- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- క్రైం
- సినిమా
- వైరల్
- లైఫ్-స్టైల్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం
- బిజినెస్
- కార్టూన్
- ప్రపంచం
- టెక్నాలజీ
- స్పోర్ట్స్
- సాహిత్యం
- జిల్లా వార్తలు
- భక్తి
- ఆరోగ్యం
- ఫోటోలు
- రాశిఫలాలు
- Job Notifications
198 ఎకరాల్లో రిజిస్ట్రేషన్లు బంద్.. ఆవేదన వ్యక్తం చేస్తున్న కుటుంబాలు

మేం అధికారంలోకి రాగానే ప్రజల కష్టాలు తీరుస్తాం.. ఏ ఒక్కరి కంట కన్నీరు రానివ్వం.. అని చెప్పిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి చంద్రగిరి నియోజకవర్గ దామినేడు బాధితుల భూ గోడు మాత్రం ఆలకించడం లేదు. ఈ ప్రాంతంలో భూముల రిజిస్ట్రేషన్లపై నిషేధం గురించి పట్టించుకోవడం లేదు. సొంత స్థలాలు ఉన్నా అక్కరకు రాని 2 వేల కుటుంబాల కన్నీళ్లకు కరగడం లేదు. 15 ఏళ్లుగా వారి ఆవేదనకు అద్దం పడుతున్న దామినీడు భూముల కథ తెలుసుకుందాం.
దిశ, తిరుపతి: రాజకీయ పార్టీల పెద్దల మధ్య ఏర్పడిన వివాదం కారణంగా 2008లో ఈ స్థలాలపై రిజిస్ట్రేషన్లు నిలుపుదల చేస్తూ ప్రభుత్వం మెమో జారీ చేసింది. అనంతరం దీనిపై దామినేడు వాసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా ఇవి ప్రైవేటు లేఅవుట్ల ద్వారా విక్రయించిన స్థలాలని, రిజిస్ట్రేషన్ల నిషేధాన్ని తొలగించాలని లోకాయుక్త సూచించింది. అయితే అప్పటి నుంచి అధికారులు కాలయాపన చేస్తున్నారు. 15 ఏళ్లుగా ముఖ్యమంత్రులకు, మంత్రులకు అధికారులకు ఎన్నో విధాలుగా దామినేడు ప్రజలు మొరపెట్టుకున్నారు. అధికారంలో ఉన్నప్పుడు నారా చంద్రబాబు నాయుడు, ప్రస్తుతం వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇక్కడి భూ బాధితుల సమస్యపై అవగాహన కలిగిన వారే అయినప్పటికీ వాటి పరిష్కారంలో మాత్రం చర్యలు తీసుకోలేదు.
అడుగడుగునా అడ్డంకులు
దామినేడు హౌస్ ప్లాట్స్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులను రెండేళ్ల క్రితం స్థానిక ఎమ్మెల్యే ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాజధాని తీసుకెళ్లి ఈ సమస్య పరిష్కారం కోసం ప్రభుత్వ పరిపాలన కార్యాలయంలో చర్చించారు. ప్రభుత్వ పెద్దలు సుముఖత వ్యక్తం చేయడంతో ఇక సమస్య పరిష్కారమవుతుందని దామినేడు వాసులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో తిరుపతిలోని అవినీతికి చిరునామాగా మారిన ఓ సబ్ రిజిస్ట్రార్ రంగ ప్రవేశం చేయడంతో సీన్ మొత్తం రివర్స్ అయింది. దామినేడు భూముల విలువ నేడు రూ.600 కోట్లకుపైగా ఉంటుందని, ఇందులో సగం వాటా ఇవ్వడానికి అంగీకరిస్తే సమస్యను పూర్తిగా పరిష్కరిస్తానని బేరాలాడినట్లు తెలిసింది. తన ప్రతిపాదనకు ఒప్పుకుంటే ప్రభుత్వం వైపు నుంచి రిజిస్ట్రేషన్లపై నిషేధం ఎతివేయడానికి జీవో తెప్పిస్తానని హామీ ఇచ్చారు. ఇందులో పెద్దలకు కూడా వాటాలు ఇవ్వాల్సి ఉందని చెప్పుకొచ్చినట్లు సమాచారం.
ఇప్పటికైనా పట్టించుకోండయ్యా
అసలే ఆస్తులు అమ్ముకోలేక అప్పులపాలైన దామినేడు వాసులకు ఈ పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థంగాక ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ భూమిని అమ్ముకోవడానికి కూడా ఇన్ని రకాల ఇబ్బందులేమిటని ప్రశ్నిస్తున్నారు. కనీసం ప్రజాప్రతినిధులైన తమ గోడు ఆలకించాలని, లేకుండా పిల్లల భవిష్యత్ అగమ్యగోచరంగా మారుతుందని వారు వాపోతున్నారు.