'పుచ్చ రైతుకు' పుట్టెడు కష్టాలు !

by  |
పుచ్చ రైతుకు పుట్టెడు కష్టాలు !
X
– దళారుల దందాతో పెట్టుబడి ఖర్చులూ డౌటే

దిశ, వెబ్‌డెస్క్ : దేశానికి వెన్నెముక రైతన్న, మరి ఆ రైతుకు వెన్నెముక మాత్రం ప్రకృతే. ఎందుకంటే విత్తు నాటే దశ నుంచి కోత కోసి మార్కెట్‌కు తరలించేదాకా ప్రకృతి సహకరించకుంటే రైతు పడ్డ శ్రమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది. అధిక వర్షపాతం, కాళేశ్వరం ప్రాజెక్టు వినియోగంలోకి రావడంతో ఈ రబీ సీజన్‌లో తెలంగాణలో మొదటిసారిగా అత్యధిక విస్తీర్ణంలో వరి పంట చేతికందబోతోంది. ఈ తరుణంలో.. ప్రపంచ దేశాలను వణికిస్తోన్న కరోనా ‘పుచ్చ రైతులను’ కాటు వేసింది. పుచ్చ పంట విరివిగా మార్కెట్‌కు వచ్చే సమయానికే దేశవ్యాప్తంగా లాక్ డౌన్ విధించడంతో.. కొనుగోళ్ళు లేక ప్రధాన మార్కెట్లన్నీ వెలవెలబోతున్నాయి. ఇదే అదనుగా భావించిన చిన్నా చితకా వ్యాపారులు, దళారులు.. రైతుల దగ్గర నుంచి పంటను ‘కారు చౌక’గా కొనేందుకు బేరాలాడుతుండటం అన్నదాత కన్నీళ్ళకు కారణమవుతోంది. చూస్తూ చూస్తూ.. దళారులు చెప్పే రేటుకు పంటను అమ్ముకోలేక, అక్కడక్కడా రైతులే ట్రాలీల్లో వేసుకొని ఊరూరా తిరిగి అమ్ముకుంటూ నష్టాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తున్నారు. అయినా లాక్ డౌన్ పరిస్థితుల్లో ఇది కూడా పూర్తి స్థాయిలో ఫలితాలివ్వడం లేదు.

పెట్టుబడి ఖర్చులైనా..

పుచ్చ పంట సాగుకు ఒక ఎకరానికి రూ. 15 వేల వరకు పెట్టుబడి ఖర్చవుతుంది. మూడు నెలల పంట కాలంలో రైతు శ్రమ దీనికి అదనం. సాధారణంగా మార్కెట్‌లో ఒక టన్ను పుచ్చకాయలకు సుమారు రూ. 8 నుంచి 10 వేల వరకు ధర పలుకుతుంది. కాగా, ఒక ఎకరాకు 8 టన్నుల పైనే దిగుబడి వచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన ఎకరా పుచ్చ తోటకు రూ. 70 వేల పైన ఆదాయం రావాల్సి ఉండగా.. కరోనా కారణంగా ప్రధాన మార్కెట్లలో కొనుగోళ్ళు నిలిచిపోయాయి. దీంతో రైతులు దళారులను ఆశ్రయిస్తుండగా.. వారు చెప్పే ధరలు విని షాక్ అవుతున్నారు. ఒక టన్నుకు కేవలం రూ. 2000 చెల్లిస్తామంటూ రైతుల పరిస్థితిని తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు. పోనీ కొన్ని రోజులు ఆగుతామంటే పంట పాడయ్యే అవకాశం ఉంది. చేసేదేం లేక కొందరు రైతులు దళారులకు విక్రయిస్తుండగా.. వెసులుబాటు ఉన్నవారు ఊరూరా తిరిగుతూ లేదా రైతు బజార్లలో విక్రయిస్తున్నారు. ఇలా పెట్టుబడి ఖర్చులైనా మిగుల్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. కాగా, దళారుల దందాలకు చెక్ పెట్టి, ప్రభుత్వమే పుచ్చ రైతులను ఆదుకోవాలని పలువురు రైతులు కోరుతున్నారు.

లక్ష రూపాయలు నష్టపోయాను:

పొన్న రాజు, పుచ్చ రైతు, జనగామ జిల్లా రెండెకరాల విస్తీర్ణంలో పుచ్చ పంట సాగు చేశాను. పెట్టుబడికి రూ. 30 వేలు ఖర్చయ్యాయి. తీరా పంటను మార్కెట్‌కు తీసుకెళ్ళే సమయానికి లాక్ డౌన్‌తో మార్కెట్లు బందయ్యాయి. దళారులేమో రెండెకరాల పంటకు కేవలం రూ. 25 వేలే ఇస్తామన్నారు. ఓ వైపు పెట్టుబడి ఖర్చులు కూడా వచ్చేలా లేవు. ఆలస్యం చేస్తే పంట పాడైపోతుంది. ఇక నేనే ట్రాలీలో తీసుకెళ్ళి ఊరూరా అంగళ్ళలో, రైతు బజార్లలో విక్రయించగా రూ. 50 వేలు వచ్చాయి. ఈ లెక్కన లక్ష రూపాయల వరకు నష్టపోయాను.

Tags : Watermelon, farmers, Brokers, Markets, Corona, Lock down

Next Story

Most Viewed