కర్ణాటకలో కాంగ్రెస్​ విజయంతో అంతా గప్​చుప్!

by Disha Web Desk 9 |
కర్ణాటకలో కాంగ్రెస్​ విజయంతో అంతా గప్​చుప్!
X

ఏమిటో.. రాష్ట్రంలోని ప్రధాన పక్షాలకు ఎన్ని తిప్పలో ! కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్​ విజయంతో వాటికి గొంతులో వెలక్కాయ పడ్డట్లయింది. మింగలేరు. కక్కలేరు. ఎలా స్పందిస్తే కేంద్రంలోని రింగ్​ మాస్టర్​ ఎలా రిసీవ్​ చేసుకుంటాడోనన్న భయం. కర్ణాటకలో గెలిచిన పార్టీకి ప్రధాని మోడీ అభినందనలు తెలిపారు. ఇక్కడ పీసీసీ నేతలతోపాటు వామపక్షాలు, ఇతర ప్రజా సంఘాలు హర్షం వ్యక్తం చేశాయి. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయి రెడ్డి ట్విట్టర్​ ద్వారా అభినందించారు. సీఎం జగన్​, ప్రతిపక్షనేత చంద్రబాబు, జనసేనాని పవన్​ మాత్రం స్పందించలేదు. కర్ణాటకలో ఓటమి తర్వాత రాష్ట్రంలో పొత్తుల ఎత్తులు మారతాయా? కాషాయ పార్టీని టీడీపీ, జనసేన వదిలేస్తాయా! కాంగ్రెస్​తో జట్టు కట్టే అవకాశముందా అంటూ పలు విశ్లేషణలు తెరమీదకు వస్తున్నాయి. ఇప్పటిదాకా బీజేపీ అనుసరిస్తున్న ఎత్తుగడల్లో మార్పులుంటాయా అని రాజకీయ వర్గాల్లో చర్చజరుగుతోంది.

దిశ, ఏపీ బ్యూరో: కర్ణాటక శాసన సభ ఎన్నికల్లో కమలనాథులు చావు దెబ్బతిన్నారు. ఏదైనా అభివృద్ధి చేస్తే చెప్పి ఓట్లు అడగొచ్చు. దీనికి భిన్నంగా మత భావనలపై ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టి అధికార పీఠాన్ని కైవసం చేసుకోవాలనే పాత ఎత్తుడనే అవలంబించారు. దీన్ని కన్నడ ప్రజలు తిప్పికొట్టారు. కులాల నిచ్చెనతో పైకి ఎగబాకాలనుకున్న జేడీఎస్​ కు చేదు అనుభవం ఎదురైంది. మొత్తంగా రాహుల్​ గాంధీ జోడో యాత్ర ప్రభావం కర్ణాటకకలోని తెలుగు వాళ్లపైనా కనిపించింది. కాంగ్రెస్​ ఇచ్చిన హామీలకు ఫిదా అయిపోయారు. బీజేపీ ఇచ్చిన హామీలను కన్నడిగులు విశ్వసించలేదు. ఇక్కడ బీజేపీ ఓటమి రెండు తెలుగు రాష్ట్రాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

కొనసాగనున్న నాన్చుడు ధోరణి..

దక్షిణాదిన ఏదో రకంగా బలపడాలని భావిస్తున్న బీజేపీ ఆశలపై కన్నడిగులు నీళ్లు చల్లారు. తెలంగాణలో బీఆర్​ఎస్​, కాంగ్రెస్​తో నేరుగా పోటీ పడుతోంది. ఏపీలో మాత్రం ప్రధాన మూడు పార్టీలతో దోబూచులాడుతోంది. జనసేనను మిత్ర పక్షంగా పెట్టుకుంది. పూర్తిగా ఎన్నికలు దగ్గర పడేదాకా నాన్చుడు ధోరణి అవలంబించే ఎత్తుగడనే కొనసాగించవచ్చని విశ్లేషకుల అంచనా. ఇటు టీడీపీ, జనసేనకు ఓ చేత్తో అభయమిస్తూ.. మరో చేత్తో సీఎం జగన్​కు తెరచాటున సహకరించే వ్యూహాన్నే ఎన్నికలదాకా అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. ఎన్నికలు దగ్గర పడ్డాక కాషాయ పార్టీ ఎవరి పక్షమనేది స్పష్టత రావొచ్చు.

టీడీపీ, జనసేన తర్జనభర్జన..

కర్ణాటకలో కాంగ్రెస్​ విజయంతో టీడీపీ, జనసేనలు బీజేపీతో పొత్తు గురించి పునరాలోచనలో పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కన్నడ ప్రాంతంలో కన్నా రాష్ట్రంలోనే బీజేపీ మీద ప్రజలు మరింత ఆగ్రహంతో ఉన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వకుండా ద్రోహం చేసిన పార్టీగా బీజేపీ మీద ముద్ర ఉంది. విభజన హామీలు నెరవేర్చలేదనే ఉక్రోషం నెలకొంది. పెట్రోలు, డీజిల్​, వంట గ్యాస్​తోపాటు నిత్యావసరాలపై ఇష్టారీతిన పన్నులు బాదేస్తూ నరకం చూపిస్తుందనే భావనలో ప్రజలున్నారు. పోలవరం, విశాఖ స్టీల్​ విషయంలో కేంద్ర వైఖరిని జనం తూర్పారబడుతున్నారు. విద్యుత్​, అర్బన్​ సంస్కరణల పేరుతో ప్రజలను లూటీ చేస్తున్నారని మండిపడుతున్నారు. ఈ సెగ తమకు ఎక్కడ తగులుతుందో.. ప్రజలు నిలదీస్తే ఏం సమాధానం చెప్పాలో అర్థంగాక టీడీపీ, జనసేన మల్లగుల్లాలు పడుతున్నాయి.

తేల్చుకోవాల్సింది ఆ రెండు పార్టీలే..

వైసీపీకి బీజేపీతో ఆ ఇబ్బందులేవీ లేవు. నేరుగా కమలనాథులతో పొత్తు ఉండదు. ధరల పెంపు పాపం మాది కాదు.. కేంద్రానిదని తప్పించుకోవచ్చు. అవసరమైతే ఓ మోస్తరులో విమర్శనాస్త్రాలు సంధించి ముస్లిం మైనార్టీల ఓటు బ్యాంకు చెదరకుండా కాపాడుకోవచ్చు. బీజేపీ, టీడీపీ, జనసేన అన్నీ ఓ గూటి పక్షులేనంటూ బద్నాం చేయొచ్చు. అందరూ ఏకమై నాపై దాడికి పూనుకున్నాయంటూ జగన్​ సానుభూతి కోసం ప్రయత్నించే అవకాశాలున్నాయి. తీరా గెలిచాక మళ్లీ తెరచాటు బంధాన్ని కొనసాగించవచ్చు. అందువల్ల బీజేపీతో వైసీపీకి ఎలాంటి నష్టం లేదు. ఇప్పుడు తేల్చుకోవాల్సింది టీడీపీ, జనసేన పార్టీలేనని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Read more:

‘పవన్ కల్యాణ్ వ్యాఖ్యలను అధిష్టానం దృష్టికి తీసుకెళ్తాం’


Next Story

Most Viewed