విశాఖలో యువగళం ముగింపు సభ: ముఖ్యఅతిథిగా హాజరుకానున్న పవన్ కల్యాణ్

by Seetharam |
విశాఖలో యువగళం ముగింపు సభ: ముఖ్యఅతిథిగా హాజరుకానున్న పవన్ కల్యాణ్
X

దిశ, డైనమిక్ బ్యూరో : ఏపీలో తెలుగుదేశం పార్టీ ఎన్నికల మూడ్‌లోకి వచ్చేసినట్లు తెలుస్తోంది. చంద్రబాబు నాయుడుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో ఇక ప్రజల్లోకే వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఇందుకు సంబంధించి కార్యచరణ సైతం సిద్ధం చేశారు. 100 రోజుల్లో ప్రతీ గడప గడపను టచ్ చేసేలా పార్టీ కార్యచరణ ఉండాలని టీడీపీ సన్నద్ధమవుతుంది. ఒకవైపు చంద్రబాబు నాయుడు మరోవైపు నారా లోకేశ్‌ ఇద్దరూ నిత్యం ప్రజల్లోనే ఉండేలా కార్యచరణ సిద్ధం అవుతున్నట్లు తెలుస్తోంది. ఇందులో భాగంగా నారా లోకేశ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యువగళం పాదయాత్ర ముగింపునకు ముహూర్తం ఫిక్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ నెల 27న లోకేశ్ యువగళం పాదయాత్రకు యాండ్ కార్డు పడబోతుందని తెలుస్తోంది. ఈ ముగింపు సభను అత్యంత ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. విశాఖట్నం జిల్లాలో ఈ ముగింపు సభకు భారీ జనసమీకరణతోపాటు ప్రముఖ నాయకులు హాజరయ్యేలా కార్యక్రమం రూపుదిద్దుకోబోతుందని తెలుస్తోంది.

వైసీపీతో ఢీ అంటే ఢీ అన్నట్లు..

తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కార్యక్రమం యువగళం. ఈ యువగళం కార్యక్రమం తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం నింపింది. ముఖ్యంగా యువత టీడీపీ పట్ల మరింత ఆకర్షితులయ్యారు. అంతేకాదు ప్రజలు సైతం తమ గోడును నారా లోకేశ్‌ వద్ద వెల్లబోసుకున్నారు. నారా లోకేశ్ సైతం ప్రజల సమస్యలను ఎంతో ఓపికగా ఉంటూ పలు హామీలు సైతం ఇచ్చారు. అన్ని సామాజిక వర్గాల ప్రతినిధులతో లోకేశ్ భేటీ అవ్వడమే కాకుండా ఆ సమస్యల పరిష్కారానికి సైతం దిశానిర్దేశం చేశారు. ఇదే సందర్భంలో కార్మిక, కర్షక సంఘాల నాయకులతో సైతం లోకేశ్ భేటీ అయి వారి భవిష్యత్‌కు సంబంధించి దిశానిర్దేశం చేశారు. దీంతో నారా లోకేశ్ యువగళం పాదయాత్రకు మరింత క్రేజ్ వచ్చింది. అంతేకాదు నారా లోకేశ్ సైతం ఈ యువగళం పాదయాత్రతో తన మాటల తూటాలు పేల్చారు. పదునైన మాటలతో వైసీపీపై విరుచుకుపడ్డారు. వైసీపీని గద్దెదించడమే తన లక్ష్యం అంటూ పదేపదే హెచ్చరించారు. మరోవైపు వైసీపీ అండచూసుకుని కొందరు అధికారులు పెట్రేగిపోతున్నారని అలాంటి వారిని వదిలిపెట్టేది లేదని కూడా వార్నింగ్ ఇచ్చారు. ఇలా అనేక రకాలుగా వైసీపీపై దండెత్తడంతో ఈ పార్టీపై పార్టీ శ్రేణుల్లో కొత్త ఆశలు పుట్టుకొచ్చాయి. అప్పటి వరకు అజ్ఞాతంలో ఉన్న నాయకులు సైతం తాము సైతం అంటూ తెరపైకి వచ్చారు. టికెట్ తమకంటే తమకేనని ధీమా వ్యక్తం చేస్తున్నారు. దీంతో యువగళం పాదయాత్ర టీడీపీకి మైలేజ్ తీసుకు రావడంతో పాటు నారా లోకేశ్ మరింత ఉన్నతమైన నాయకుడిగా.. వైసీపీకి ధీటైన నాయకుడిగా తయారయ్యేందుకు ఇదోక వేదికగా మారింది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

