భారత్‌కు యాపిల్ ఐప్యాడ్ తయారీ ప్లాంట్!

by  |
Apple lobbies
X

దిశ, వెబ్‌డెస్క్: దేశీయంగా ఎలక్ట్రానిక్స్ పరికరాల తయారీని ప్రోత్సహించడానికి గతేడాది ప్రభుత్వం రూ. 48 వేల కోట్ల ప్రోత్సాహకాలు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు ప్రముఖ టెక్ దిగ్గజం యాపిల్ ప్రయత్నిస్తోంది. దేశీయంగా ఐప్యాడ్ తయారీ కోసం ప్లాంట్‌ను ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉంది. గతేడాది కరోనా మహమ్మారి తర్వాతి పరిణామాల్లో యాపిల్ సంస్థ చైనాపై ఆధారపడటాన్ని తగ్గించేందుకు సిద్ధమైంది. దీనికోసం భారత్‌లో ఐఫోన్ తయారీని పెంచింది. ఇటీవల కేంద్రం దేశీయంగా ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్లు సహా ఐటీ ఉత్పత్తుల తయారీ కోసం ఉత్పత్తి అనుసంధాన ప్రోత్సాహక పథకం ద్వారా ప్రోత్సాహకాలను అందించేందుకు సిద్ధమవుతోంది.

ఈ పథకం ద్వారా ఎగుమతుల ఆధారిత తయారీదారులకు రాబోయే ఐదేళ్లలో రూ. 7 వేల కోట్ల క్యాష్‌బ్యాక్ అందించాలని ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో యాపిల్ సంస్థ ప్రభుత్వ ప్రోత్సాహకాన్ని మరింత పెంచేందుకు ఇతర సంస్థలతో కలిసి ప్రయత్నాలు సాగిస్తోంది. భారత్‌లో సరఫరా వ్యవస్థ మరింత అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని, కాబట్టి ప్రోత్సాహకాన్ని పెంచాలని కోరుతోంది. కాగా, ప్రస్తుతం యాపిల్ సంస్థ ఐప్యాడ్ ఉత్పత్తిని అత్యధికంగా చైనాలోనే తయారు చేస్తోంది. అమెరికా, చైనా మధ్య కొనసాగుతున్న వాణిజ్య ప్రతికూల ప్రభావం కారణంగా చైనా నుంచి తయారీ ప్లాంట్‌లను భారత్, వియత్నాంలకు తరలించాలని భావిస్తోంది.

Next Story