ఏఈల నుంచి సీఈల దాకా పాత్రధారులే

by  |
ఏఈల నుంచి సీఈల దాకా పాత్రధారులే
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఇరిగేషన్ శాఖలో మరో అవినీతి బాగోతం బయట పడుతోంది. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం, పాలమూరు-రంగారెడ్డి వంటి భారీ ప్రాజెక్టుల్లో బిజీగా ఉంటే.. ఎస్సారెస్పీ ఇంజినీర్లు మాత్రం ఉన్నంతలో నిధులు మాయం చేయడంలో నిమగ్నమయ్యారు. కోట్ల పనులు చేయకుండానే చేసినట్లు మాయ చేశారని రుజువవుతోంది. గతంలోనే ఆపరేషన్స్ అండ్​మెయింటెనెన్స్ పనుల్లో వందల కోట్ల అవినీతికి పాల్పడిన ఎస్సారెస్పీ ఇంజినీర్లు ఇప్పుడు అదే తరహాలో అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. మూడేండ్ల కిందటే కీలకమైన పనులకు సంబంధించిన ఎంబీలు మాయం చేసినట్లు భావిస్తున్నారు. దీనిలో ఏఈల నుంచి సీఈల వరకు భాగస్వామ్యం ఉన్నట్టు అనుమానాలున్నాయి. అయితే నిధులపై ఆడిట్ విభాగం ఏం చేసిందనేది ఇప్పుడు తేలాల్సిన అసలు ప్రశ్న. ఏటా వెచ్చించిన నిధులపై నీటిపారుదల శాఖ ఆడిట్ చేస్తున్నా.. ఈ ఎంబీలు మాయం కావడం, కోట్ల నిధుల లెక్కలు తేలకపోవడంపై ఎందుకు మౌనం వహించినట్లో ఇంజినీర్లకు కూడా అంతుచిక్కడం లేదు. జల వనరుల శాఖ వరంగల్ సర్కిల్‌లోని ఎస్సారెస్పీ విభాగంలో మూడేండ్ల కిందటే సుమారు 180 ఎంబీలు మాయమైనట్లు తెలుస్తోంది. ఎంబీలు కనిపించడం లేదంటూ తాజాగా శాఖాపరమైన విచారణ మొదలైన నేపథ్యంలో వీటితో సంబంధం లేని ఇద్దరు సిబ్బందికి తొలుతగా నోటీసులు జారీ చేశారు. ఎంబీలు దొరికే వరకు వేతనాలు ఆపాలంటూ నోటీసులిచ్చారు. దీంతో అసలు విషయాలు బయటకు వస్తున్నాయి. అయితే ఈ వ్యవహారం మూడేండ్ల కిందట నుంచే సాగుతోందని తెలుస్తోంది.

పాత సంచుల్లో కొన్ని దొరికాయి

మూడేండ్ల కిందట రికార్డైన పలు బిల్లులకు సంబంధించిన ఎంబీలు ఎక్కడ ఉన్నాయో తేలడం లేదు. మొత్తం 180 ఎంబీలు కనిపించకుండా పోగా.. ఇటీవల ఇరిగేషన్ అధికారులు పలువురి ఇండ్లలో తనిఖీలు చేపట్టారు. గతంలో శాఖలో పని చేసి కీలకంగా చక్రం తిప్పి, పాత అభియోగాలున్న ఒకరిద్దిరి ఇండ్లల్లో తనిఖీలు చేశారు. ఓ ఉద్యోగి గతంలో అద్దెకు ఉన్న ఇంటి నుంచి ఓ అటెండర్ తీసుకుపోయిన పాత సంచుల్లో సుమారు 50 వరకు ఎంబీలు దొరికినట్లు అధికారులు ఆఫ్​ ది రికార్డుగా చెబుతున్నారు. అంటే కార్యాలయాల్లో భద్రంగా ఉండాల్సిన ఎంబీలు ఉద్యోగుల ఇండ్లకు ఎందుకు వెళ్లాయో అధికారులకు కూడా స్పష్టం కావడం లేదు. బిల్లులు చెల్లించిన ఎంబీలు పాత సంచుల్లో కనిపించకుండా పారేశారు. మొత్తం 180 ఎంబీల్లో 50 దొరకగా.. ఇంకా 130 ఎంబీల అడ్రస్​లేదు.

వందల కోట్ల పనులవే?

