కొవిడ్ బాధితుల సేవలో ఏఎన్ఎం రచన.. చిన్న వయసులో పెద్ద మనసు

by  |
కొవిడ్ బాధితుల సేవలో ఏఎన్ఎం రచన.. చిన్న వయసులో పెద్ద మనసు
X

దిశ, జగిత్యాల : ధూంపేటలో పుట్టిన ఆ బిడ్డ అందిస్తున్న సేవలు అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నాయి. చదువుకునే పరిస్థితులు ఉన్నా సేవ చేయాలన్న తపనతోనే ఆ బిడ్డ వైద్య రంగాన్ని ఎంచుకుని తనలోని ఔదర్యతను చేతల్లో చాటుకుంటోంది. తల్లిదండ్రులపై ఆధారపడి ఇంకా చదువుకునే నేటి తరానికి భిన్నంగా ఆలోచించింది. వయసు చిన్నదే అయినా ఆమె అందిస్తున్న సేవ విషయంలో హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.

చిన్న గ్రామంలో పుట్టి..

జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం ధూంపేటకు చెందిన కొత్తూరి రచన రాయికల్ ప్రభుత్వ పారామెడికల్ కాలేజీలో ఏఎన్ఎం కోర్సు పూర్తి చేశారు. 2015లో రచన ఈ కోర్సు పూర్తి చేసిన తరువాత కథలాపూర్‌తో పాటు చుట్టు పక్కల ప్రాంతాల్లోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉద్యోగం చేస్తుండేది. ఇటీవలే జగిత్యాలలోని మిత్ర హస్పిటల్‌లో డ్యూటీ లో చేరారు.

కొవిడ్ వార్డులో..

ఆసుపత్రిలోని కొవిడ్ వార్డులో డ్యూటీ చేస్తున్న రచన పేషంట్లకు సేవలందించేందుకు ఏ మాత్రం బెదరడం లేదు. 21 ఏళ్ల వయసున్న రచన ఏ మాత్రం భయం లేకుండా కరోనా బాధితులకు ఆత్మీయురాలిగా మారిపోయింది. వయసు పైబడి ఆసుపత్రిలో చేరిన వారికి భోజనం కూడా తినిపిస్తోంది. డ్యూటీలో ఉన్న సమయంలో పేషెంట్లు ఎప్పుడు పిలుస్తారో తెలియని పరిస్థితుల్లో కూడా.. ఓర్పును ప్రదర్శిస్తూ చిరునవ్వుతో వారికి సేవ చేస్తోంది. ఒక్కోసారి అలసటగా అనిపించి సేద తీరే సమయంలో.. పేషెంట్లు పిలిస్తే వారికి కావల్సినవి సమకూర్చేందుకు గ్లౌజ్ వేసుకోకుండానే సేవ చేస్తున్నారు. ఆ తరువాత శానిటైజ్ చేసుకుంటూ తాను కొవిడ్ బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వయసు పైబడి మాటల్లో చెప్పలేని స్థితిలో ఉండి కొట్టుమిట్టాడుతున్న పేషెంట్ల పరిస్థితిని కూడా అంచనా వేస్తూ వారికి ఏం కావాలో ఊహించి మరీ సమకూరుస్తున్నారు.

మూడు నెలలుగా ఇంటికి వెల్లక..

కరోనా కారణంగా బాధితులకు సేవలందించాల్సి వస్తున్నందున రచన మూడు నెలలుగా ఇంటివైపు కన్నెత్తి కూడా చూడలేదు. ఆసుపత్రి యాజమాన్యం ఏర్పాటు చేసిన వసతిలోనే ఉంటూ నిత్యం తల్లిదండ్రులతో మాట్లాడుతున్నారు. డ్యూటీ అయిపోయిన తరువాత రోజుకోసారి తల్లి, తండ్రితో ఫోన్లో మాట్లాడటం విధిగా పెట్టుకున్నారు రచన. మొదట్లో కరోనా మహమ్మారి అంటే భయంతో తల్లిదండ్రులు వారించినా.. ఆమెలోని సేవాభావమే తనను ముందుకు నడిపించింది. బాధితులకు సేవ చేయడం వల్ల కరోనా అంటుకోదని, జాగ్రత్తలు తీసుకోకపోవడం వల్లే సోకుతుందని పేరెంట్స్‌ను కూడా కన్విన్స్ చేసి మరీ ఒప్పించి కొవిడ్ వార్డులో రచన సర్వీస్ చేస్తున్నారు.

వివక్ష నుంచే సేవ నేర్చుకున్నా..

చిన్పప్పటి నుంచి వివక్షకు గురై.. వయసు పైబడిన వారిని గమనించాను. వారి పట్ల సమాజం చూపుతున్న నిర్లక్ష్యం నా మనసును కలిచివేసింది. అప్పటి నుండే సేవ చేయాలన్న తపన నాలో ఎక్కువైంది. ఇంటర్ కంప్లీట్ చేసిన తరువాత రాయికల్‌లోని గవర్నమెంట్ పారామెడికల్ కాలేజీలో మల్టీపర్పస్ హెల్త్ వర్కర్ ఫిమేల్ కోర్సు పూర్తి చేశాను. మిత్ర ఆసుపత్రిలో కొవిడ్ వార్డులో పేషెంట్లకు సేవ చేయడానికి ముందుకు వచ్చాను. వారిలోనే నా తల్లిని చూసుకుంటూ భోజనం తినిస్తున్నాను. బాధితులకు సేవ చేసిన తరువాత వారి కళ్లల్లో కనిపిస్తున్న ఆనందం నాలో ఎక్కడ లేని తృప్తిని అందిస్తోంది. ఆసుపత్రి యాజమాన్యం కూడా నా సేవలు చూసి అభినందించారు. ఏది ఏమైనా కరోనా బాధితులకు నేను అందిస్తున్న సేవలతో నా లక్ష్యం నెరవేర్చుకుంటున్నానన్న ఫీలింగ్ వస్తోంది.
– రచన



Next Story

Most Viewed