Ys Vivekha Murder Case: సీబీఐ దూకుడు దేనికి సంకేతం!

by srinivas |
Ys Vivekha Murder Case: సీబీఐ దూకుడు దేనికి సంకేతం!
X
  • వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్​రెడ్డికి నోటీసులు
  • విచారణకు హైదరాబాద్​ రావాలని ఆదేశం
  • రాజకీయ వర్గాల్లో కలకలం
  • సీబీఐకు ఎంపీ అవినాశ్ రెడ్డి లేఖ
  • 5 రోజుల తర్వాత వస్తానని రిప్లై

దిశ, ఏపీ బ్యూరో: మాజీ ఎంపీ వైఎస్​వివేకా హత్య కేసులో సీబీఐ దూకుడు పెంచింది. నిందితుల్లో ఒకరైన కడప ఎంపీ వైఎస్​ అవినాష్​రెడ్డిని విచారణ కోసం హైదరాబాద్​కార్యాలయానికి రావాలని ఆదేశాలు ఇచ్చింది. ఈపాటికే వైఎస్​భాస్కర్​రెడ్డి నివాస పరిసరాలను సీబీఐ పరిశీలించింది. అవినాష్​రెడ్డికి నోటీసులు ఇవ్వడం వెనుక బలమైన రాజకీయ కోణం ఉన్నట్లు వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. రాష్ట్రంలో రాజకీయ సమీకరణల్లో మార్పునకు ఇది సంకేతమని ప్రధాన పక్షాల్లో చర్చనీయాంశమైంది.

అటు సీబీఐ నోటీసులకు ఎంపీ వైఎస్ అవినాశ్ రెడ్డి కూడా స్పందించారు. సీబీఐకు లేఖ రాశారు. దర్యాప్తునకు పూర్తి స్థాయిలో సహకరిస్తానని చెప్పారు. అయితే ఒక్క రోజు ముందు నోటీసు పంపారని.. ఇప్పటికే ఉన్న షెడ్యూల్ కారణంగా మంగళవారం రాలేనని తెలిపారు. 5 రోజుల తర్వాత ఎప్పుడు పిలిచినా విచారణకు వస్తానని అవినాశ్ రెడ్డి లేఖలో పేర్కొన్నారు.

కాగా వివేకా హత్య కేసును సీబీఐ తీసుకున్నప్పటి నుంచి రాష్ట్రంలో అనేక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఆయన కుమార్తె సునీతారెడ్డి తండ్రి హత్య విషయంలో కుట్ర కోణం ఉందని సుప్రీం కోర్టునే ఆశ్రయించింది. దీంతో కేసు వైఎస్​జగన్​బంధువుల మెడకు చుట్టుకుంది. సీబీఐ విచారణలో అనేక విషయాలు బయటపడ్డాయి. బంధువులే హత్యను ప్రమాద సంఘటనగా మలచడానికి ప్రయత్నించినట్లు సీబీఐ తేల్చింది. కీలకమైన సాక్ష్యాధారాలను సేకరించింది. ఇది తట్టుకోలేని అధికార పార్టీకి చెందిన నేతలు ఏకంగా సీబీఐ అధికారులపైనే ప్రైవేటు కేసులు నమోదు చేశారు.

రాజకీయంగా కేంద్రంలోని బీజేపీ పెద్దలకు సీఎం జగన్​అనుకూలంగా ఉండడంతో సీబీఐ కూడా అంతగా స్పందించలేదు. ఇదే ప్రతిపక్ష పార్టీల ఏలుబడిలో ఉన్న రాష్ట్రాల్లో అయితే అతి పెద్ద సంఘటనగా జాతీయ స్థాయిలో చర్చ జరిగేది. ఇప్పటిదాకా సీబీఐ కూడా ఆచితూచి వ్యవహరించింది. ఇప్పుడు ఒక్కసారిగా వైసీపీ ఎంపీ అవినాష్​రెడ్డి విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇవ్వడంతో రాజకీయ వర్గాలు ఉలిక్కి పడుతున్నాయి. కేంద్రంలోని బీజేపీ నేతల ఆలోచనల్లో ఏవైనా మార్పులు చోటుచేసుకున్నాయా అనే కోణంలో చర్చలు సాగుతున్నాయి.

రాష్ట్రంలో ఇప్పటిదాకా బీజేపీతో పొత్తులో ఉన్న జనసేన పార్టీ టీడీపీ వైపు మొగ్గు చూపుతోంది. బీజేపీ కూడా కలిసి రావాలని వత్తిడి చేస్తోంది. ఆ పార్టీ అగ్ర నేతలు దీనిపై స్పష్టతనివ్వలేదు. సీఎం జగన్​పై ఈగ వాలనివ్వడం లేదు. ఇప్పటికీ టీడీపీని టార్గెట్​చేస్తున్నారు. ఇలాంటి తరుణంలో సీబీఐ నోటీసులు జారీ చేయడంతో కేంద్ర పెద్దల వైఖరిలో మార్పు వచ్చిందేమో అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇక నుంచి జగన్​ ప్రభుత్వాన్ని టార్గెట్​చేస్తారనే ఊహాగానాలు వెల్లువెత్తుతున్నాయి. సీబీఐ రొటీన్​విచారణలో భాగంగా నోటీసులు ఇచ్చిందా.. లేక రాజకీయ వత్తిడులు ఉన్నాయా అనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది.

Advertisement

Next Story

Most Viewed