ఏపీ పాలిసెట్-2021 ఫలితాలు విడుదల

by  |
ఏపీ పాలిసెట్-2021 ఫలితాలు విడుదల
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ పాలిసెట్-2021 ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. రాష్ట్ర ఐటీ శాఖమంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి బుధవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలియజేశారు. మంచి ఉత్తీర్ణత సాధించిన ప్రతి ఒక్కరికీ అభినందనలు తెలియజేశారు. ఈ ఫలితాల్లో అత్యధిక ఉత్తీర్ణత శాతం శ్రీకాకుళం జిల్లా సాధించినట్లు వెల్లడించారు. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా బాలికల ఉత్తీర్ణత సాధించగా..ప్రకాశం జిల్లాలో అత్యధిక బాలురు ఉత్తీర్ణత సాధించారని మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి తెలిపారు. మరోవైపు జగనన్న విద్యాదీవెన ద్వారా 81వేల మంది విద్యార్థులకి రూ.128 కోట్లు అందజేసినట్లు మంత్రి పేర్కొన్నారు. 72 వేల మంది విద్యార్థులకి రూ.54 కోట్లు జగనన్న వసతి దీవెనగా అందించామని మేకపాటి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో టెక్నికల్ ఎడ్యుకేషన్ కమిషనర్ పోలా భాస్కర్, నైపుణ్యాభివృద్ధి, శిక్షణ శాఖ ముఖ్యకార్యదర్శి జయలక్ష్మి, ఎంప్లాయిమెంట్, ట్రైనింగ్ డైరెక్టర్ లావణ్యవేణి, నైపుణ్యాభివృద్ధి సంస్థ ఎండీ బంగారు రాజులు పాల్గొన్నారు.

వారం రోజుల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ..

ఈ ఏడాది పాలిసెట్‌కు 74,884 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా 68,208 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల్లో 64,187 మంది ఉత్తీర్ణత సాధించారు. అయితే ఈ ఫలితాల్లో ఇద్దరు విద్యార్థులు 120 మార్కులతో మెుదటి ర్యాంకు సాధించారు. విశాఖపట్నం జిల్లాకు చెందిన కే రోషన్‌లాల్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వివేక్‌ వర్థన్‌లు ఈ ఘనత సాధించారు. వారం రోజుల్లో కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రారంభించబోతున్నట్లు మంత్రి గౌతమ్‌రెడ్డి తెలిపారు. ఈ ఏడాది పాలిసెట్‌లో కొత్త కోర్సులు ప్రవేశపెట్టబోతున్నట్లు తెలిపారు. అర్హులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ కూడా అందజేస్తున్నట్లు చెప్పుకొచ్చారు. పాలిటెక్నిక్ విద్యార్థుల ప్రతిభను గుర్తించేందుకు ప్రభుత్వం అన్ని విధాలా తగిన చర్యలు తీసుకుంటుందని మంత్రి మేకపాటి గౌతమ్‌రెడ్డి తెలిపారు.


Next Story