Judima : అస్సాం ‘జుడిమా వైన్’‌కు భౌగోళిక గుర్తింపు

by  |
Judima : అస్సాం ‘జుడిమా వైన్’‌కు భౌగోళిక గుర్తింపు
X

దిశ, ఫీచర్స్: మణిపూర్‌లో అత్యంత ప్రసిద్ధి చెందిన ‘హథెయ్ మిరపకాయ, తమెంగ్‌లాంగ్ ఆరెంజ్‌’కు భౌగోళిక ట్యాగ్ లభించిన విషయం తెలిసిందే. తాజాగా అస్సాం ‘జుడిమా రైస్ వైన్’ కూడా ఈ జాబితాలో చేరింది. ఒక ప్రాంతంలో పండించే లేదా తయారు చేసే ప్రత్యేక వస్తువులు, ఉత్పత్తులకు జియోగ్రాఫికల్ ట్యాగ్(Geographical Indication) గుర్తింపు లభిస్తుంది. జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ ఆఫ్ గూడ్స్ (రిజిస్ట్రేషన్ అండ్ ప్రొటెక్షన్) యాక్ట్ 1999 ప్రకారం వీటిని కేటాయిస్తారు. కాగా, ఈ ట్యాగ్ పొందిన ఉత్పత్తులను సదరు యజమాని అనుమతి లేకుండా మరెక్కడా ఉత్పత్తి చేయడానికి లేదా పండించడానికి వీల్లేదు. దీనివల్ల వాటికి అంతర్జాతీయ మార్కెట్‌లో ఆదరణ పెరుగుతుంది.

‘జుడిమా’ అనేది స్టిక్కీ రైస్‌తో తయారు చేసిన బియ్యపు వైన్. సంప్రదాయ మూలికలతో ఆవిరిపై ఉడికించి దీన్ని రూపొందిస్తారు. రాష్ట్రంలోని దిమాసా తెగ ప్రజల ప్రత్యేక పానీయంగా పరిచయమైన జుడిమా తయారీకి వారం రోజుల సమయం పడుతుంది. రుచిపరంగా తియ్యగా ఉండే పానీయాన్ని ఏడాదిపాటు నిల్వ చేసుకోవచ్చు. నివేదికల ప్రకారం.. కొండప్రాంత జిల్లాలైన ‘కర్బి ఆంగ్లాంగ్, డిమా హసావో’ నుంచి జీఐ ట్యాగ్ పొందిన రెండో ఉత్పత్తి ఇది. ఈ సంప్రదాయ పానీయాన్ని బ్రాండ్‌గా మార్చి భవిష్యత్ తరాలకు కూడా పరిచయం చేయాలనే ఉద్దేశంతో ఓ గ్రూపుగా ఏర్పడిన స్థానిక పౌరులు.. GI ట్యాగ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. కాగా ‘జుడిమా వైన్’ దుర్వినియోగాన్ని ఈ ట్యాగ్ అరికట్టగలదని అధికారులు భావిస్తున్నారు.

సామాజిక, సాంస్కృతిక జీవనంలో అంతర్భాగం..
దిమాసా ప్రజల సామాజిక, సాంస్కృతిక జీవనంలో జుడిమా అంతర్భాగం. పొరుగు జిల్లా అయిన ‘కర్బి ఆంగ్లాంగ్’కు చెందిన అల్లానికి భౌగోళిక గుర్తింపు లభించిన 14 ఏళ్ల తర్వాత జుడిమాకు ట్యాగ్ రావడం సంతోషకరం. అస్సాం వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన నలుగురు శాస్త్రవేత్తలు(కిషోర్ కుమార్, శర్మ, ఎస్. మైబోంగ్సా, ఉత్తమ్ బైథారి) జుడిమా డాక్యుమెంటేషన్‌లో పాల్గొన్నారు.
– అశోక్ భట్టాచార్య, యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ రీసెర్చ్(అగ్రికల్చర్)


Next Story