Konaseema: వైసీపీలోకి హర్షకుమార్?

by Disha Web Desk 16 |
Konaseema: వైసీపీలోకి హర్షకుమార్?
X
  • కోనసీమలో హాట్ టాపిక్
  • కాంగ్రెస్‌ను వీడనున్నట్లు సమాచారం
  • అసమ్మతితోనే బయటకు వస్తున్నట్లు అంతరంగీకుల అభిప్రాయం
  • అమలాపురం ఎంపీ అభ్యర్దిగా పోటీ చేస్తారని ప్రచారం
  • దళితుల్లో పట్టున్న హర్షకు చాన్స్ ఇస్తారంటూ నమ్మకం

దిశ ( ఉభయ గోదావరి): అమలాపురం మాజీ పార్లమెంటు సభ్యుడు సీనియర్ కాంగ్రెస్ నాయకుడు జి.వి. హర్షకుమార్ వైసీపీ తీర్ధం పుచ్చుకోనున్నట్లు సమాచారం. ఈ వార్త కోనసీమ జిల్లాలో రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చగా మారింది. కాంగ్రెస్ పార్టీలో సుధీర్గకాలం చరిత్ర కలిగిన హర్షకుమార్ వైసీపీ తీర్థం పుచ్చుకోవడం అనేది రాజకీయంగా వ్యూహత్మకం అని విశ్లేషకులు భావిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న ఆయన ఇటీవల కాలంలో పీసీసీ అధ్యక్ష పదవికి పోటీ పడ్డారు. కానీ అదే ప్రాంతానికి చెందిన గిడుగు రుద్రరాజుకు పదవి వరించింది. దీంతో హర్షకుమార్ అలక పాన్పు ఎక్కారు. దళితులకు పీసీసీ ఎందుకు ఇవ్వరు అని ప్రశ్నించారు. కానీ అధిష్టానం అట్టే పట్టించుకోలేదు. చివరికి ఆయన వైసీపీ గూటికి చేరేందుకు ప్రయత్నాలు మొదలు పెట్టినట్లు సమాచారం. ఈ మేరకు తెర వెనుక మంతనాలు జరుగుతున్నాయని విశ్వనీయ వర్గాల ద్వారా తెలుస్తుంది.

కాంగ్రెస్‌తో సుదీర్గం పరిచయం

మాజీ పార్లమెంటు సభ్యుడు హర్షకుమార్ సుధీర్గకాలం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా చెలామణి అవుతున్నారు. 2000లో ఆయన రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికల్లో పోటీ చేశారు. 2004లో అమలాపురం పార్లమెంటు సభ్యుడిగా పోటీ చేసి గెలిచారు. 2009లో రెండోసారి అదే స్థానం నుంచి పోటీ చేసి నెగ్గారు. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాల్లో దళితులకు చాలా కార్యక్రమాల్లో అండగా ఉంటారు. అయితే 2014 ఎన్నికల ముందు తెలంగాణ విడిపోయిన తర్వాత హర్ష కుమార్ సమైఖ్యాంధ్ర పార్టీకి సపోర్టు చేశారు. నాడు పార్లమెంటు స్థానం నుంచి పోటీ కూడా చేశారు. కానీ చాలా తక్కువ శాతం ఓట్లు పోలయ్యాయి. 2019 ఎన్నికల్లో టీడీపీ సీటు కోసం ప్రయత్నించారు. చివరి నిమిషం దాకా అమలాపురం టీడీపీ అభ్యర్దిగా హర్షకుమార్ పోటీ చేస్తారనే వార్తలు కూడా వచ్చాయి. కానీ ఆఖరి సమయంలో సీటు దక్కించుకోలేకపోయారు. పార్టీ మొండిచేయి చూపింది. దీంతో హర్షకుమార్ మౌనంగా ఉండిపోయారు. తదుపరి ఆయన కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్నారు.

