AP TDPలో మళ్లీ తెరపైకి 'యంగ్ టైగర్'

by Disha Web Desk 16 |
AP TDPలో మళ్లీ తెరపైకి యంగ్ టైగర్
X
  • టీడీపీ పగ్గాలు చేపట్టాలంటున్న తమ్ముళ్లు
  • గతంలో పార్టీకి తనవంతు సాయం చేస్తానన్న జూ.ఎన్టీఆర్
  • పార్టీ బతకాలంటే ఇప్పుడే పగ్గాలు చేపట్టాలంటున్న ఓవర్గం నేతలు
  • ఇప్పుడొచ్చినా ఏం లాభం లేదంటున్న లక్ష్మీపార్వతి
  • ఐదేళ్ల తర్వాత ఏదైనా అవకాశం ఉండొచ్చంటూ కీలక వ్యాఖ్యలు

దిశ, డైనమిక్ బ్యూరో: టీడీపీ అధినేత చంద్రబాబు, యువనేత లోకేశ్‌లో పాదయాత్రలు, ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అంటూ శస్త్రచికిత్సలు చేస్తున్నా ఫలించడం లేదా?. వచ్చే ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావాలన్న చంద్రబాబు, లోకేశ్‌ల కల కల్లగానే మిగిలిపోతుందా?. జూనియర్ ఎన్టీఆర్ వస్తేనే టీడీపీకి పూర్వవైభవం వస్తుందా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ఇప్పటికే టీడీపీలోని ఓ వర్గం జూ.ఎన్టీఆర్ వస్తేనే టీడీపీ బతికిబట్టకట్టగలుగుతుందని లేదంటే వచ్చే ఎన్నికల తర్వాత దుకాణం సర్దేసుకోవాల్సిందేనని చెప్తోంది. అయితే వీరి వ్యాఖ్యలకు బలాన్ని చేకూర్చేలా నందమూరి లక్ష్మీపార్వతి కీలక వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్‌తోనే టీడీపీకి పూర్వవైభవం వస్తుందని, అది కూడా ఐదేళ్లు సమయం పడుతుందని లక్ష్మీపార్వతి చెప్పారు. అంతేకాదు అధికార పార్టీలోని నేతలు సైతం జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు అప్పగించాలంటూ సూచనలు చూస్తుంటే రాజకీయాల్లో మరోసారి తారకమంత్రం జపిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇప్పుడేం లాభం లేదు

నందమూరి ఫ్యామిలీలలో లక్ష్మీపార్వతి ఇష్టపడే వ్యక్తులలో అగ్రనటుడు నందమూరి బాలకృష్ణ, మరొకరు జూనియర్ ఎన్టీఆర్. వీరిద్దరినీ లక్ష్మీపార్వతి పన్నెత్తిమాట కూడా అనదు. విమర్శించదు. చంద్రబాబు చేతిలో పావుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారంటూ సానుభూతితో మాట్లాడుతుంటారు. తండ్రి పెట్టిన పార్టీని లాక్కుని చంద్రబాబు రాజకీయం చేస్తుంటే ఏం చేయలేని పిచ్చి మాలోకాలు అంటూ లక్ష్మీపార్వతి పలు సందర్భాల్లో తన ఆవేదన వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తాజాగా మరోసారి అలాంటి వ్యాఖ్యలే చేశారు లక్ష్మీపార్వతి. గుంటూరులో లక్ష్మీపార్వతి మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగించినా లాభం లేదని తేల్చి చెప్పేశారు. ఇప్పటికే చాలా ఆలస్యం అయిపోయిందని చెప్పారు. జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు తీసుకుని ఐదేళ్లు ప్రజల్లో ఉండాలని సూచించారు. వైఎస్ జగన్ మాదిరిగా నిత్యం ప్రజల్లో ఉంటే ఐదేళ్ల తర్వాత అవకాశం ఉండొచ్చని పేర్కొన్నారు. వైఎస్ జగన్ జనంలో నుంచి పుట్టిన నాయకుడిగా ఎలా అయితే అభివర్ణిస్తున్నారో జూనియర్ ఎన్టీఆర్‌ను కూడా అలానే ప్రజలు భావించి పట్టంకడతారని చెప్పారు. అందుకు కచ్చితంగా ఐదేళ్లు శ్రమించాల్సిందేనని జూనియర్ ఎన్టీఆర్‌కు లక్ష్మీపార్వతి సూచించారు.

తారక్ మదిలో ఏముందో?

అయితే జూనియర్ ఎన్టీఆర్ మాత్రం వరుస సినిమాలతో బిజీబిజీగా గడుపుతున్నారు. జూనియర్ ఎన్టీఆర్ 2009 ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. అయితే పూర్తి స్థాయిలో ప్రచారం నిర్వహించలేకపోయారు. ప్రచారం పూర్తి చేసుకుని హైదరాబాద్ వెళ్తుండగా రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. దీంతో ఆయన ఎన్నికల ప్రచారానికి బ్రేక్‌లు పడ్డాయి. అదే సంవత్సరం టీడీపీ ఘోరంగా ఓటమి పాలైంది. అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాలవైపు కన్నెత్తి చూడలేదు. అయితే టీడీపీకి తన అవసరం ఎప్పుడు వచ్చినా తన వంతు సాయం చేస్తానని స్పష్టం చేశారు.

అయితే 2019 ఎన్నికల్లో టీడీపీ అత్యంత దారుణంగా ఓడిపోవడంతో టీడీపీలోని ఓవర్గం జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వం కావాలంటూ నినదించింది. అంతేకాదు కార్యకర్తలు సైతం నేరుగా చంద్రబాబుకు తెలియజేశారు. చంద్రబాబు సభలలో జై జూనియర్ ఎన్టీఆర్ అంటూ నినాదాలు చేసిన సంగతి తెలిసిందే. గతంలో టీడీపీలో పని చేసి ఇప్పుడు వైసీపీలో కొనసాగుతున్న మాజీమంత్రి కొడాలి నాని, వైసీపీకి అనుబంధంగా వ్యవహరిస్తున్న వల్లభనేని వంశీలు సైతం టీడీపీ పగ్గాలు జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగిస్తే పార్టీ బతికిబట్టకట్టగలుగుతుందని చెబుతున్నారు. పాన్ ఇండియా హీరోగా కొనసాగుతున్న జూనియర్ ఎన్టీఆర్ టీడీపీ పగ్గాలు చేపడతారా?, లేక మరికొన్నాళ్లు వేచి చూస్తారా?. ఒకవేళ చంద్రబాబు, బాలకృష్ణ ఆహ్వానిస్తే పార్టీ కోసం ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారా? అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.


Next Story

Most Viewed