హై లెవల్ మీటింగ్‌లో జగన్ ఏం చెప్పారంటే?

by  |
హై లెవల్ మీటింగ్‌లో జగన్ ఏం చెప్పారంటే?
X

దిశ ఏపీ బ్యూరో: నాడు-నేడులో భాగంగా 15 వేల స్కూళ్లలో అభివృద్ది పనులు జరుగుతున్నాయని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ తెలిపారు. నాడు-నేడు, సాగునీటి ప్రాజెక్టులు, వాటర్‌గ్రిడ్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టులకు నిధుల అనుసంధానంపై తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ, ఏడాదిన్నరలోగా విద్యారంగంలో నాడు-నేడు పనులు పూర్తి కావాలని ఆదేశించారు. ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతగా భావిస్తున్న నాడు-నేడు, సాగునీటి ప్రాజెక్టులు, వాటర్‌గ్రిడ్, మౌలిక సదుపాయాల కల్పన ప్రాజెక్టుల విషయంలో నిధులకు కొరత రాకుండా పటిష్ట ప్రణాళికతో ముందుకు సాగాలని అధికారులను ఆదేశించారు.

‘విద్యారంగంలో నాడు-నేడు’

లక్ష్యాలకు కాలపరిమితి విధించుకుని కచ్చితమైన ప్రణాళికతో ముందడుగు వేయాలని సూచించారు. విద్యారంగంలో సంస్కరణలకు కీలకమైన నాడు-నేడు కార్యక్రమం ప్రభుత్వానికి అత్యంత ప్రధానమైనదని ఆయన స్పష్టం చేశారు. నాడు-నేడు కార్యక్రమంలో ఇప్పటి వరకు చేసిన పనులు విడుదలైన నిధులు, ఇకపై సమీకరించాల్సిన నిధులు చేయాల్సిన పనులపై అధికారులకు సూచనలు చేశారు. విద్యారంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు సుమారు 3600 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేయగా, ఇప్పటి వరకు 920 కోట్లు విడుదల చేశామని చెప్పారు. మిగిలిన నిధుల కోసం చర్యలు చేపట్టాలని సీఎం సూచించారు. ఆగస్టు 15 నాటికి తొలివిడత నాడు–నేడు పనులు పూర్తి చేసి, మలివిడతకు ప్రణాళిక సిద్ధం చేయాలని సూచించారు. పాఠశాలలు, హాస్టళ్లు, జూనియర్, డిగ్రీ కళాశాలల్లో రెండు, మూడో విడత నాడు–నేడు కార్యక్రమాల కోసం 7700 కోట్లు ఖర్చు అవుతాయని అంచనా వేశామని అధికారులు సీఎంకు తెలిపారు.

తాగు, సాగు నీటి ప్రాజెక్టులు

అక్టోబర్‌ 1 నుంచి రాయలసీమ కరువు నివారణా పనులు ప్రారంభించాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో ప్రతి కుటుంబానికీ రక్షిత తాగునీటి పథకంలో భాగంగా చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని తొలిదశలో శ్రీకాకుళం జిల్లా ఉద్దానం, ఉభయగోదావరి జిల్లాలు, గుంటూరులోని పల్నాడు, ప్రకాశం జిల్లాలోని కనిగిరి ప్రాంతం, చిత్తూరు జిల్లాలోని పశ్చిమ ప్రాంతం, కడప జిల్లాలో వాటర్‌ గ్రిడ్‌ ప్రాజెక్టుకోసం 19,088 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అన్నారు. ఇప్పటికే నిధుల సమీకరణ టై అప్‌ జరిగిందని అధికారులు సీఎంకు తెలిపారు. దీంతో సీఎం.. కర్నూలు జిల్లాలోని పశ్చిమ ప్రాంతంలోని 7 నియోజకవర్గాలతో పాటు, డోన్‌ నియోజకవర్గం, ప్రకాశం జిల్లాలోని మిగిలిన పశ్చిమ ప్రాంతం, అనంతపురం జిల్లాలో వాటర్‌ గ్రిడ్‌ పనులు చేపట్టాలని, వీటికి సంబంధించి డీపీఆర్‌లు సిద్ధంచేసి టెండర్లు పిలవాలని ఆదేశించారు. దీంతో హైబ్రీడ్‌ యాన్యునిటీ (హెచ్‌.ఎ.ఎం.) విధానంలో చేపడుతున్న వాటర్‌ గ్రిడ్‌ పనులకు అక్టోబరు టెండర్లు ఖరారు చేసిన వెంటనే వర్క్ ఆర్డర్లు ఇస్తామని అధికారులు తెలిపారు.

