నంది సిస్టర్‌ల బాల్కనీ బాణీలు!

by  |
నంది సిస్టర్‌ల బాల్కనీ బాణీలు!
X

దిశ, వెబ్‌డెస్క్: బాల్కనీలో ఎవరైనా ఏం చేస్తారు? సాయంత్రం పూట సేదతీరుతారు, లేదంటే బట్టలు ఆరేసుకుంటారు, మొక్కలు పెంచుకుంటారు. కానీ నంది సిస్టర్స్ మాత్రం బాల్కనీలో కచేరీలు నిర్వహిస్తారు. వివిధ భాషల పాటలను చక్కగా ఆలపిస్తారు. వారే సొంతంగా ఉకులెలె వాయించుకుంటూ, కాళ్లతో చేతులతో శబ్ధాలు చేస్తూ పాటలు పాడతారు. ఆరు నెలల క్రితం ప్రారంభమైన వారి బాల్కనీ కాన్సర్ట్‌లో ఇప్పటికి ఎన్నో మంచి పాటలను తమదైన శైలిలో ఆలపించి, వీక్షకులను ఆనందింపజేశారు. కేవలం గొంతుతోనే కాదు.. అందం, అభినయంతో కూడా వారు వీక్షకులను ఆకట్టుకుంటారు. ఏ భాషలో పాటలు పాడితే ఆ భాష సంస్కృతికి తగినట్లుగా దుస్తులు ధరించి, ఆ భాషలోనే వెల్‌కమ్ చెప్పడం వీరి ప్రత్యేకత. మొన్నటికి మొన్న ఎస్‌పీ బాలసుబ్రమణ్యంకు నివాళిగా పాటలు పాడుతూ పెట్టిన వీడియో నిజంగా ఆయనకు అందించిన గొప్ప నివాళులలో ఒకటి.

ఇప్పటికి 16 ఎపిసోడ్‌లు పూర్తయిన వీరి బాల్కనీ కాన్సర్ట్‌లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ, అస్సామీ, బెంగాళీ, మరాఠి, గుజరాతీ, భోజ్‌పురీ భాషల పాటల కవర్ వెర్షన్‌లను పాడారు. అలాగే మదర్స్ డే స్పెషల్, స్వాతంత్ర్య దినోత్సవ స్పెషల్, కృష్ణాష్టమి స్పెషల్ ఎపిసోడ్లలో ఆయా రోజులకు ప్రత్యేకమైన పాటలను ఆలపించారు. బాల్కనీ కాన్సర్ట్ 9వ ఎపిసోడ్‌లో ‘ఈనాడే ఏదో అయ్యింది’ పాటను ఎంతో చక్కగా ఆలపించడం ఒక ఎత్తయితే, పాటకు ముందు తెలుగులో మాట్లాడటానికి ప్రయత్నించిన వారి కష్టాన్ని మెచ్చుకుని తీరాలి. అంతేకాకుండా ఆయా భాషల్లో రెండు లైన్లు మాట్లాడి తర్వాత పాటలు పాడటం కూడా నిజంగా మెచ్చుకోదగ్గ విషయం. ఇంతకీ ఈ సిస్టర్స్ గురించి చెప్పలేదు కదూ!

ఈ అక్కాచెల్లెళ్ల పేర్లు అంతర నంది, అంకిత నంది. వీళ్ల సొంత రాష్ట్రం అస్సాం. అక్క అంతర 2009లో జీ టీవీ వారి సరిగమప లిటిల్ చాంప్స్ కార్యక్రమం ద్వారా సింగర్‌గా పాపులర్ అయింది. తర్వాత 2013లో చెన్నైలోని ఏఆర్ రెహమాన్ కేఎమ్ మ్యూజిక్ కన్సర్వేటరీలో చేరింది. అప్పటికే అస్సామీ, బెంగాళీ భాషల్లో కొన్ని సినిమాలకు పాటలు కూడా పాడింది. తర్వాత తన చెల్లెలు అంకితతో కలిసి ఓ వైపు చదువుకుంటూనే మరోవైపు మ్యూజిక్ వీడియోలు యూట్యూబ్‌లో పెట్టడం ప్రారంభించింది. 2016లో బాజీరావ్ మస్తానీ సినిమాలోని పింగా గపోరి పాటను చప్పట్లు కొడుతూ పాడి పెట్టిన వీరి వీడియో అప్పట్లో వైరల్ అయింది. లాక్‌డౌన్ టైమ్‌లో ఇలా బాల్కనీ కాన్సర్ట్ ఐడియాతో పాటలు పాడటం వాళ్లకు చాలా మంచి పేరును తీసుకువచ్చింది.


Next Story

Most Viewed