భారత్‌లో రికార్డు సృష్టించిన యాపిల్

by  |
భారత్‌లో రికార్డు సృష్టించిన యాపిల్
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రపంచ టెక్ దిగ్గజం యాపిల్(Apple) సంస్థ భారత్‌లో తొలిసారిగా ఆన్‌లైన్ స్టోర్‌ను ఈ ఏడాది ప్రారంభించిన సంగతి తెలిసిందే. అయితే, అంతర్జాతీయంగా ఐఫోన్ అమ్మకాలు క్షీణించినప్పటికీ, దేశీయంగా అద్భుతమైన అమ్మకాలను యాపిల్ సంస్థ నమోదు చేసింది. దేశీయ స్మార్ట్‌ఫోన్ విభాగంలో ప్రస్తుత ఏడాది సెప్టెంబర్ త్రైమాసికంలో అమ్మకాల పరంగా రికార్డును సృష్టించింది.

ఈ త్రైమాసికం ఆర్థిక ఫలితాల ప్రకటన నేపథ్యంలో యాపిల్ సీఈవో టిమ్ కుక్ మాట్లాడుతూ.. అమెరికా, సెప్టెంబర్, ఆసియా పసిఫిక్ దేశాలతో సహా భారత్‌లో రికార్డు స్థాయి అమ్మకాలను దక్కించుకున్నామని చెప్పారు. సెప్టెంబర్ చివరి వారంలో భారత్‌లో తమ తొలి ఆన్‌లైన్ స్టోర్‌ను ప్రారంభించిన తర్వాత అద్భుతమైన ఆదరణ సాధించామని, ఈ సందర్భంగా యాపిల్ యూజర్లకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెబుతున్నట్టు టిమ్ కుక్ తెలిపారు.

ఇక సెప్టెంబర్‌తో ముగిసిన త్రైమాసిక ఫలితాలను యాపిల్ వెల్లడించింది. ఈ త్రైమాసికంలో యాపిల్ అంతర్జాతీయ అమ్మకాలు 20 శాతం తగ్గాయి. మార్కెట్ పరిశోధనా సంస్థ కెనాలిస్ ప్రకారం.. జులై-సెప్టెంబర్ మధ్యకాలంలో యాపిల్ సంస్థ భారత్‌కు 8 లక్షలకు పైగా ఐఫోన్‌లను రవాణా చేసింది. ఈ విక్రయాలతో ఐఫోన్ రెండంకెల వృద్ధిని నమోదు చేసిందని నివేదిక స్పష్టం చేసింది. ధరల పరంగా భారత మార్కెట్‌కు అనుగుణంగా యాపిల్ సరైన అంచనాలతో ముందుకెళ్తోందని, ఈ త్రైమాసికంలో ఐఫోన్ ఎస్ఈ-2020, ఐఫోన్ 11 మోడళ్లతో వ్యూహాత్మకంగా కొనసాగుతోందని కౌంటర్ పాయింట్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాథక్ చెప్పారు.

తాజాగా విడుదలైన ఐఫోన్ 12తో రానున్న త్రైమాసికంలో యాపిల్ సంస్థ భారత మార్కెట్లో మరింత బలమైన స్థానాన్ని దక్కించుకోవచ్చని తెలుస్తోంది. భారత్‌లో ఆన్‌లైన్ స్టోర్ ద్వారా యాపిల్ ప్రీ-ఆర్డర్లలో ఐఫోన్ 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లకు ఆదరణ లభించినట్టు మార్కెట్ వర్గాలు వెల్లడించాయి.

Next Story