కాలినడకన కాశీ టు తెనాలి..!

by  |
కాలినడకన కాశీ టు తెనాలి..!
X

దిశ, ఆదిలాబాద్:

వాళ్లంతా వాళ్ల పూర్వీకులు, పితృదేవతలకు పిండాలు పెట్టేందుకు వెళ్లారు. మనసు నిండా పెద్దలను తలచుకుని కాశీ యాత్రకు వెళ్లి పిండ తర్పణం పూర్తి చేసుకున్నారు. తిరుగుముఖం పట్టేందుకు సిద్ధమవుతున్న వేళ నోవెల్ కరోనా వైరస్ (కొవిడ్-19) పిడుగు పడింది. ఒక్కసారిగా సుమారు వందమందికి పై ఆ ప్రభావం పడింది. మార్చి 22న జనతా కర్ఫ్యూ ఆ మరుసటి రోజున లాక్‌డౌన్ అమల్లోకి వచ్చింది. ఊరు గానీ ఊరు.. తెలిసిన వారెవ్వరూ లేరు.. అటు ఇటుగా రెండు వేల కిలోమీటర్ల దూరం. ఎక్కడికక్కడ రాకపోకలు నిలిచిపోయాయి. ఈ పరిస్థితుల్లో ఏమైనా మార్పు వస్తుందా..! అని రెండ్రోజులు ఎదురు చూశారు. ఇక తప్పదు అనుకుని కాలి నడక మొదలు పెట్టారు. వారు బుధవారం ఉదయం నిర్మల్ జిల్లా కేంద్రానికి చేరుకున్నారు. వారంతా ఏపీలోని తెనాలి, గుంటూరు, విజయవాడ సమీప ప్రాంతాలకు చెందిన వారు.సుమారు 20 రోజుల కాలినడక ప్రయాణం తర్వాత బాగా అలసిపోయిన వారు బుధవారం నిర్మల్‌కు చేరుకోగానే 100 నెంబర్‌కు డయల్ చేశారు. తమ సమస్యలు వివరించారు. కాశీ‌కి వెళ్లామనీ, రవాణా సౌకర్యాలు లేకపోవడంతో సొంత ఊరికి వెళ్లాలన్నా లక్ష్యంగా కాలినడకనే బయలుదేరామని కన్నీటి పర్యంతం అవుతూ చెప్పుకొచ్చారు. సగం దూరం వచ్చామనీ, ఇంకో సగముందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఆదుకున్న పోలీసులు సమాచారం తెలుసుకున్న పోలీసులు వారిని చేరదీశారు. వారికి అవసరమైన సహాయాన్ని అందించారు. బ్రేక్ ఫాస్ట్‌తోపాటు, మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేశారు. ఆ తర్వాత వారికి అవసరమైన తినుబండారాలు అందించి తమ సేవా తత్పరతను చాటుకుంటున్నారు. ఎస్పీ శశిధర్ రాజు సూచన మేరకు వారికి అవసరమైన సపర్యలు చేశామని నిర్మల్ పట్టణ సీఐ జాన్ దివాకర్ తెలిపారు.

Tags: ap tenali people, kaashi, covid 19 affect, lockdown, no transport, on foot

Next Story