మాజీ డిప్యూటీ చైర్మన్ పయనమెటో? ప్రత్యర్థి వైపా..సొంత గూటికా!

by Jakkula Mamatha |
మాజీ డిప్యూటీ చైర్మన్ పయనమెటో? ప్రత్యర్థి వైపా..సొంత గూటికా!
X

దిశ ప్రతినిధి,కడప: ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి సొంత నియోజకవర్గమైన పులివెందుల నియోజకవర్గంలో కీలక నేతగా పేరున్న శాసనమండలి మాజీ డిప్యూటీ చైర్మన్ సతీష్ రెడ్డి ఈ ఎన్నికల్లో ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు .ఆయన పయనం ఎటు అన్నది ఇప్పుడు వేడివేడి చర్చకు తెరలేపింది.ఆయన మొదటి నుంచి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ వచ్చారు .1999 నుంచి 2019 ఎన్నికల వరకు దివంగత వైయస్ రాజశేఖర్ రెడ్డి కి, ఆ తర్వాత ఆయన తనయుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి ప్రత్యర్థిగా పోటీ చేస్తూ వచ్చారు. పులివెందుల నియోజకవర్గంలో వైఎస్ కుటుంబాన్ని తట్టుకొని పార్టీ నిర్మాణం పటిష్టం చేయడంలో ఆయన పాత్ర ప్రధానమైంది.అక్కడ ఎన్నో రకాల ఇబ్బందులను ఎదుర్కొంటూ పని చేస్తూ వచ్చిన ఆయన 2019 ఎన్నికల తర్వాత కొంతకాలంగా పార్టీకి దూరంగా స్తబ్దుగా ఉంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన కోసం వైసీపీ ,టీడీపీ నేతలు ప్రయత్నాలు మొదలుపెట్టారు.దీంతో ఆయన ఏ పార్టీకి అనుకూలంగా ఆయన నిర్ణయం ఉండబోతుందన్న గత రెండు రోజులుగా చర్చలకు దారి తీస్తోంది.

పులివెందుల నియోజకవర్గంలో అధికార వైసీపీ ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ నాయకులు సతీష్ రెడ్డి కోసం పావులు కదుపుతున్నారు. వైసీపీ తెదేపా నాయకులు రాజకీయాలకు దూరంగా ఉన్న మాజీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎస్.వి సతీష్ కుమార్ రెడ్డిని స్వయంగా కలిసి తమ పార్టీలోకి చేరాలని ఆహ్వానించారు. పులివెందుల నియోజకవర్గంలోని వేంపల్లె మండలానికి చెందిన సతీష్ రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో బలం వున్న నాయకుడు కావడంతో ఈ రెండు ప్రధాన పార్టీల నాయకులు ఆయనను పార్టీలోకి చేర్చుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు.శనివారం రాత్రి వైసీపీ ఎమ్మెల్సీ పి రామసుబ్బారెడ్డి, కడప, అన్నమయ్య జిల్లాల రీజినల్ కో ఆర్డినేటర్ కె సురేష్ బాబు సతీష్ రెడ్డిని కలిసి పార్టీలోకి ఆహ్వానించారు.ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు మిమ్మల్ని పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు వారు తెలిపారు. ఆదివారం తెదేపా పులివెందుల అభ్యర్థి బీటెక్ రవి సతీష్ రెడ్డిని కలిశారు.పార్టీలోకి రావాలని ఆహ్వానించారు.సతీష్ రెడ్డి తమ వర్గీయుల అభిప్రాయాలు తీసుకుని రెండు,మూడు రోజుల తన అభిప్రాయం వ్యక్తం చేస్తానని ఇరు పార్టీల నాయకులకు సతీష్ రెడ్డి చెప్పినట్లు తెలిసింది.దీంతో ఆయన చిరకాలం ప్రత్యర్థిగా పోరు సాగించిన వైయస్ కుటుంబానికి అనుకూలంగా వైసీపీలో చేరుతారా! లేక టీడీపీ పట్ల అసంతృప్తి తో స్తబ్దుగా ఉన్న ఆయన తిరిగి సొంత గూటికే ప్రాధాన్యం ఇస్తారా అన్నదానిపై ఊహాగానాలు సాగుతున్నాయి.



Next Story

Most Viewed