కడపలో చంద్రబాబు బిగ్ స్కెచ్.. ఈసారి ఆ ఫ్యామిలికే టికెట్...!

by srinivas |
కడపలో చంద్రబాబు బిగ్ స్కెచ్..  ఈసారి ఆ ఫ్యామిలికే టికెట్...!
X

దిశ, వెబ్ డెస్క్: కడప జిల్లాలో కొత్త రాజకీయాలు చోటు చేసుకుంటున్నాయి. ఇప్పటి వరకూ ఈ జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి కంచుకోటగా ఉంది. వైఎస్ రాజశేఖర్ రెడ్డి నుంచి జగన్ వరకూ ఆ జిల్లా ప్రజల ఆదరణ పొందుతున్నారు. మరీ ముఖ్యగా కడప పార్లమెంట్, అసెంబ్లీ సీట్ల విషయంలో ఇప్పటి వరకూ జరిగిన ఎన్నికల్లో వైఎస్ ఫ్యామిలీదే ఆధిపత్యం. రాజశేఖర్ రెడ్డి రాజకీయ ప్రవేశం నుంచి ఇప్పటి వరకూ కడపలో ఇతర పార్టీలను ప్రజలు ఆదరించలేదు. కానీ ఈసారి ఎన్నికల్లో మార్పులు జరిగే అవకాశం ఉందని ప్రతిపక్ష పార్టీలు ఆశిస్తున్నాయి.

ఇందుకు కారణం వైఎస్ వివేకానందరెడ్డి హత్య జరగడమే. గత ఎన్నికల ముందు వివేకానందారెడ్డి హత్య జరిగింది. అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌కు వివేకా హత్య బాగా కలిసి వచ్చింది. అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత జరిగిన పరిణామాలు ఆయనపై వ్యతిరేకతను తెచ్చిపెట్టాయని ప్రతిపక్ష పార్టీలు అంచనా వేస్తున్నాయి. ప్రధానంగా వివేకా హత్య కేసులో కడప ఎంపీ అవినాశ్ రెడ్డిపై ఆరోపణలు బలంగా వినిపించాయి. దీంతో కడప పార్లమెంట్‌లో పాగా వేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ సారి ఎన్నికల్లో గెలవాలంటే వివేకా ఫ్యామిలీకి చెందిన వారినే రంగంలోకి దించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.


ఈ మేరకు వైఎస్ వివేకానందారెడ్డి సతీమణి సౌభాగ్యమ్మను కడప ఎంపీ బరిలో దింపాలని యోచిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు ఆమె అభ్యర్థిత్వంపై చంద్రబాబు ఐవీఆర్ సర్వే చేయిస్తున్నారని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని పార్టీ నేతలతోనూ చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. వైఎస్ వివేకా హత్య పరిణామాలు, ఆయన కూతురు సునీత చేస్తున్న పోరాటం.. సీఎం జగన్ అనుసరిస్తున్న తీరు, కడప ఎంపీ అవినాశ్ రెడ్డి ప్రమేయంపై ఉన్న వ్యతిరేకత టీడీపీకి అనుకూలంగా మారుతుందని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.

ఈ నేపథ్యంలో వైఎస్ వివేకానందారెడ్డి భార్య సతీమణి సౌగమ్మకు సీటు ఇస్తే.. ‘ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కడప పార్లమెంట్ పరిధిలో ఏమని ప్రచారం చేయగలరు.. సొంత చిన్నమ్మపైనే వైసీపీ నుంచి అభ్యర్థిని పోటీ పెట్టగలరా’ అనే అంశాలపైనా చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. కడప పార్లమెంట్‌లో చూపే ప్రభావంతో అసెంబ్లీ పరిధిలో జగన్ మెజార్టీని కూడా తగ్గించొచ్చని చంద్రబాబు భావిస్తున్నట్లుగా సమాచారం. ఈ మేరకు ఆయన అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఇప్పటి వరకూ ప్రచారం మాత్రమే.. కడప పార్లమెంట్ అభ్యర్థిత్వంపై చంద్రబాబు అధికారికంగా ప్రకటిస్తేగాని సౌభాగ్యమ్మకు సీటు దక్కుతుంది.. లేదంటే మరో వ్యక్తి కడప పార్లమెంట్ బరిలో ఉంటారు. ఏది ఏమైనా కడప పార్లమెంట్ అభ్యర్థిత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉందని విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. లేదంటే ఇలాంటి ప్రచారాలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. చూడాలి మరి ఏం జరుగుతుందో..?.

Next Story