బీజేపీలోకి అశ్వత్థామ రెడ్డి.. ఈటల ఇంట్లో…

by  |
Ashwathama Reddy will Ready to join Bharatiya Janata Party
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: ఆర్టీసీ సంఘాల నేతగా తనకంటూ ప్రత్యేకతను చాటుకున్న అశ్వత్థామ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు. వనపర్తి జిల్లా బలిజపల్లి- జంగమయ్య పల్లి జంట గ్రామాలలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన అశ్వత్థామ రెడ్డి తన విద్యాభ్యాసం అంతా వనపర్తి లో పూర్తి చేసుకున్నారు. 1988లో ఆర్టీసీలో ఉద్యోగిగా చేరారు. తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాలలో ఉద్యోగిగా విధులు నిర్వహిస్తూనే కార్మిక సంఘం నేతగా గుర్తింపు పొందారు. మొదట్లో నేషనల్ మజ్దూర్ యూనియన్ లో సభ్యునిగా, అనంతరం రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గాను పని చేశారు. తెలంగాణ ఉద్యమ సమయంలో ఆర్టీసీ కార్మిక సంఘాలను ఏకతాటిపైకి తీసుకువచ్చి సకలజనుల సమ్మె ఉద్యమంలో పాల్గొనేలా చేయడంలో తనవంతు పాత్రను పోషించారు.

నేషనల్ మజ్దూర్ యూనియన్ ను వీడి తెలంగాణ మజ్దూర్ యూనియన్ ను స్థాపించారు. దాదాపుగా పది సంవత్సరాల పాటు రాష్ట్ర యూనియన్ ప్రధాన కార్యదర్శిగా కొనసాగారు. కార్మికుల హక్కుల కోసం పోరాటాలు చేసే క్రమంలో,2019 అక్టోబర్ లో ఆర్టీసీ కార్మికుల పిఆర్ సి కోసం చేసిన సమ్మెతో అధికార పార్టీ నేతలకు దూరమయ్యారు.రెండు నెలల క్రితం యూనియన్ కు రాజీనామా చేశారు.ఈ క్రమంలో అశ్వత్థామ రెడ్డి ఏదైనా రాజకీయ పార్టీలో కి చేరుతారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆయన శుక్రవారం భారతీయ జనతా పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జీ తరుణ్ చుగ్ ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఈటల రాజేందర్ ఇంట్లో నిర్వహించిన సమావేశానికి హాజరయ్యారు.

ఈ సందర్భంగా పలువురు బీజేపీ నేతలు అశ్వత్థామ రెడ్డి ని తరుణ్ చుగ్ కు పరిచయం చేసినట్లు సమాచారం. ఎటువంటి షరతులు లేకుండా పార్టీలో చేరడానికి అశ్వత్థామ రెడ్డి అంగీకరించినట్లు సమాచారం. పార్టీ అధిష్టానం ఏ బాధ్యతలు అప్పగించినా, ఏ నియోజకవర్గం నుండి పోటీ చేయాలని ఆదేశించినా అందుకు కట్టుబడి ఉంటానని అశ్వత్థామ రెడ్డి బిజెపి నేతలకు తెలిపినట్లు సమాచారం. కాగా ఈ నెల 14న ఈటెల రాజేందర్ తోపాటు ఢిల్లీలో అశ్వత్థామ రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరనున్నారు.


Next Story

Most Viewed