ఇప్పటికే పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులతో పాటు త్వరలో చేపట్టబోయే సాగునీటి ప్రాజెక్టుల కోసం 98,000 కోట్ల రూపాయలు అవసరమవుతాయని అధికారులు సీఎంకి సూచించారు. ఇందులో 72,000 కోట్ల రూపాయలు కొత్త ప్రాజెక్టుల కోసం అయితే రాయలసీమలోని కరవు నివారణ పనులతో పాటు వివిధ అసంపూర్తి ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు అవసరమని చెప్పారు. ఇందుకు సంబంధించిన ఫైనాన్షియల్ ఇయర్ పూర్తవుతుందని అక్టోబరు 1 నుంచి రాయలసీమ కరువు నివారణ పనులు ప్రారంభం కావాలని, ఇందుకోసం వీలైనంత త్వరగా టెండర్లు ఖరారు చేసి, పనులు మొదలుపెట్టాలని ఆదేశించారు. అలాగే పోలవరం నుంచి వరద జలాల తరలింపు కోసం తలపెట్టిన స్టేట్‌ వాటర్‌ సెక్యూరిటీ డెవలప్‌మెంట్‌, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడులో కరవు నివారణ-తాగునీటి వసతి కల్పన, కృష్ణా–కొల్లేరు ప్రాంతం ఉప్పు నీటిమయం కాకుండా పనులు ప్రాధాన్యతా క్రమంలో చేపట్టాలని సీఎం అధికారులను ఆదేశించారు.

వైద్యారోగ్యం

వైద్యారోగ్య రంగంలో సంస్కరణల్లో భాగంగా 16 కొత్త మెడికల్‌ కాలేజీలు, 1 సూపర్‌ స్పెషాల్టీ, 1 క్యాన్సర్‌ ఆస్పత్రి, 1 మానసిక చికిత్సాసుపత్రి నిర్మించనున్నామని ఇందుకోసం 6,657 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని అంచనా వేసినట్టు అధికారులు తెలిపారు. ప్రస్తుతం ఉన్న 11 ఆస్పత్రులు, 6 అనుంబంధ సంస్థలు, 7 మల్టీ సూపర్‌ స్పెషాల్టీ ఆస్పత్రుల ఏర్పాటుకు మరో 6,099 కోట్లు ఖర్చు అవుతాయని అధికారులు సీఎంకి చెప్పారు. నాడు-నేడు కార్యక్రమంలో భాగంగా ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ ఆస్పత్రుల్లో మౌలిక సదుపాయాల కల్పనకు మరో 1,236 కోట్ల రూపాయలు ఖర్చవుతాయని తెలిపారు. పాత పీహెచ్‌సీల పునరుద్దరణతో పాటు కొత్త వాటి నిర్మాణానికి ఇంకో 671 కోట్ల రూపాయల ఖర్చవుతాయని, విలేజ్‌ క్లినిక్స్‌లో 11,197 కేంద్రాల పునరుద్ధరణ మరియు కొత్త వాటి నిర్మాణం కోసం మరో 1,745 కోట్ల రూపాయలు ఖర్చవుతుందని అధికారులు తెలిపారు. దీంతో ఇప్పటికే విడుదలైన నిధులతో పనులు వేగవంతం చేయాలని, అవసరమైన నిధులు సమీకరించాలని అధికారులను ఆదేశించారు.

Next Story

Most Viewed