CM జగన్ ఏదో చేద్దామనుకుంటే.. మరేదో అవుతోందా?

by Disha Web Desk 2 |
CM జగన్ ఏదో చేద్దామనుకుంటే.. మరేదో అవుతోందా?
X

అధికార వైసీపీ విన్యాసాలు చూస్తుంటే.. దిక్కుతోచని స్థితిలో ఏం చేయాలో అర్థం కానట్లుంది. ఓటమి భయంతో ప్రతిపక్షాలను గందరగోళంలోకి నెట్టాలని తరచూ సమన్వయకర్తలను మారుస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో తెరపై కనిపించే తాత్కాలిక ముఖాలన్నీ రివర్స్​ అయితే అసలుకే మోసం తప్పదని ఫ్యాన్ పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. పూటకో సమన్వయకర్త.. రోజుకో నియోజకవర్గం.. సీఎం జగన్​ ఆడుతున్న మైండ్​ గేమ్​ను ప్రతిపక్షాలు అసలు పట్టించుకోవడం లేదు. అధికార పార్టీ అభ్యర్థి ఎవరైనా సరే.. గెలుపు తమదేనన్న ధీమాతో ముందుకెళ్తున్నాయి. విపక్షాలు ఖాతరు చేయడం లేదని తెలిసినా సీఎం జగన్​ ఇలా వ్యవహరించడం వెనుక ఏదైనా బలమైన ఎత్తుగడ ఉండాలి.. లేదా దింపుడు కల్లం ఆశలన్నా అయి ఉండాలని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: గుంటూరు జిల్లా మంగళగిరిలో టీడీపీ యువనేత నారా లోకేశ్​ పోటీ చేస్తారని ఆ పార్టీ ప్రకటించింది. అక్కడ బీసీలకు చెందిన చేనేత ఓటర్లు ఎక్కువ. అయినా సరే కులాలకు అతీతంగా తమను ఆదరించడానికి సిద్దంగా ఉన్నట్లు టీడీపీ విశ్వసిస్తోంది. లోకేశ్​ మీద పోటీకి దింపేందుకు తొలుత సిట్టింగ్ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి దీటైన నాయకుడని వైసీపీ భావించింది. ఆయన నెల రోజుల్లోపల కాంగ్రెస్​ పార్టీలోకి వెళ్లి మళ్లీ తిరిగొచ్చారు. ఇదంతా కాంగ్రెస్​ పార్టీలో కోవర్టు ఆపరేషన్​ కోసం చేశారనే ప్రచారం జరిగింది. తర్వాత గంజి చిరంజీవిని మంగళగిరి సమన్వయకర్తగా నియమించారు. ఆయన్ని కాదని మరో జాబితాలో కాండ్రు కమలను ప్రకటించారు. తాజాగా లావణ్యను సమన్వయకర్తగా పేర్కొన్నారు. ఈమే అభ్యర్థి కాకపోవచ్చు. నోటిఫికేషన్​ వెలువడ్డాక మరింకా ఎంతమంది కృష్ణులైనా తెరమీదకు రావొచ్చు.

నెల్లూరులోనూ అదే సీను..

నెల్లూరు పార్లమెంటు నియోజకవర్గంలో తాను పోటీ చేయనని వేమిరెడ్డి ప్రభాకర్​ రెడ్డి కాడి దించేశారు. తనకు చెప్పా పెట్టకుండా ఇష్టారీతిన సమన్వయకర్తలను మార్చడంపై ఆయన కినుక వహించారు. ఇది అసలు రాజకీయ పార్టీయేనా అన్నట్లు ఆయన చీదరించుకున్నారు. ఆయన స్థానంలో ఎంపీ విజయసాయిరెడ్డి బంధువు శరత్​ చంద్రారెడ్డిని ప్రకటించారు. పట్టుమని పది రోజులు గడవక ముందే ఆయన్ని కాదని ఏకంగా విజయసాయి రెడ్డినే సమన్వయకర్తగా నియమించారు. ఈయన కూడా అభ్యర్థి కాకపోవచ్చు. ఎన్నికల నోటిఫికేషన్​ వెలువడే లోపు ఇంకెంత మంది పేర్లు వస్తాయో చెప్పడం కష్టమని రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఏ నిమిషానికి ఎవరు ఉండునో..

ఇదే నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గంలో సిట్టింగ్​ ఎమ్మెల్యే మానుగుంట మహిధర్​ రెడ్డిని తప్పించాలనుకున్నారు. అందుకు సవాలక్ష కారణాలు చెప్పుకొచ్చారు. ఆయన పట్ల ప్రజల్లో సానుకూలత లేదని సర్వేలో వెల్లడైనట్లు పేర్కొన్నారు. చంద్రబాబు, పవన్​ను దుర్భాషలాడలేదనే కారణాన్ని ముందుకు నెట్టారు. చివరకు అక్కడ బీసీలకు ఇవ్వాలని చెప్పి బొట్ల రామారావును తెర మీదకు తెచ్చారు. ఆయన నియోజకవర్గంలో పర్యటిస్తుండగానే అరవిందను ప్రకటించారు. ఇప్పుడు ఆమె కాదని కనిగిరి ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్​ యాదవ్ కు సమన్వయకర్త బాధ్యతలు అప్పగించారు. చివరిగా ఈయనే అభ్యర్థి అవ్వొచ్చు.. కాకపోవచ్చు.

పూచికపుల్ల విలువ కూడా లేదు..

ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో నియోజకవర్గాలను వైసీపీ అధిష్టానం బంతాట ఆడుకుంటోంది. సమన్వయకర్తగా పేర్లు ప్రకటించిన వాళ్లంతా తామే అభ్యర్థులమని భావించారు. ఇదంతా పార్టీ ఆడే గేమ్​లో తాము పావులమయ్యామని ఇపుడు అనుకుంటున్నారు. చివరగా అభ్యర్థి ఎవరైనా తమ తడాఖా ఏంటో చూపించాలని కృత నిశ్చయంతో ఉన్నారు. ఇప్పటికే పార్టీలో క్షేత్రస్థాయి నాయకులకు అధిష్టానంపై నమ్మకం పోయింది. పూచికపుల్లలా తమను మరోసారి వాడుకోవాలని భావిస్తున్నట్లు గ్రహించారు. ఈ అంతర్నాటకంలో తమ పాత్రను నమ్మకంగా పోషించడానికి సిద్దమవుతున్నారు.

వైసీపీకి బూమరాంగ్ కానుందా..?

వైసీపీ అధిష్టానం ఎన్ని పిల్లిమొగ్గలు వేసినా తాము ప్రకటించిన అభ్యర్థులకే కట్టుబడి ఉన్నట్లు ప్రతిపక్షాలు ముందుకు సాగుతున్నాయి. ప్రజలకు నేరుగా కాల్​ చేసి ఫలానా అభ్యర్థిని పోటీకి దింపాలనుకుంటున్నాం.. అంగీకరిస్తారా.. వ్యతిరేకిస్తారా అంటూ టీడీపీ సర్వే చేసింది. ఈ సర్వే ఆధారంగా టీడీపీ–జనసేన కూటమి 118 నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించింది. వైసీపీ నేతలు మాత్రం తమ సీటు ఉంటుందో ఊడుతుందో అర్థం కాని డైలమాలో ఇరుక్కుపోయారు. అధికార పార్టీ విన్యాసాలు అంతిమంగా ఆ పార్టీ విజయావకాశాలను దెబ్బతీసే అవకాశమున్నట్లు రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.


Next Story