అబద్దాలు వద్దు.. నిజాయతీగా ఉందాం: జగన్

by  |
అబద్దాలు వద్దు.. నిజాయతీగా ఉందాం: జగన్
X

దిశ, ఏపీ బ్యూరో: ఏపీ నూతన పారిశ్రామిక విధానం నిజాయతీగా ఉండాలని, గత ప్రభుత్వంలా మోసపూరిత మాటలు వద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తెలిపారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో స్టేట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్రమోషన్‌ బోర్డుపై సమీక్ష నిర్వహించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వందల కోట్ల రూపాయల ఖర్చుచేసి పరిశ్రమను పెడుతున్నప్పుడు, అనుకున్న సమయానికి ప్రారంభమయ్యేలా చూద్దామన్నారు. ప్రభుత్వం తరపున వారి కార్యకలాపాలకు ఊతమిచ్చి చేదోడుగా నిలుద్దామని చెప్పారు. స్థిరమైన పెట్టుబడులు రావాలన్నా, పదికాలాలపాటు పరిశ్రమలు చక్కగా నడవాలన్నా అనుకూల పారదర్శక విధానాలు ఉండాలని ఆయన సూచించారు.

పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో కాలుష్య నివారణా పద్ధతుల్లో నిపుణులైన, ప్రఖ్యాత వ్యక్తులతో ఒక కమిటీని నియమించాలన్నారు. ఇందులో కనీసం నలుగురు సభ్యులుండాలని సూచించారు. ప్రపంచ ప్రఖ్యాత సంస్థలతో పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డును టై అప్‌ చేయాలని ఆదేశించారు. పరిశ్రమ ఏర్పాటు చేస్తానని ఎవరైనా ముందుకు వస్తే… ఆ ప్రతిపాదనను ముందుగా పొల్యూషన్‌ కంట్రోల్‌ బోర్డులో ఉన్న నిపుణులకు పంపాలన్నారు. అలా చేయడం వల్ల పొల్యూషన్ కంట్రోల్ కమిటీతో పాటు అదివరకే టైఅప్‌ అయిన సంస్థలు కూడా సదరు ప్రతిపాదనపై అధ్యయనం చేస్తాయన్నారు. ఆ సిఫారసుల ఆధారంగా స్టేట్‌ ఇండస్ట్రీస్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ కమిటీ ముందుకు ఆ ప్రతిపాదన పంపిస్తారని చెప్పారు.

ఆ కమిటీ ప్రతిపాదిత పరిశ్రమకు చెందిన వారితో సమావేశమై రాష్ట్ర ప్రభుత్వ పాలసీని వివరించి, అవగాహన కల్పిస్తారన్నారు. అప్పుడు పెట్టుబడుల్లో వారి విశ్వసనీయత, సమర్థతలను ఎస్‌ఐసీసీ పరిశీలించి అంగీకారం తెలిపితే, ఆ ప్రతిపాదన ఎస్‌ఐపీబీ ముందుకు వస్తుందని చెప్పారు. అక్కడ ఎస్ఐపీబీ ప్రజెంటేషన్ ఇచ్చిన తరువాత ప్రభుత్వం కంపెనీకి క్లియరెన్స్ ఇస్తుందని జగన్ అన్నారు. ఆ తరువాత పరిశ్రమ ఏర్పాటుకి చేయూతగా సింగిల్‌ విండో విధానం ఉంటుందని ఆయన చెప్పారు.

ఇలా చేయడం వల్ల పెట్టుబడిదారులకు రిస్క్‌ తగ్గుతుందని, అనుకున్న సమయానికి పరిశ్రమలు ప్రారంభం అయ్యేందుకు తగిన తోడ్పాటు లభ్యమవుతుందని ఆయన తెలిపారు. పెట్టుబడిదారులకు ఇదే ప్రోత్సాహంగా నిలిచి, పరిశ్రమలతో పాటు ప్రజలకు కూడా మేలు జరుగుతుందని ఆయన విశ్లేషించారు. పరిశ్రమలు రావడం, తద్వారా ఉద్యోగాల కల్పన ముఖ్యమన్న ఆయన అదే సమయంలో ప్రజలకు, పర్యావరణానికి హాని జరకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.

Next Story

Most Viewed