కరోనా చికిత్స కోసం 227మంది డాక్టర్ల నియామకం

by  |
కరోనా చికిత్స కోసం 227మంది డాక్టర్ల నియామకం
X

దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా పాజిటివ్ కేసులు జిల్లాల్లోనూ గణనీయ సంఖ్యలో నమోదవుతున్నందున టెస్టింగ్ కేంద్రాల్లో, ఆసుపత్రుల్లో చికిత్స అవసరాలకు వీలైనంత త్వరగా డాక్టర్లను నియమించుకోవడంపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. ముఖ్యమంత్రి కేసీఆర్ మూడు రోజుల క్రితమే ఈ విషయాన్ని చెప్పారు. అందులో భాగంగా రాష్ట్ర ప్రజారోగ్య విభాగం రిక్రూట్‌మెంట్ ప్రక్రియను మొదలుపెట్టింది. మొత్తం 227మంది డాక్టర్లను జిల్లాల అవసరాల కోసం రిక్రూట్ చేయాలనుకుంటోంది. ఎంబీబీఎస్ కోర్సును ప్రాథమిక అర్హతగా తీసుకుని ఆపైన ఉన్నత కోర్సులు చదివినవారికి ప్రాధాన్యత ఇవ్వాలనుకుంటోంది.

కాంట్రాక్టు పద్ధతిలోఎంబీబీఎస్ స్థాయి డాక్టర్‌కు కనీసంగా రూ. 40వేల నెలసరి వేతనాన్ని ఇవ్వాలని నిర్ణయించింది. కోర్సు, సీనియారిటీని ప్రామాణికంగా తీసుకుని అదనపు స్కేల్‌ను చెల్లించడానికి కూడా మార్గదర్శకాలను రూపొందిస్తూ ఉంది. మొత్తంగా 227మందిని రిక్రూట్ చేసుకుని పది మందిని హైదరాబాద్‌లో ఉంచుకుని మిగిలినవారిని జిల్లాలకు నియమించాలనుకుంటోంది. ప్రజారోగ్య విభాగం పరిధిలోనే ఈ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ రెండు మూడు రోజుల్లోనే పూర్తికానున్నట్లు ఉన్నతాధికారి ఒకరు తెలిపారు.

రెండేళ్ళ క్రితం సుమారు 500మంది డాక్టర్లను నియమించినప్పుడు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ప్రస్తుత కరోనా అవసరాలకు కాంట్రాక్టు పద్ధతిలో నియమించుకోవాలన్నది ఈ విభాగం ఆలోచన. వారికి ఇప్పటికే ఆఫర్ లెటర్లను పంపడం మొదలైందని ఆ అధికారి తెలిపారు. కరోనా పరిస్థితి ఉన్నంత వరకువారిని ఈ అవసరాలకు వినియోగించుకుంటామని, ఆ తర్వాత వారిని రెగ్యులరైజ్ చేయడం గురించి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటుందని తెలిపారు.



Next Story

Most Viewed