ఇటీవల కాలంలో పీసీసీ చైర్మన్ పదవి కోసం ముమ్మరంగా ప్రయత్నాలు చేశారు. హర్షకుమార్‌కు అధినేత్రి సోనియాతో మంచి సంబంధాలు ఉన్నాయి. అంతేగాక ఢిల్లీ స్థాయి పెద్దలతో కూడా మంచి సంబంధాలున్నాయి. కానీ పీసీసీ చైర్మన్ కోసం ఎంతగా ప్రయత్నించినా ఫలితం లేకపోయింది. అమలాపురానికే చెందిన పార్టీ సీనియర్ నాయకుడు గిడుగు రుద్రరాజుకు పదవి వరించింది. దీంతో హర్షకుమార్ అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. దళితుడిననే తనకు పదవి ఇవ్వలేదని దుమ్మత్తిపోశారు. ఈ నేపథ్యంలో పార్టీ మారాలనే ఆలోచన‌కు వచ్చినట్లు తన అంతరంగీకుల ద్వారా తెలిసింది. త్వరలోనే ఆయన వైసీపీ తీర్థం పుచ్చుకోనున్నట్లు సమాచారం.

హర్షకుమార్‌కు ఎక్కడి నుంచి పోటీకి అవకాశం ఇస్తారు?

వైసీపీ తీర్థం పుచ్చుకోనున్న హర్షకుమార్‌ను ఎక్కడి నుంచి పోటీ చేయిస్తుందనే విషయమై విభిన్న కోణాల్లో చర్చ జరుగుతుంది. వాస్తవానికి ఆయన అమలాపురం పార్లమెంటు స్థానం ఆశిస్తారు. ప్రస్తుతానికి ఇక్కడ చింతా అనురాధ పార్లమెంటు సభ్యురాలుగా సేవలందిస్తున్నారు. ఈమెకు కూడా పార్టీలో పెద్ద పేరుంది. ఇటీవల పలు పత్రికల్లో వచ్చే ఎన్నికల్లో అనురాధకు సీటు ఉండదనే ప్రచారం చేశారు. సర్వే రిపోర్టులు కూడా సరిగా లేవని ప్రచారం జరిగింది. అంతేగాక అనురాధ ఈసారి అసెంబ్లీ సీటు ఆశిస్తున్నారని కూడా పుకార్లు షికార్లు చేస్తున్నాయి.

ఈ నేపథ్యంలో హర్షకుమార్‌కు అమలాపురం సీటు ఇస్తారా లేక కోనసీమలో మూడు రిజర్వు స్థానాలున్నాయి. ఇందులో అమలాపురం అసెంబ్లీ స్థానం నుంచి ఈసారి మంత్రి పినిపే విశ్వరూప్ తనయుడు పోటీ చేస్తారని పార్టీ పరోక్షంగా సంకేతాలు ఇచ్చింది. ఇక మిగిలింది పి.గన్నవరం, రాజోలు నియోజకవర్గాలు.. ఇందులో రాజోలులో రాపాక వర ప్రసాదరావు జనసేన నుంచి గెలిచి వైసీపీలో చెలామణీ అవుతున్నారు. ఇతనికి సీటు ఇచ్చే విషయమై స్థానిక కేడర్ నుంచి ఏదైనా ఇబ్బందులు వస్తే స్టాండ్ బాయ్‌గా హర్షకుమార్ పేరు సూచిస్తారనే ప్రచారం ఉంది. పి. గన్నవరం విషయమానికి వస్తే స్థానిక శాసన సభ్యుడు కొండేటి చిట్టిబాబు కూడా అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ కూడా పార్టీ హర్షకుమార్ కార్డును ఉపయోగించవచ్చనే ప్రచారం ఉంది. ఈ నేపథ్యంలో హర్షకుమార్‌తో వైసీపీ రాజ్యసభ సభ్యుడు పిల్లి సుభాష్ చంద్రబోస్ భేటీ అయ్యారు. పార్టీలో చేరికపై చర్చించారు. అయితే ముహూర్తం ఎప్పుడనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. వేచి చూడాలి.


Next Story

Most Viewed