‘వ్యూహం’మూవీ వివాదం: దర్శకుడు ఆర్జీవీపై టీడీపీ ఫిర్యాదు

by Disha Web Desk 21 |
‘వ్యూహం’మూవీ వివాదం: దర్శకుడు ఆర్జీవీపై టీడీపీ ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మపై టీడీపీ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వ్యూహం మూవీ ట్రైలర్స్‌లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కల్యాణ్‌లను అవమానించినందుకు దర్శకుడు రామ్‌గోపాల్ వర్మపై మంగళగిరి రూరల్ పోలీస్ స్టేషన్‌లో టీడీపీ రీసెర్చ్ అండ్ కమ్యూనికేషన్ కమిటీ సభ్యులు టి.గంగాధర్ ఫిర్యాదు చేశారు. వ్యూహం మూవీ ట్రైలర్‌లో‘బాబు చెప్పిన అబద్ధాలు, వాళ్ళు ఎలక్షన్ తరువాతే తెలుసుకుంటారు’ అంటూ‘ఆ స్కిల్ డెవలప్మెంట్ స్కీం లో దోచుకున్న సొమ్ము ఎవరి పాకెట్‌లోకి వెళ్ళింది’ అని అజ్మల్ అమీర్ అనే పేరు గల నటుడి పాత్రతో చెప్పించారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. మరోవైపు జనసేన అధినేత పవన్ కల్యాణ్‌ను చూపిస్తూ‘ఎప్పుడోకప్పుడు మీరు కల్యాణ్‌కు కూడా వెన్నుపోటు పొడుస్తారుగా’ అనే డైలాగ్ వినపడుతుండగా‘వాడికంత సీన్ లేదు, తన్ను తానే పొడుచుకుంటాడు’ అంటూ చంద్రబాబు నాయుడు గొంతును అనుకరిస్తూ, చంద్రబాబు వేషంలో ఉన్న పాత్ర దారుడు, మరో ట్రైలర్‌లో అంటాడు అని తెలిపారు. వ్యూహం మూవీ సాంగ్‌లోని ఒక పాటలో ‘పులుల రూపంలో గుంటనక్కలు పొంచి చూస్తున్నాయి’ అనే చరణం వినపడేటప్పుడు చంద్రబాబు నాయుడును,‘మగ్గి మాడుతుంది, చెడు మంచి నీడలో, నీతి కరువయ్యింది, అవినీతి పాలనలో వెన్నుపోటు రాజులు’ అనే చరణం వినపడేటప్పుడు చంద్రబాబు నాయుడును ఈ విధంగా 3 వీడియోలు సోషల్ మీడియాలో విడుదల చేసినట్లు తెలిపారు. చంద్రబాబు నాయుడు, కొణిదెల పవన్ కల్యాణ్‌లను తీవ్రంగా అవమానించారు అని ఫిర్యాదులో పేర్కొన్నారు. సమాజంలో వారి పరువు, ప్రతిష్టలను దిగజార్చారు అని ఆరోపించారు. అలాగే చంద్రబాబు పార్టీ అయిన తెలుగుదేశం, పవన్ కల్యాణ్ పార్టీ అయిన జనసేనతోపాటు ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను కించపరిచి, వారి మనోభవాలను దెబ్బతీసి, వారిని రెచ్చగొట్టేలా ఈ వ్యూహం మూవీ ట్రైలర్ ఉందని ఫిర్యాదులో ఆరోపించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలోనే కాక మన దేశమంతా, శాంతి, భద్రతలకు విఘాతం కలిగించడానికి ప్రయత్నిస్తున్న ‘వ్యూహం’మూవీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ పైనా, నిర్మాత దాసరి కిరణ్ కుమార్ పైనా, నటులు అజ్మల్ అమీర్‌పైనా,నటి మానసా రాధాకృష్ణన్ పైనా, ఆ సినిమాలో నటించిన మొత్తం నటీ, నటుల పైనా,ఆ సినిమాకు పనిచేసిన 24 క్రఫ్ట్స్ సిబ్బంది మొత్తం పైనా ఎఫ్.ఐ.ఆర్ నమోదు చేసి తగు చర్యలు తీసుకొనమని పోలీసులను టి.గంగాధర్ కోరారు.



Next Story