ఎక్కడ తేడా కొట్టింది.. అధికార పార్టీలో అంతర్మధనం!

by GSrikanth |
ఎక్కడ తేడా కొట్టింది.. అధికార పార్టీలో అంతర్మధనం!
X

దిశ ప్రతినిధి, అనంతపురం: పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలో అధికార పార్టీ అభ్యర్థి ఓడిపోవడంతో ఆ పార్టీలో అంతర్మధనం మొదలయ్యింది. ఎమ్మెల్సీ ఎన్నికల షెడ్యూల్ విడుదల నుంచి అభ్యర్థి ప్రకటన, ప్రచారం, కౌంటింగ్ వరకూ ఎంతో ఆత్మ విశ్వాసంతో ఉన్న ఆ పార్టీ శ్రేణులు ఫలితాల అనంతరం డీలా పడిపోయారు. ఓటమిపై అధిష్టానం చీవాట్లు పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. ఇక ఏకంగా ఓడిపోయిన అభ్యర్థి తమ విజ్ఞప్తులను ఆర్వో పట్టించుకోలేదని, కౌంటింగులో అవకతవకలు జరిగాయని బహిరంగంగా పేర్కొనడం వివాదాస్పదం కంటే హాస్యాస్పదమైంది. పదో రౌండ్ వరకూ తమకే మెజారిటీ ఉందని పేర్కొనడంలాంటి మాటల వలన అభ్యర్థికే ఎన్నికల గురించి అవగాహన లేకపోతే ఎలా అని పలువురు చర్చించుకుంటున్నారు.

అభ్యర్థి ఒంటెద్దు పోకడే కారణమా?

కౌంటింగ్ ప్రారంభం నుంచి అధికార పార్టీకి చెందిన ఏ ఒక్క ప్రజాప్రతినిధి ఆ ఛాయలకు రాలేదు. ఉమ్మడి అనంతపురం జిల్లాలో 12 మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎంపీలు ఉన్నారు. తమ అభ్యర్థి ఓడిపోతారన్న అనుమానంతో రాలేదా ? గెలుస్తాడన్న అతి ఆత్మ విశ్వాసంతో రాలేదా అనే చర్చ సాగుతోంది. అసలు వెన్నపూస రవీంద్ర రెడ్డి అభ్యర్థిత్వం పట్ల ఎవరూ సుముఖంగా లేరన్నది ప్రస్తుతం అధికార పార్టీ వర్గాల నుంచి వినిపిస్తున్న మాట. గతంలో ఆయన తండ్రి వెన్నపూస గోపాలరెడ్డి కూడా అటు పార్టీ శ్రేణులకుగానీ, ప్రజలకుగానీ అందుబాటు

లో ఉన్న దాఖలాలు లేవని చెబుతున్నారు. ఇక అతి ఆత్మ విశ్వాసంతో ముందుకెళ్లిన అభ్యర్థి ఏ ఒక్కరినీ సంప్రదించకుండా ప్రచారం నిర్వహించడం, సలహాలు, సూచనలు తీసుకోకపోవడం కూడా ప్రతికూలంగా మారాయని అంటున్నారు. ఇక సార్వత్రిక ఎన్నికల్లో వెన్నపూస రవీంద్రరెడ్డి వ్యవహరించిన తీరుపైనా కొంతమంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది.

అతి విశ్వాసంతో బొక్క బోర్లా

పార్టీ అమలు చేసిన అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలే గట్టెక్కిస్తాయన్న ఆలోచనతోనే ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. పట్టభద్రుల ఎమ్మెలీ అభ్యర్థిగా ప్రకటించినప్పటి నుంచీ గెలిచామన్న ధోరణిలోనే రవీంద్ర రెడ్డి వ్యవహారం సాగిందని, అందుకనే పార్టీ పెద్దలనుగానీ, ఓటర్లనుగానీ ఎవరినీ సరిగా పట్టించుకోలేదన్న ప్రచారం కూడా సాగుతూ ఉండడం గమనార్హం. పార్టీలో అందరినీ కలుపుకొనిపోయి ఉంటే.. ఎమ్మెల్సీ ఓటింగ్ పై స్పష్టంగా అవగాహన కల్పించడం వలన రెండో ప్రాధాన్యత ఓట్లతోనైనా గట్టెక్కేలా చేసుకునే వారని సీనియర్లు పేర్కొంటుండడం గమనార్హం. రెండో ప్రాధాన్యత ఓటు గురించి ఓటర్లకు సరిగా అవగాహన కల్పించకపోవడం, దాని ప్రాధాన్యత గురించి ఏ మాత్రం పట్టించుకోకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చినట్లు చెబుతున్నారు.

ప్రతిపక్ష పార్టీలో ఉత్సాహం

జిల్లాలోని ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీలో ఉత్సాహం కనిపిస్తోంది. అధికార పార్టీ మీద ఉన్న వ్యతిరేకతే తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని గెలిపించిందన్న పార్టీ అధిష్టానం ప్రచారం శ్రేణుల్లోకి విస్తృతంగా వెళ్లింది. ఉమ్మడి అనంతపురం జిల్లాలో నారా లోకేష్ పాదయాత్రకు ఈ విజయం బూస్టర్ గా పని చేస్తుందని ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. అందుకే ప్రభుత్వ వ్యతిరేకత వల్లనే పార్టీ అభ్యర్థి గెలిచారన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళుతున్నారని టీడీపీ నేతలు చర్చించుకుంటున్నారు.

Next Story