హైదరాబాద్‌లో మెట్రో ఫ్రీ జర్నీ సాధ్యం కాదా ?

by  |
హైదరాబాద్‌లో మెట్రో ఫ్రీ జర్నీ సాధ్యం కాదా ?
X

దిశ, వెబ్‌డెస్క్: వీలైతే నాలుగు రెచ్చగొట్టే మాటలు, కుదిరితే ఓ రాజకీయ గొడవ. పోయేదేముంది డూడ్, మహా అయితే తిరిగి ఓటర్లే మేయర్‌ పీఠం ఇస్తారు. ఇది గ్రేటర్‌లో పొలిటికల్ పార్టీల తీరు. ఆరాటానికి, హామీలకు హద్దుల్లేకుండా వారం రోజులుగా పోటీపడి మరి మేనిఫెస్టోలు ప్రకటిస్తున్న పొలిటీషియన్ల తీరు ఆస్కార్ రేంజ్ ప్రదర్శనలకు ఏమాత్రం తీసిపోవడం లేదు. ఒకరు 20వేల లీటర్ల నీళ్లు ఫ్రీ అంటే, మరొకరు 30వేలు, ఇవేగాక హేర్ కటింగ్ సెంటర్లకు సైతం కరెంట్ ఫ్రీ అంటూ.. కుల రాజకీయాలు మొదలు పెట్టారు. వీటిన్నింటికి మించి నిన్న బీజేపీ ప్రకటించిన.. మహిళలకు మెట్రో, సిటీ బస్సుల్లో ఫ్రీ జర్నీ అన్న హామీ ఆశ్యర్యానికి గురిచేసింది. అయితే ఇచ్చిన హామీ పేదల పాలిట వరమే అయినా అసలు ఇది సాధ్యమా ? అనే విషయం చర్చకు వస్తుంది.

గురువారం హైదరాబాద్ బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మేనిఫెస్టోను విడుదల చేసిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఫడ్నవీస్.. గ్రేటర్ ప్రజలు ఊహాల్లో తేలియాడేలా హామీలను వినిపించారు. ఇప్పటికే టీఆర్ఎస్, కాంగ్రెస్ మేనిఫెస్టోల్లోని అంశాలే అమలుకు సాధ్యమా అని ఓవైపు తీవ్రంగా చర్చ జరుగుతుండగా.. ఆ హామీలకు ఇంకింత షుగర్ యాడ్ చేసి ఓటర్లను ప్రసన్నం చేసుకునే ప్రయత్నం చేశారు. స్టూడెంట్స్‌కు ఉచితంగా ట్యాబ్‌లు, ఫ్రీ వైఫై, 24గంటలు ఇంటింటికి డ్రింకింగ్ వాటర్, ఆటో డ్రైవర్లకు ఇన్సూరెన్స్‌తో పాటు ఏడాదికి రూ.7వేల సాయం, ఎల్ఆర్ఎస్ రద్దు, ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద లక్ష మంది పేదలకు సొంత ఇళ్లు, కిలో మీటర్‌కో లేడీస్ టాయిలెట్ అంటూ ప్రజల దృష్టి ఒక్కసారిగా ఆకర్షించేలా చేశారు. ఇవన్నీ ఓ ఎత్తు అయితే మెట్రో రైళ్లు, సిటీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణమని అదిరిపోయే ఆఫర్ ప్రకటించారు.

ఢిల్లీలో 2020 అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే హామీని సీఎం కేజ్రీవాల్ ఇచ్చినప్పుడు వ్యతిరేకించిన బీజేపీ.. ఇప్పుడు అదే ఆమ్ఆద్మీ పార్టీ మేనిఫెస్టోను కాపీ కొట్టింది. మరి ఢిల్లీలో సాధ్యంకాదని ప్రచారం చేసిన సదరు నేతలు.. ఇప్పుడు హైదరాబాద్‌లో అమలు చేస్తామని ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు ప్రయత్నిస్తుండటం గమనార్హం. నేటివరకూ ఢిల్లీ సీఎం కేజ్రీవాల్.. మెట్రోలో మహిళలకు ఉచిత ప్రయాణ హామీని అమలు చేయలేదు. అసలు అమలవుతుందో లేదో తెలియని పరిస్థితి. అక్కడే రూపుదాల్చని ఆ హామీ.. పీపీపీ పద్ధతిలో నిర్మితమైన మన హైదరాబాద్ మెట్రోలో ఎలా సాధ్యమవుతుందన్నది ఆశ్చర్యంగా మారింది. ప్రారంభంలో జోష్‌గా నడిచినప్పటికీ.. కరోనా తర్వాత ప్రయాణికులను ఆకట్టుకునేందుకు ఆఫర్ల మీద ఆఫర్లు పెడుతున్న మెట్రో.. మళ్లీ లాభాల్లోకి వచ్చి మహిళలకు ఉచిత సర్వీసులను అందించగలదా అన్న ప్రశ్నలను లెవనెత్తుతోంది.

ఇటు.. మెట్రోనే గాక తెలంగాణ ఆర్టీసీ సైతం నష్టాల్లోనే ఉంది. గతంలో కార్మికులు సమ్మె చేసిన సమయంలో నష్టాన్ని పూడ్చేందుకు రాష్ట్ర బడ్జెట్ నుంచి రూ.వెయ్యి కోట్లు అందించి ఆర్టీసీని బతికిస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఒకవేళ ఇప్పుడు గ్రేటర్‌లో బీజేపీ మేయర్ పీఠం దక్కించుకుంటే ఆర్టీసీకి ప్రభుత్వం నుంచి ఆ డబ్బులు ఇస్తారన్న గ్యారెంటీ ఏమాత్రం లేదు. ఇలాంటి పరిస్థితుల్లో మెట్రో, ఆర్టీసీ నష్టాన్ని పూడ్చేందుకు జీహెచ్ఎంసీ పైసలు ఎక్కడి నుంచి తెస్తుందన్న చర్చ మొదలైంది. కేంద్రం నుంచి తెస్తామని బీజేపీ నేతలు చెబుతున్నా.. ప్రతీ సంవత్సరం ఇస్తుందన్న నమ్మకం అస్సలే లేదు. ఇన్ని బాలరిష్ఠాల నడుమ.. మెట్రో, ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు బీజేపీ ఉచిత సర్వీసులు అందించగలదా ? అసలు ఏవిధంగా సాధ్యమవుతుందన్నది మిలియన్ డాలర్ల ప్రశ్న.

Next Story

Most Viewed