ఆ సమస్యను మనమే పరిష్కరించుకుందాం..!

by  |
ఆ సమస్యను మనమే పరిష్కరించుకుందాం..!
X

తెలుగు రాష్ట్రాల మధ్య రాజుకున్న జలవివాదాలకు ఫుల్‌స్టాప్‌ పడనుందా? ఈ అంశం కేంద్రం దాకా పోకుండా ఇక్కడే పరిష్కరించుకోవాలని తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావిస్తున్నారా? అంటే ఔననే సమాధానమే వస్తోంది. ‘‘ఇద్దరు కొట్టుకుంటే మూడోవారికి సందు దొరుకుతుంది. కేంద్రం చేతికి జుట్టు అందితే రెండు రాష్ట్రాలకూ తలనొప్పి వ్యవహారమే. సామరస్యంగా జల వివాదాలను ముగించుకోవడమే మేలు’’ అనేదే వారి అభిప్రాయం అని అంటున్నారు. ఇందుకోసం తెలంగాణ సీఎం కేసీఆర్, ఏపీ సీఎం జగన్ త్వరలోనే భేటీ కానున్నట్టు తెలుస్తోంది.

దిశ, న్యూస్ బ్యూరో :
కరోనా పరిస్థితులు చక్కబడిన తర్వాత ఇద్దరు ముఖ్యమంత్రులు ముఖాముఖి మాట్లాడుకునే అవకాశం ఉందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు గోదావరి నీళ్లపై కన్నేసిన కేంద్రం ఇం టర్ లింక్ ప్రాజెక్టులకు ప్రాథమిక అంచనాలను సిద్ధం చేసింది. కొవిడ్ ప్రభావం సద్దుమణిగితే వీటి మీద కేంద్రం కసరత్తు చేస్తుందని నీటిపారుదల శాఖ ఇంజనీర్లు చెబుతున్నారు. ఫీజిబిలిటీ రిపోర్టును తమకు పంపక ముందే రెండు రాష్ట్రాలు ఏకాభిప్రాయానికి రావాలనుకుంటున్నాయి. ఇంటర్ లింక్ ఫీజిబిలిటీ రిపోర్టు వస్తే దానిపై ఎలా స్పందించాలి? మిగతా అంశాలపై ఎలా వ్యవ హరించాలి? నీటి వాటాను ఎలా వినియోగించుకోవాలి? తదితర అంశాల మీద చర్చ జరిగే అవకాశముందంటున్నారు. రెండు రాష్ట్రాలకు ప్రస్తుతం కేటాయించిన వాటాను ఎవరెక్కువ, తక్కువ వాడుకున్నారనే అంశాలను పక్కనపెట్టి ముందుగా సామరస్యంగా వివాదాలను పరిష్కరించుకోవాలని, కేంద్రం చేతికి అధికారం ఇవ్వరాదని భావిస్తున్నట్టు తెలుస్తోంది. అందుకే, వచ్చే నెల ఐదున జరిగే ’అపెక్స్’ భేటీ పాల్గొనడానికి ఇద్దరు సీఎంలు కూడా సుముఖంగా లేరని చెబుతున్నారు.

సత్సంబంధాలతోనే..

ఏపీలో జగన్‌ అధికారంలోకి వచ్చిన తరువాత రెండు రాష్ట్రాల మధ్య సత్సంబంధాలు నెలకొన్నాయి. వ్యక్తిగతంగానూ జగన్‌, కేసీఆర్‌కు మధ్య మంచి సంబంధాలు ఉండటంతో విభజన సమస్యలనూ కలిసే పరిష్కరించుకునేందుకు కృషి చేస్తున్నారు. నదీ జలాల విషయంలో మొదట ఎలాంటి విభేదాలు తలెత్తలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు ప్రారంభం సమయంలోనూ ఇద్దరు ముఖ్యమంత్రుల మధ్య సఖ్యత కొట్టొచ్చొనట్టుగానే కనిపించింది. రాయలసీమకు నీళ్లిచ్చేందుకు జగన్‌ పోతిరెడ్డిపాటు ప్రాజెక్టు సామర్థ్యాన్ని పెంచాలని అనుకోగానే మధ్య జల జగడం మొదటికి వచ్చింది. తమకు మాట మాత్రం చెప్పకుండా ఏపీ సీఎం జగన్ ఏకపక్ష నిర్ణయం తీసుకున్నారంటూ తెలంగాణ సీఎం కేసీఆర్‌ చేసిన వ్యాఖ్యలతో వేడి రాజుకుంది. దీని మీద స్పందించిన జగన్‌ తమకు రావాల్సిన నీటి వాటానే మాత్రమే వాడుకుంటామని, అంతకు మించి ఒక్క చుక్క నీటిని కూడా కృష్టా జలాల్లోంచి తీసుకోబోమని స్పష్టం చేశారు. గోదావరి నీటిని తీసుకుంటే తమకు అభ్యంతరం లేదని, తెలంగాణ ప్రయోజనాలకు నష్టం కలిగేలా కృష్ణా జలాలను తీసుకుంటే చూస్తూ ఊరుకోబోమని సీఎం కేసీఆర్ ప్రత్యుత్తరమిచ్చారు.

కరోనా కారణంగా జాప్యం..

కృష్ణా, గోదావరి రివర్‌ బోర్డు సమావేశాల్లో తెలంగాణ ప్రాజెక్టులపై ఏపీ అభ్యంతరాలు లేవనెత్తింది. ప్రాజెక్టులకు సంబంధించిన అన్ని డీపీఆర్‌లు ఇవ్వాలని రెండు రాష్ట్రాలను బోర్డు కోరింది. ఇప్ప టికే గోదావరి జలాల అంశంలో ఏపీకి కొంత మేలు చేసే విధంగా తెలంగాణ ప్రభుత్వం పలు ప్రణాళికలు రూపొందించింది. గోదావరి నీటి అంశంలో ఏపీ, కృష్ణా జలాల్లో తెలంగాణ చూసీ చూడన ట్టుగానే ఉండాలనే ఒప్పందం ఉందని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ వేదికగా ఇరు రాష్ట్రాల సీఎంల సమావేశం జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఆగస్టు ఐదున అపెక్స్ జరగాల్సిన కౌన్సిల్ సమా వేశానికి ముందే మాట్లాడుకుంటే, ఆ తర్వాత వ్యూహం ప్రకారం నడుచుకోవాలనుకుంటున్నట్లు చర్చ జరుగుతోంది.

దూకుడు మీదున్నకేంద్రం..

తెలుగు రాష్ట్రాల జల వివాదాలపై కేంద్రం సమగ్ర వివరాలను సేకరిస్తోంది. జల వివాదాలను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నాలు చేస్తోంది. ఇటీవల నిర్వహించిన బోర్డుల సమావేశాలకు సంబంధించి పూర్తి వివరాలను జల మంత్రిత్వ శాఖ అధికారులు తీసుకున్నారు. రెండు రాష్ట్రాలు చేపట్టిన ప్రాజెక్టులు, నీటి వినియోగం, వరద జలాలు, మిగులు జలాల లెక్కలు, వరద సమయాల్లో సముద్రంలో కలుస్తున్ననీటి అంశాలపై లెక్కలేస్తున్నారు. అపెక్స్ కౌన్సిల్‌లో కేంద్రం స్పష్టమైన నిర్ణయాన్ని ప్రకటించే అవకాశం ఉందని అంటున్నారు.

Next Story

Most Viewed