YSRCP: టీడీపీ, జనసేన రెబల్స్‌పై వైసీపీ ఫోకస్.. కుదిరితే వారికి ఆ ఆఫర్!

by Rajesh |
YSRCP: టీడీపీ, జనసేన రెబల్స్‌పై వైసీపీ ఫోకస్.. కుదిరితే వారికి ఆ ఆఫర్!
X

సొంత బలంతో కాకుండా ప్రత్యర్థి పార్టీల బలహీనతపై దెబ్బ కొట్టి గెలిచేందుకు వైసీపీ సిద్ధమౌతోంది. అందుకు తగిన వ్యూహాలకు పదును పెడుతోంది. రాష్ర్టంలో తీవ్ర ప్రజావ్యతిరేకతను ఎదుర్కొంటున్న అధికార పార్టీ వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనే కసితో ఉంది. ప్రత్యర్ధి పార్టీలలో ప్రభావితం చేయగలిగిన నేతలతో మాట కలపడం, హామీలు గుప్పించడం, ఆర్థికంగా సాయం అందించడం ద్వారా ఇప్పటికే తన ప్రణాళికను అమలు చేస్తోంది. పొత్తు రాజకీయాల ద్వారా వచ్చే అసమ్మతి కోసం ఆశగా ఎదురుచూస్తోంది. త్వరలో పొత్తులు ఖరారై అసమ్మతి బయటపడుతుందని అంచనా వేస్తోంది. నెలాఖరులో తాయిలాలు, హామీలతో సంప్రదింపులకు వైసీపీ తెరలేపనుందని సమాచారం.

దిశ ప్రతినిధి, విశాఖపట్నం : పొత్తు కారణంగా ఇప్పటికే టికెట్లు రావని తెలిసిన వారిలో ప్రభావితం చేయగల, విజయావకాశాలు ఉన్న నేతలకు నేరుగా వైసీపీ టికెట్లు ఆఫర్ చేయనున్నారు. అధికార పార్టీకి 151 మంది శాసనసభ్యులు ఉన్నప్పటికీ అందులో సగం మందికి పైగా గెలవరని పలు సర్వేలు తేల్చాయి. దీంతో 80 మందికి పైగా సిట్టింగులకు టికెట్లు దక్కడం లేదు. వారి స్థానంలో సమర్ధులైన ప్రత్యామ్నాయ అభ్యర్ధులు కూడా వైసీపీలో లేరు. దీంతో తెలుగుదేశం, జనసేనలలో టికెట్లు రాని వారిలో ముఖ్యులకు టికెట్లు ఆఫర్ చేయాలని చూస్తున్నారు.

టికెట్ మీకే.. ఖర్చు మాదే..

ముఖ్యంగా విశాఖ, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు జిల్లాల్లో పొత్తుల కారణంగా మాజీ మంత్రులు, రెండు మూడు పర్యాయాలు శానసభ్యులుగా ఎంపికైన వారికి కూడా అవకాశాలు దక్కని పరిస్ధితులు ఏర్పడ్డాయి. అటువంటి వారు కనీసం పాతిక మంది అయినా ఉంటారని వైసీపీ అంచనా. వీరిలో మెజారిటీ నేతలకు ఖర్చు తాము భరిస్తామనే భరోసాతో టికెట్లు ఇవ్వనున్నారని తెలిసింది. ఉమ్మడి విశాఖ జిల్లాలో పొత్తుల కారణంగా తెలుగుదేశం నేతలు గంటా శ్రీనవాసరావు, పల్లా శ్రీనివాస్, గండి బాబ్జీ తదితరుల టికెట్లు ఖరారు కాలేదు. అదే సమయంలో అధికార పార్టీకి సమర్ధులైన అభ్యర్ధులు దొరకడం లేదు. దీంతో వీరికి టికెట్లు ఇస్తామని హామీ ఇచ్చి పార్టీలోకి ఆహ్వానించే బాధ్యతను మంత్రి బొత్స సత్యనారాయణకు అప్పగించినట్లు ప్రచారం జరుగుతోంది.

బంపర్ ఆఫర్లు..

నియోజకవర్గంలో తమ పార్టీ తరపున ఇన్చార్జిగా కొద్ది సంవత్సరాలుగా పనిచేస్తూ, భారీగా ఖర్చుచేసి, సామాజిక వర్గ బలం ఉన్న నేతలు చాలా మందికి పొత్తుల కారణంగా టికెట్ దక్కే అవకాశం లేదు. ఇంతకాలం కార్యక్రమాలు చేస్తూ ప్రజలలో ఉన్న కారణంగా ఎన్నికలలో పోటీ చేయాలనే బలమైన వాంఛ వీరిలో కొందరికి ఉంది. తమ కార్యక్రమాలకు వస్తున్న స్పందన చూసి కొందరు తాము స్వతంత్ర అభ్యర్ధులుగా పోటీ చేసినా విజయం సాధిస్తామనే భ్రమలో ఉన్నారు.

మరి కొందరు తనకు నష్టం జరిగినా ఎన్నికల బరిలో ఉండి ఓట్లు చీల్చి తన ప్రత్యర్ధిని ఓడించాలనే భావనతో ఉన్నారు. ఇటువంటి వారందరిపై ఇప్పడు వైసీపీ దృష్టి సారిస్తోంది. ఇప్పటి వరకూ మీకు అయిన ఖర్చులు చెల్లించడంతోపాటు రెబల్ గా బరిలోకి దిగితే కోట్లలోనే ఆర్ధిక సాయం అందిస్తామనే హామీతో వీరిని రెచ్చగొట్టి తమవైపు తిప్పుకోనున్నారు. కనీసం 30 నియోజక వర్గాలలో ఈ రెబల్స్ ప్రయోగం విజయవంతం చేయాలనే లక్ష్యంతో ప్రయత్నాలు ప్రారంభించినట్లు తెలిసింది.

అప్రమత్తమైన విపక్షాలు..

ఎన్నికల్లో ఇటువంటి వ్యూహాలు సర్వసాధారణమే కాబట్టి తెలుగుదేశం పార్టీ కూడా అప్రమత్తంగానే ఉందని తెలిసింది. తమకు నష్టమైనా పొత్తులతోనే వెళ్లాలని పదే పదే జనసేనాని పవన్ కల్యాణ్ చెప్పడం వెనుక అర్ధం ఇదే అని అంటున్నారు. త్యాగాలకు తమ నేతలను ఇప్పటి నుంచే సిద్ధం చేస్తున్నారని చెబుతున్నారు.



Next Story

Most Viewed