సెకి నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్సీ గ్రీన్ సిగ్నల్

by  |
సెకి నుంచి విద్యుత్ కొనుగోలుకు ఏపీఈఆర్సీ గ్రీన్ సిగ్నల్
X

దిశ,ఏపీబ్యూరో: సోలార్ ఎనర్జీ కార్పొరేషన్( సెకి) నుంచి సౌర విద్యుత్‌ కొనుగోలుకు ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సెకి నుంచి ఏపీ ప్రభుత్వం విద్యుత్‌ కొనుగోలు చేయాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు సెకి నుంచి 7 వేల మెగావాట్ల సౌర విద్యుత్ కొనుగోళ్లకు ఏపీ డిస్కంలకు ఈఆర్‌సీ అనుమతి ఇచ్చింది. 2024 సెప్టెంబర్ నుంచి పాతికేళ్లపాటు ఏడాదికి 15 వేల మిలియన్ యూనిట్ల మేర సెకి నుంచి కొనుగోలు చేస్తామన్న ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.

సెప్టెంబర్ 2024 నాటికి 3 వేల మెగావాట్లు, సెప్టెంబర్ 2025 నాటికి మరో 3 వేల మెగావాట్లు, సెప్టెంబర్ 2026 నాటికి 1000 మెగావాట్ల మేర సెకి నుంచి కొనుగోలు చేసేందుకు ఈఆర్‌సీ అంగీకారం తెలిపింది. సౌర విద్యుత్ కొనుగోళ్ల విషయంలో త్రైపాక్షిక ఒప్పందానికి ఏపీ ఈఆర్‌సీ ఆమోదం తెలిపింది. వీలింగ్ చార్జీలు, నెట్‌వర్క్‌ చార్జీలను ప్రభుత్వం నుంచి క్లయిమ్ చేసుకోవాల్సిందిగా ఏపీ ఈఆర్‌సీ సూచించింది. ఇకపోతే రైతులకు 9 గంటల ఉచిత విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం ఈ సౌర విద్యుత్‌ను కొనుగోలు చేయనుంది. 25 ఏళ్ల పాటు ఉచిత విద్యుత్‌ అందించేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించనుంది.

ఇదిలా ఉంటే సబ్సిడీ బకాయిలపై ఏపీ ఈఆర్‌సీ ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. ఏపీ సీఎస్, డిస్కంలకు, ఇంధన శాఖ సెక్రెటరీకి బకాయిలు విడుదల చేయాలని కోరుతూ లేఖ రాసింది. రూ.25,257 కోట్ల బకాయిలపై ఈఆర్‌సీ రాసిన ఈ లేఖను పీఏసీ చైర్మన్ పయ్యావుల కేశవ్ బయటపెట్టిన సంగతి తెలిసిందే. ఈ నెల 9న ఏపీ ఈఆర్‌సీని కలిసి ఇంధన శాఖలో పరిస్థితులు, నిర్ణయాలపై ఈఆర్‌సీకి ఆయన ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో ఏపీ ఈఆర్‌సీ లేఖ రాయడం ప్రాధాన్యత సంతరించుకున్న సంగతి తెలిసిందే.

ప్రభుత్వం నుంచి డిస్కంలకు రావాల్సిన రూ.15474 కోట్ల సబ్సిడి బకాయిలు వెంటనే చెల్లించాలని.. డిస్కంలకు చెల్లింపులు జరిపేలా ప్రభుత్వం యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని సూచించింది. అలాగే స్థానిక సంస్థలు, ఇతర ప్రభుత్వ శాఖల నుంచి రావాల్సిన రూ.9,783 కోట్లను డిస్కంలు వసూలు చేయాలని పేర్కొంది. బకాయిల చెల్లింపులపై 14 రోజుల గడువుతో నోటీసులు ఇవ్వాలని సూచించింది. 14 రోజుల్లోగా స్పందన రాకపోతే విద్యుత్ సరఫరా నిలిపివేయాలని ఆదేశించిన సంగతి తెలిసిందే.

Next Story