Vijaya Sai Reddy: QR కోడ్ సృష్టికర్త ఆయనేనంటూ చంద్రబాబుపై సెటైర్లు

by srinivas |
Vijaya Sai Reddy: QR కోడ్ సృష్టికర్త ఆయనేనంటూ చంద్రబాబుపై సెటైర్లు
X

దిశ, వెబ్ డెస్క్: ‘దీన్ని తీసుకొచ్చా...దాన్ని కనిపెట్టా, అది నేనే - ఇది నేనే అనే గొప్పలు చెప్పుకోవడం కాద. పేదలు కడుపునిండా తిని నిశ్చింతగా ఉండేలా ఏం చేశారో చెప్పండి చంద్రబాబు’ అంటూ వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రశ్నించారు. ఇదిగో ఈ సంక్షేమ పథకం తాను ప్రవేశపెట్టిందేనని, ఈ ప్రాజెక్టుకు పునాదివేసి పూర్తి చేశానని చూపించండని చంద్రబాబును ఆయన నిలదీశారు. నయా పెత్తందారీ వర్గాన్ని సృష్టించి వాళ్లను ఉద్దరించడం కాదని విజయసాయిరెడ్డి ఎద్దేవా చేశారు.

చంద్రబాబు మానసికస్థితి ఇంకా దిగజారిందని విజయసాయిరెడ్డి విమర్శించారు. QR కోడ్ సృష్టికర్త తానేనట అని సెటైర్లు వేశారు. ‘1994లో Denso Wave అనే టోయోటో విడిభాగాల సంస్థ కోసం ఇంజనీర్ Masahiro Hara QR (Quick Response) కోడ్‌ను కనిపెట్టారు. దాన్నీ చంద్రబాబు తన ఖాతాలో వేసేసుకున్నారు. కనుక్కోనిది ఏదైనా ఉంటే చెప్పండి, మాకూ తేలికవుతుంది.’ అని విజయసాయిరెడ్డి విమర్శించారు.

అధికారం ఉంటే ప్రజలకు సేవచేసి మంచి పనులతో చరిత్రలో నాలుగు కాలాలు నిలిచిపోవచ్చని రాజకీయాల్లో ఉన్నవారు ఆశపడతారని, చంద్రబాబు అండ్ కంపెనీకి మాత్రం అధికారం ఉంటే యధేచ్ఛగా దోచుకోవడమే తెలుసని విజయసాయి మండిపడ్డారు. అక్రమ సంపాదనను కాపాడుకోవాలంటే తప్పనిసరిగా పవర్ చేతిలో ఉండాలని, చంద్రబాబు ఆలోచన అంతా దాని చుట్టే తిరుగుతుందని విజయసాయిరెడ్డి విమర్శించారు.

“కేంద్రం వద్ద ఐటీ డిపార్ట్‌మెంట్ ఉంటే భయపడతానా?. ఒక్క రోజులో ‘స్టే’ తెచ్చేస్తా. ఎన్ని నోటీసులిస్తారో ఇచ్చుకోండి” అని గట్టిగా చంద్రబాబు అరవాలనుకుంటారు. కానీ వార్నింగ్ లైట్ వెలిగి సైలెంట్ అయిపోతారు. గోల చేస్తే ఇంకెన్ని అక్రమాలు బయటకు తీస్తారో అనే వణుకు నోటికి తాళం వేసింది. దేశంలోని హవాలా ఆపరేటర్లు అందరూ చంద్రబాబు కనుసన్నల్లోనే పని చేస్తారు. వాళ్లెవరైనా డబ్బుతో దొరికితే వ్యవస్థల్లో తనకున్న పలుకుబడితో విడిపిస్తారు. షాపూర్జీ పల్లోంజీ సంస్థ నుంచి రూ. 118 కోట్లు కమీషన్‌గా తీసుకున్నట్టు ఐటీ శాఖ జారీ చేసిన నోటీసులో షెల్ కంపెనీల ప్రతినిధులుగా పేర్కొన్న పేర్లన్నీ హవాలా ఆపరేటర్లవే.’అని విజయసాయిరెడ్డి ట్విట్టర్ ద్వారా చంద్రబాబుపై విమర్శలు చేశారు.

Next Story