతీయ స్థాయి ఉత్తమ డీసీసీబీ చైర్మన్‌గా చిట్టి దేవేందర్ రెడ్డి అవార్డును అందుకున్నారు. దేశ వ్యాప్తంగా ఉన్న అన్ని డీసీసీబీల్లో తెలంగాణ రాష్ట్రంలోని ఉమ్మడి మెదక్ జిల్లా డీసీసీబీ మెరుగైన పనితీరును కనబర్చడంతో ఆయనకు ఈ అవార్డు దక్కింది. గురువారం ఢిల్లీలోని కాన్స్టిట్యూషనల్ క్లబ్ ఆఫ్ ఇండియాలో జరిగిన అవార్డుల ప్రధానోత్సవంలో కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ చేతుల మీదుగా చిట్టి దేవేందర్ రెడ్డి ఈ అవార్డును అందుకున్నారు. ఈ కార్యక్రమానికి ఆయనతోపాటు సీఈవో శ్రీనివాస్ హాజరయ్యారు.

ఈ సందర్భంగా కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మ.. మెదక్ డీసీసీబీ పనితీరును ప్రశంసించారు. కేవలం మూడేళ్లలో లక్షా 60 వేల మంది రైతులకు ఆర్థికపరమైన సేవలను అందించడంతో పాటు బ్యాంకు లావాదేవీలను రూ.450 కోట్ల నుంచి రూ.1650 కోట్ల వరకు విస్తరించేలా కృషి చేయడం అభినందనీయం అన్నారు. ఈ సందర్భంగా చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డిని, బ్యాంకు సిబ్బంది సేవలను కొనియాడారు.

డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్ రెడ్డి మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి హరీష్ రావులు అందించిన ప్రోత్సాహంతో దేశంలోనే ఉత్తమ ఫలితాలు సాధించేలా రైతులకు మెరుగైన సేవలను అందించగలిగామని అన్నారు. భవిష్యత్తులో కార్పొరేట్ బ్యాంకులకు ధీటుగా డీసీసీబీ ద్వారా రైతులకు సేవలను అందిస్తామని తెలిపారు. జాతీయస్థాయిలో అవార్డు రావడం వెనక సిబ్బంది పట్టుదల, కృషి ఉన్నదన్నారు. జాతీయస్థాయి అవార్డుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని దేవేందర్ రెడ్డి పేర్కొన్నారు.