వెట్టి చాకిరీ ఇంకెన్నాళ్లు..? వలంటీర్ల ఆక్రోశం

by Disha Web Desk 7 |
వెట్టి చాకిరీ ఇంకెన్నాళ్లు..? వలంటీర్ల ఆక్రోశం
X

వైసీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పాలనా సంస్కరణల్లో ప్రధానమైంది వలంటీర్ల వ్యవస్థ. నేడు ప్రభుత్వానికి కళ్లూ చెవులు వలంటీర్లే. మూడేళ్ల క్రితం వలంటీర్లను నియమించినప్పుడు వీళ్లు కూడా జన్మభూమి కమిటీల మాదిరే అన్నారు. ప్రతి సంక్షేమ పథకాన్ని అందించే వ్యవస్థగా వలంటీర్లు ఎదిగారు. ప్రజలకు తలలో నాలుకలా అల్లుకుపోయారు. తొలుత కొన్ని విధులకే పరిమితం. ఇప్పుడు పన్నుల వసూళ్ల దగ్గర నుంచి చీమ చిటుక్కుమన్నా ప్రభుత్వానికి చేరవేసే సమాచార వ్యవస్థగా మారారు. అలాంటి తమ జీవితాల్లో వెలుగులు నిండేదెన్నడని వాపోతున్నారు. కేవలం ఐదు వేల వేతనంతో ఎన్నాళ్లు నెట్టుకు రావాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అసలు తమకంటూ ఓ కెరీర్​లేదా అని ఆక్రోశిస్తున్నారు.

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 2.30 లక్షల మంది వలంటీర్లు విధులు నిర్వహిస్తున్నారు. తొలుత సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తే చాలన్నారు. అక్కడ నుంచి ప్రతి సంక్షేమ పథకానికీ అర్హులను గుర్తించే బాధ్యతలను అప్పగించారు. తర్వాత పన్నులు వసూలు చేయాలన్నారు. ప్రతి ఇంటికీ రేషన్ ​సరకులు అందించే బాధ్యతను నెత్తికెత్తారు. ప్రభుత్వం చేపట్టే అనేక సర్వేల్లో వారు తలమునకలవుతున్నారు. పారిశుద్యం, నీటి సరఫరా దగ్గర నుంచి చివరకు విద్యుత్​కు అంతరాయం ఏర్పడినా తమనే సంప్రదించే స్థాయికి వలంటీర్లు ఎదిగారు. ప్రతి 70 కుటుంబాలకు ఓ సేవకుడిగా మారారు. ప్రభుత్వం కూడా ప్రతి పనికీ వలంటీర్లను వినియోగిస్తోంది. దీంతో వాళ్లకు రోజంతా పని ఉంటోంది. ఓ రకంగా చెప్పాలంటే స్వచ్చంద సేవ ముసుగులో వెట్టి చాకిరీ చేస్తున్నారు.

మా జీవితాలు బాగుపడేదెన్నడు?

నెలకు ఐదు వేల రూపాయల నామమాత్రపు గౌరవ వేతనంతో ఇంకెంత కాలం పనిచేయాలంటూ రెండేళ్ల క్రితం వలంటీర్లు ఆందోళన బాటపట్టారు. ఏ పని చేసేవాళ్లకైనా ఓ కెరీర్​ ఉంటుంది. ఎంతకాలం తాము ఇలా గౌరవ వేతనంతో పనిచేయాలి ? తమకంటూ భవిష్యత్తు అక్కర్లేదా ! జీవితంలో స్థిరపడేదెన్నడంటూ రోడ్డెక్కారు. గోదావరి జిల్లాల్లో పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కొన్ని చోట్ల మూకుమ్మడిగా బాధ్యతల నుంచి వైదొలిగారు. నిజాయతీగా సేవలందిస్తున్న వలంటీర్లు మాత్రం ప్రభుత్వ తీరును జీర్జించుకోలేక పోయారు. అమ్యామ్యాలకు అలవాటు పడిన వలంటీర్లు ఎలాగో నెట్టుకొస్తున్నారు. వలంటీర్లలో పెరుగుతున్న అసహనాన్ని తగ్గించేందుకు సీఎం జగన్ ​నేరుగా రంగంలోకి దిగారు.

ఉద్యోగం కాదు, స్వచ్ఛంద సేవ అన్న సీఎం

వలంటీరు అనేది స్వచ్ఛంద సేవ తప్పితే ఉద్యోగం కాదని ఓ నోట్​విడుదల చేశారు. ప్రజలకు మంచి చేయాలనే లక్ష్యంతో వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. వలంటీరుగా పనిచేయడం మహద్భాగ్యంగా పరిగణించాలని కోరారు. వలంటీర్లకు ఏటా ఉగాది నాడు పురస్కారాలు అందిస్తామన్నారు. పదివేలు, ఇరవై వేలు, 30 వేలతో అవార్డులను ప్రకటించారు. వలంటీర్ల పనితీరును బట్టి అవార్డులను అందిస్తూ వస్తున్నారు. అయినా వలంటీర్లను అవార్డులు సంతృప్తి పరచలేకపోతున్నాయి. నిరంతరం పెరుగుతున్న జీవన వ్యయంతో ఆర్థికంగా ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. ఉద్యోగాలేవీ రాక గత్యంతరం లేని స్థితిలో విధుల్లో కొనసాగుతున్నారు.

మంత్రి మాట నిజమేనా?

ఇటీవల మంత్రి పినిపె విశ్వరూప్ ​వలంటీర్ల గురించి మాట్లాడుతూ.. మళ్లీ తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే రూ.15 వేల వేతనం ఇస్తామని ప్రకటించారు. నిజంగా ఇస్తారా.. ఇచ్చేట్లయితే సీఎం జగన్​ ఎందుకు ప్రకటించలేదని వలంటీర్లు అడుగుతున్నారు. వలంటీర్లను ఎన్నికల విధుల్లో నియమించకూడదని ఎన్నికల సంఘం నిబంధన పెట్టింది. దీంతో అధికార పార్టీ గృహ సారథులు, సచివాలయ కన్వీనర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. వీళ్లంతా వలంటీర్లతో సమన్వయం చేసుకోవాలని సూచించింది. రానున్న ఎన్నికల్లో వైసీపీ అధికారానికి వచ్చినా.. రాకున్నా తమకంటూ ఓ దారి చూపాలని వలంటీర్లు కోరుతున్నారు. దీనిపై ప్రభుత్వం స్పందిస్తుందో లేదోనని ఎదురు చూస్తున్నారు.


Next Story