ఈ ఎంబీలు వందల కోట్ల విలువైన పనులకు సంబంధించినవిగా భావిస్తున్నారు. ప్రధానంగా ఎస్సారెస్పీ ప్రధాన కాలువ, ఉప కాల్వల మరమ్మతులు, ఎస్సారెస్పీ సిబ్బంది నివాస సముదాయాల పనులు చేసినట్లుగా బిల్లులు తీసుకున్న ఎంబీలుగా అనుమానిస్తున్నారు. ఎందుకంటే అధికారులకు కూడా ఆ ఎంబీలు, వివరాలు దొరకడం లేదు. అందుకే వీటిని తీసుకుపోయినట్లుగా భావిస్తున్నారు. వాస్తవంగా 2008 నుంచి 2010 వరకు చేసిన ఇలాంటి పనుల్లోనే ఎస్సారెస్పీ వింగ్‌లో భారీ అవినీతి చోటు చేసుకుంది. ఎస్సారెస్సీ కాల్వల మరమ్మతు పనుల్లో టెండర్లు లేకుండా పనులు చేయడం, పనులను బిట్లుగా విడగొట్టి చేయడం, జంగిల్ కటింగ్, పూడికమట్టి వంటి పనులను చేయకుండానే చేసినట్టు చూపించి దాదాపు రూ.800 కోట్లను పక్కదారి పట్టించిన చరిత్ర ఎస్సారెస్పీలో ఉంది. అలాంటి పనులే ఇప్పుడు చేశారు. వాటికి సంబంధించిన పనుల ఎంబీలే ఇప్పుడు మాయమైనట్లు గుర్తించారు. ఈ లెక్కన వందల కోట్ల పనులకు సంబంధించిన ఎంబీలు కనిపించకుండా పోవడంపై అనుమానాలు మరింత జఠిలమవుతున్నాయి.

ఏఈల నుంచి సీఈల వరకు హస్తం

వాస్తవంగా వర్క్ ఇన్‌స్పెక్టర్ల నుంచి క్షేత్రస్థాయిలో రికార్డు చేసుకునే ఎంబీలు ఏఈలు, డీఈలు, ఈఈలు, ఎస్ఈల నుంచి సీఈల వరకు బాధ్యత తీసుకుంటారు. వీరందరి సంతకాలు పూర్తయిన తర్వాత పేమెంట్ చేస్తారు. అంటే ఏఈల నుంచి సీఈల వరకు ఎంబీల బాధ్యత ఉంటోంది. అయితే ఇప్పుడు మిస్సయిన ఎంబీలు ఇందరి చేతులు మారిన తర్వాత ఎలా కనిపించకుండా పోయాయనేది మిలియన్ డాలర్ల ప్రశ్న. అవి కూడా బిల్లులు చెల్లించిన తర్వాత మిస్ అయ్యాయి. అంటే సంబంధిత ఇంజినీర్లే వాటిని మాయం చేశారా అనేది తేలాల్సి ఉంది. ఇక మూడేండ్ల నుంచి ఈ ఎంబీలు మిస్​అయితే.. సాగునీటి పారుదల శాఖ ఆడిట్ విభాగం ఎందుకు మౌనంగా ఉంటుందో తెలియడం లేదు. వాస్తవంగా ఎస్సారెస్పీలో వెచ్చించిన నిధులు, చెల్లించిన బిల్లులు, వినియోగం అన్నీ ఏటా ఆడిట్‌కు సమర్పిస్తూనే ఉంటారు. కానీ ఈ ఎంబీల విషయంలో మాత్రం అంతా దాచి పెట్టారు. వందల కోట్ల నిధులపై ఆడిట్ అధికారులు ఎందుకు ప్రశ్నించలేదనేది అంతు చిక్కని అంశమే. దీనిలో అంతా కూడబల్కుని అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలున్నాయి.

మిషన్​కాకతీయ బిల్లు కూడా..?

వరంగల్‌లో కనిపించకుండా పోయిన ఎంబీల్లో మిషన్ కాకతీయ పనులకు సంబంధించినవి కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఎస్సారెస్పీ హన్మకొండ సర్కిల్ పరిధిలో కొన్ని గ్రామాల్లో చేపట్టిన మిషన్​కాకతీయకు చెందిన బిల్లులు, ఎంబీలు కూడా ఉన్నాయనే ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం ఎంబీల మాయం ఆ శాఖలో చర్చనీయాంశంగా మారింది. అయితే ఎస్సారెస్పీ మెయిన్ కెనాల్, సబ్ కెనాల్, క్వార్టర్ల మరమ్మతు పనుల ఎంబీలు మాత్రమే అని ముందుగా అనుకున్నారు. కానీ ఆ ఎంబీల్లో కొన్ని మిషన్ కాకతీయలో భాగంగా పలు గ్రామాల్లో చేసిన చెరువు పనులకు సంబంధించినవి కూడా ఉన్నట్లు అనుమానిస్తున్నారు. పలు గ్రామాల్లో ఉన్న చెరువు పనుల్లో తప్పుడు బిల్లులు చేశారని, పూడిక పనుల్లో అవినీతి జరిగిందనే ఆరోపణలున్నాయని, అందుకే ఈ ఎంబీలు కూడా మాయం చేశారనే ప్రచారం జరుగుతోంది.

Next Story

Most Viewed