కుల గణనకు సిఫారసు చేయండి.. జాతీయ బీసీ కమిషన్‌కు విజ్ఞప్తి

by  |
కుల గణనకు సిఫారసు చేయండి.. జాతీయ బీసీ కమిషన్‌కు విజ్ఞప్తి
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇకపై చేపట్టబోయే జన గణనలో బీసీ కులాల ఆధారంగా కూడా లెక్కింపు, వివరాల సేకరణ జరగాలని, ఈ మేరకు కేంద్ర ప్రభుత్వానికి సిఫారసు చేయాలని జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్ భగవాన్‌లాల్ షైనీకి రాష్ట్ర బీసీ కమిషన్ ఛైర్మన్ వకుళాభరణం కృష్ణమోహన్ విజ్ఞప్తి చేశారు. దేశంలో జంతువులకూ ఓ లెక్క ఉందని, కానీ బీసీ జనాభా విషయంలో మాత్రం అలాంటి లెక్కలే లేవని, అందువల్ల త్వరలో మొదలయ్యే జనగణనలో ఈ అంశాన్ని చేర్చాలని కోరారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడకపూర్వమే 22 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలంటూ కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి వెళ్ళిందని, దానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని భగవాన్‌లాల్ షైనీకి సమర్పించిన మెమొరాండంలో వకుళాభరణ పేర్కొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత మరో 18 కులాలు చేరాయని, మొత్తం 40 కులాలను ఓబీసీ జాబితాలో చేర్చాలని కోరారు. ఇందులో 37 కులాలకు సంబంధించిన పూర్తి వివరాలను కూడా మెమొరాండంతో కలిపి సమర్పించారు.

రాష్ట్రాల జాబితాలో బీసీ కులాలుగా ఉన్నప్పటికీ కేంద్ర ఓబీసీ జాబితాలో చేరని కారణంగా కేంద్ర ప్రభుత్వ సర్వీసుల్లో, విద్యా సంస్థల్లో అవకాశాలను కోల్పోతున్నట్లు వకుళాభరణం వివరించారు. సుప్రీంకోర్టు, జాతీయ బీసీ కమిషన్ సహా అనేక రాష్ట్రాల్లోని బీసీ సంక్షేమ సంఘాలు, ప్రజలు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్న కులగణన చేపట్టడానికి విముఖత చూపిస్తున్నదని, రాజ్యాంగబద్ధమైన అధికారం ఉన్నందున సిఫారసు చేయాలని జాతీయ బీసీ కమిషన్ ఛైర్మన్‌కు వకుళాభరణం విజ్ఞప్తి చేశారు. రాష్ట్రాల జాబితాల్లోని బీసీ కులాల వివరాల గురించి జాతీయ కమిషన్ ఇటీవల మూడు రోజుల పాటు సమావేశమై ప్రజాభిప్రాయాన్ని సేకరించడం పట్ల వకుళాభరణం కృతజ్ఞతలు తెలిపారు.

Next Story

Most Viewed