టార్గెట్ @4వేల కిలోమీటర్లు

ఇకపోతే నారా లోకేశ్ ఈ ఏడాది జనవరి 27న తన తండ్రి చంద్రబాబు నాయుడు ప్రాతినిథ్యం వహిస్తున్న చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచే ఈ యువగళం పాదయాత్రను ప్రారంభించారు. ఈ యువగళం ప్రారంభం సందర్భంగా వైసీపీ అనేక విమర్శలు చేసింది. లోకేశ్ వంద కిలోమీటర్లు కూడా నడవలేరంటూ విమర్శలు చేసింది. అలాంటి విమర్శలకు తన పాదయాత్రతో కౌంటర్ ఇచ్చారు నారా లోకేశ్. తానేంటో..తన రాజకీయ చతురత ఏంటో ఈ పాదయాత్ర ద్వారా నిరూపించుకున్నారు. తెలుగు యువతకు పెద్ద దిక్కుగా లోకేశ్ అవతరించారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇకపోతే తొలుత 4వేల కిలోమీటర్లు, 400 రోజుల పాటు యాత్ర సాగించాలని నారా లోకేశ్ లక్ష్యంగా పెట్టుకుని ఈ యువగళాన్ని ప్రారంభించారు. అయితే టీడీపీ చీఫ్ చంద్రబాబు నాయుడు సెప్టెంబర్9న అరెస్ట్ కావడంతో పాదయాత్రకు తాత్కాలిక విరామం పలికారు. ఒకవైపు కుటుంబం.. మరోవైపు పార్టీ ఇంకోవైపు చంద్రబాబు నాయుడు బెయిల్‌కోసం ప్రయత్నాలతో నారా లోకేశ్ బిజీబిజీగా గడిపారు. చంద్రబాబుకు రెగ్యులర్ బెయిల్ మంజూరు కావడంతో మళ్లీ యువగళం పాదయాత్రను పున: ప్రారంభించిన సంగతి తెలిసిందే.


డిసెంబర్ 17న క్లోజ్

తెలుగుదేశం పార్టీకి ఎంతో మైలేజ్ తీసుకువచ్చిన ఈ యువగళం పాదయాత్రను నారా లోకేశ్ ఈ నెలాఖరులోపే ముగింపు పలికేందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి డిసెంబర్ 6న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు యువగళం పాదయాత్ర చేరుకోబోతుంది. అక్కడ నుంచి 11 రోజులపాటు విశాఖపట్నం వ్యాప్తంగా లోకేశ్ పాదయాత్ర చేయబోతున్నారు. వైసీపీ భూ కబ్జాలు, అక్రమాలు, రిషికొండ తవ్వకాలు వంటి అంశాలపై నారా లోకేశ్ వైసీపీని నిలదీయనున్నారు. అనంతరం డిసెంబర్ 17న పాదయాత్రకు ముగింపు పలుకుతారు. అదే రోజు ముగింపు సభను భారీ ఎత్తున నిర్వహించేందుకు ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.

ముగింపు సభకు పవన్ కల్యాణ్

యువగళం పాదయాత్ర ముగింపు సభకు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌లు హాజరుకానున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు విశాఖ పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు వెల్లడించారు. లోకేశ్ పాదయాత్ర డిసెంబర్ 6న అనకాపల్లి జిల్లా పాయకరావుపేటకు చేరుకుంటుందని...అక్కడి నుంచి మొదలై డిసెంబర్ 17తో యాత్ర ముగుస్తుందని పల్లా శ్రీనివాసరావు తెలిపారు. అంతేకాదు విశాఖలో ముగింపు సభ భారీ స్థాయిలో నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది.మహానాడును మించేలా ఈ సభ ఉండబోతుందని.. మిత్రపక్షమైన జనసేనతోపాటు ప్రముఖ నాయకులంతా ఈ సభలో పాల్గొంటారని టీడీపీ నాయకులు చెప్తున్నారు.



Next Story