ఈ-వ్యర్థాలతో ప్రపంచాధినేతల భారీ శిల్పాలు

by  |
Joe-Rush
X

దిశ, ఫీచర్స్: ప్రపంచంలో ఆర్థికంగా అత్యంత అభివృద్ధి చెందినట్లు భావించే ఏడు దేశాలతో ప్రతి ఏటా ‘జీ-7’ సదస్సు జరుగుతుందని తెలిసిన విషయమే. ఇందులో కెనడా, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, జపాన్, బ్రిటన్, అమెరికా సభ్యదేశాలుగా ఉన్నాయి. కాగా ఈ సదస్సుకు జీ7 దేశాల ప్రభుత్వాధినేతలతో పాటు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు, యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా హాజరవుతారు. మానవ హక్కులు, ప్రపంచ దేశాల అభివృద్ధి, ఆర్థిక సంక్షోభం నుంచి పర్యావరణం వరకు అన్ని అంశాలపై ఇక్కడ చర్చిస్తారు. ఈ మేరకు ప్రతీ సభ్య దేశం.. ఒక్కో ఏడాది జీ7 అధ్యక్ష బాధ్యతను చేపడట్టడంతో పాటు ఆ దేశమే శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తుంది. కాగా ఈ ఏడాది జూన్ 11-13 మధ్య జరిగే రెండు రోజుల జీ-7 సదస్సును యూకే నిర్వహిస్తోంది. ఈ నేపథ్యంలో బ్రిటిష్ కళాకారుడు జో రష్ ‘జీ-7’ నాయకుల ప్రతిమలతో ‘మౌంట్ రష్‌మో‌ర్’ ఆకారంలో ఓ భారీ శిల్పాన్ని సృష్టించాడు. కార్న్‌వాల్‌లో నిర్మించిన ఈ శిల్పం ఎలక్ట్రానిక్ వ్యర్థాలతో తయారు చేయడం విశేషం.

అమెరికా అధ్యక్షులుగా పనిచేసి, జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన ‘జార్జ్ వాషింగ్టన్, థామస్ జెఫర్సన్, థియేడర్ రూజ్ వెల్ట్, అబ్రహాం లింకన్’ శిల్పాలను మౌంట్ కొండపై చెక్కారు. దీన్నే ‘మౌంట్ రష్‌మోర్’గా పిలుస్తారు. ఆ అద్భుత శిల్పాన్ని తలపించేలా బ్రిటిష్ కళాకారుడు జో రష్ జీ-7 ప్రభుత్వాధినేతల ప్రతిమలను e-వ్యర్థాలతో అత్యద్భుతంగా తీర్చిదిద్దాడు. అతడు రూపొందించిన ఈ కళాకృతికి ‘మౌంట్ రీసైకిల్‌మోర్’ అని పేరు పెట్టాడు. ఈ శిల్పకళలో యూకే ప్రధాన మంత్రి బోరిస్ జాన్సన్, జపాన్ ప్రధాన మంత్రి యోషిహిడే సుగా, ఫ్రెంచ్ అధ్యక్షుడు ఇమ్మాన్యుయేల్ మాక్రాన్, ఇటలీ ప్రధాన మంత్రి మారియో ద్రాగి, కెనడియన్ ప్రధాని జస్టిన్ ట్రూడో, జర్మనీ చాన్సలర్ ఏంజెలా మెర్కెల్, యూఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్’ ఉన్నారు. ఎలక్ట్రానిక్ వ్యర్థాలను పారవేయడం వల్ల కలిగే నష్టాన్ని ప్రపంచానికి చెప్పే ప్రయత్నంలో జో రష్ దీన్ని రూపొందించాడు. శిఖరాగ్ర సదస్సు జరిగే కార్బిస్ బే హోటల్‌కు సమీపంలోని శాండీ ఎకరాల్లో 12 టన్నుల e-వ్యర్థాలతో చేసిన ఈ భారీ శిల్పరాజం.. సదస్సుకు హాజరయ్యే నాయకులకు కనిపించేలా తీర్చిదిద్దాడు జో రష్.

‘2019లో ప్రపంచవ్యాప్తంగా 53 మిలియన్ టన్నులకు పైగా e-వ్యర్థాలు పోగయ్యాయని ఐక్యరాజ్యసమితి నివేదిక తెలిపింది. ఎలక్ట్రానిక్ పరికరాల విపరీత వాడకంతో వాటి వ్యర్థాలు ఎక్కువై జనజీవనానికి ముప్పు వాటిల్లుతోంది. దీనికి అడ్డుకట్ట వేయకపోతే పర్యావరణంపై దుష్ప్రభావం తప్పదు. కాబట్టి ప్రపంచంలోని అత్యంత అధునాతన ఆర్థిక వ్యవస్థల నాయకులు వాతావరణ మార్పులను ఎలా ఎదుర్కోవాలి, పచ్చటి భవిష్యత్తును ఎలా నిర్మించాలో చర్చించడానికి సిద్ధమవుతున్న వేళ.. e-వ్యర్థాల ప్రపంచ సమస్యను వెలుగులోకి తీసుకురావడమే మా లక్ష్యం. ఒకరితో ఒకరం మాట్లాడుకుని ఈ సమస్యను పరిష్కరించుకుందాం’ అని జో రష్ భావిస్తున్నాడు.

Next Story