అక్రమ సంపాదనకై అడ్డదారి.. అంతలోనే అలా దొరికిపోయారు

69
marijuana

దిశ, కోదాడ: భారీ మొత్తంలో గంజాయిని తరలిస్తూ.. పట్టుబడ్డ సంఘటన కోదాడ బస్టాండ్‌లో చోటుచేసుకుంది. కోదాడ పట్టణంలో అక్రమంగా గంజాయిని తరలిస్తూ.. పోలీసులకు చిక్కిన నేరస్తుల వివరాలను జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ విలేకర్ల సమావేశంలో శనివారం వెల్లడించారు. తక్కువ కాలంలో ధనవంతులు కావాలనే అత్యాశతో అక్రమ సంపాదన పై అడ్డదారులు తొక్కుతున్నారన్నారు. అక్రమంగా గంజాయి రవాణా చేస్తూ అడ్డంగా బుక్కయ్యారని తెలిపారు.

marijuana

మహారాష్ట్రకు చెందిన సయ్యద్ అస్సలాం కార్ డ్రైవర్ గా పని చేస్తున్నారు. ఈ క్రమంలో వృత్తిలో భాగంగా నాందేడ్ నవి బస్తీ లోకి వెళ్ళాడు. ఆ ప్రాంతంలో చాలామంది గంజాయి సేవిస్తూ కనిపించారు. వారిలో ఒక వ్యక్తి గంజాయి అమ్ముతుండగా ఆ వ్యక్తి ద్వారా గంజాయి ఎక్కడి నుంచి తెచ్చి ఏ విధంగా అమ్ముతున్నారని వివరాలను అడిగి తెలుసుకున్నారు. గంజాయిని ఆంధ్రాలోని విశాఖపట్నం దగ్గర గల అరకు ప్రాంతంలో ఒక కిలో రెండు వేల రూపాయల చొప్పున కొనుగోలు చేస్తున్నట్లు తెలుసుకున్నాడు. రెండు వేల రూపాయలకు కొనుగోలు చేసి.. 20 ప్యాకెట్లు విడదీసి, వెయ్యి రూపాయల చొప్పున అమ్మడంతో 20 వేల రూపాయల వరకు ఆదాయం వస్తుందని సదురు వ్యక్తి చెప్పాడు.

దీంతో ఆంధ్ర ప్రాంతం నుంచి గంజాయిని తక్కువ ధరకు కొని బస్సులో నాందేడ్ తీసుకొనివచ్చి చిన్న చిన్న ప్యాకెట్లు విడదీసి అమ్మితే ఎక్కువ లాభం వస్తుందని నిర్ణయించుకున్నాడు. దీంతో తనకు పరిచయం ఉన్న హనుమాన్, లక్ష్మణ్ రావు, రాహుల్ గౌతమి తో కలిసి ఈనెల 14వ తారీఖున ఆంధ్ర ప్రాంతంలోని విశాఖపట్నంలోని అరకు ప్రాంతంలో 57 కిలోల గంజాయిని విక్రయించి తిరిగి 15వ తేదీనా కోదాడ ప్రాంతానికి చేరుకున్నారు. ఈ క్రమంలోనే విశ్వసనీయ సమాచారం మేరకు కోదాడ బస్టాండ్ పరిసర ప్రాంతాల్లో టౌన్ ఎస్ఐ రాంబాబు ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో భాగంగా ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్న పోలీసులు వారి నుంచి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా నిందితుల వద్ద నుంచి 3 మొబైల్ ఫోన్లు కూడా స్వాధీనపరుచుకున్నట్లు తెలిపారు.