వాస్తు పేరుతో రోడ్డు మూసేస్తారా?: నాదెండ్ల మనోహర్ అరెస్ట్‌ను ఖండించిన అచ్చెన్నాయుడు

by Disha Web Desk 21 |
వాస్తు పేరుతో రోడ్డు మూసేస్తారా?: నాదెండ్ల మనోహర్ అరెస్ట్‌ను ఖండించిన అచ్చెన్నాయుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో : జనసేన రాజకీయ వ్యవహారాల కమిటీ చైర్మన్‌ నాదెండ్ల మనోహర్‌తోపాటు జనసేన నాయకులను విశాఖలో పోలీసులు అరెస్ట్ చేయడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఖండించారు. నాదెండ్ల మనోహర్ అరెస్ట్ అక్రమమని అన్నారు. విశాఖలో అత్యంత రద్దీగా ఉండే టైకూన్‌ జంక్షన్‌ను వైసీపీ నేతల స్వప్రయోజనాల కోసం మూసేసి ప్రజలను ఇబ్బంది పెట్టడం దుర్మార్గం అని మండిపడ్డారు. శాంతియుతంగా నిరసన తెలియజేస్తున్న ప్రతిపక్ష నేతలపై పోలీసులు దౌర్జన్యం చేయడం సరికాదు అని హితవు పలికారు. వైసీపీ నేతల ఆస్తులకు వాస్తు దోషం ఉందంటూ ప్రజా రహదారిని మూసేయడం వైసీపీ అరాచకాలకు అద్దం పడుతుంది అని మండిపడ్డారు. నాలుగున్నరేళ్లలో కొత్తగా ఒక్క రహదారీ నిర్మించకుండా ఉన్న రహదారులను వాస్తు పేరుతో మూసేస్తారా? అని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణం కోసం కేటాయించిన నిధులను కూడా దారిమళ్లించి అక్రమాలకు పాల్పడుతున్నారు అని మండిపడ్డారు. రాష్ట్రంలో రూల్‌ ఆఫ్‌ లా అమలవుతుందా? ప్రజాప్రయోజనాల కోసం ఉపయోగించాల్సిన చట్టాలను నిర్వీర్యం చేస్తున్నారు అని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే టైకూన్‌ జంక్షన్‌ను తెరిచి రహదారిని పునరుద్ధరించాలని, అరెస్టు చేసిన జనసేన నేతలను వెంటనే విడిచిపెట్టాలని తెలుగుదేశంపార్టీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

Next Story