Taget Ayyanna: నర్సీపట్నంలో సీఎం జగన్ భారీ ప్లాన్!

by Disha Web Desk 16 |
Taget Ayyanna: నర్సీపట్నంలో సీఎం జగన్ భారీ ప్లాన్!
X

రాబోయే ఎన్నికల్లో జగన్మోహనరెడ్డికి ముఖ్యమంత్రి కుర్చీ ఎంత ముఖ్యమో... నర్సీపట్నంలో అయ్యన్నను ఓడించడం అంతే ప్రాధాన్యతగా చేసుకున్నట్టు తెలుస్తోంది. ప్రజా వ్యతిరేక విధానాలు అవలంభిస్తున్నారంటూ అయ్యన్న రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ సీఎంపై వేస్తున్న సెటైర్లు ప్రజల్లో జోష్ నింపుతున్నాయి. వాటిని కట్టడి చేసే క్రమంలో పోలీసులు నమోదు చేస్తున్న కేసులు అయ్యన్నను నిలువరించలేకపోతున్నాయి. దీంతో పాటు ఆయనకు దీటుగా స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే గణేష్( సినీ ర్శకుడు పూరి జగన్నాథ్ సోదరుడు ) విఫలంకావడమే కాకుండా పార్టీలో గ్రూపులను సరిదిద్ధలేకపోవడంతో లేకపోవడంతో ప్రత్యామ్నాయ ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. పది రోజుల క్రితం నర్సీపట్నం వచ్చిన జగన్మోహనరెడ్డి సభ విజయవంతమైనా ఎమ్మెల్యే పేరు ప్రస్తావించకుండా అన్ని కార్యక్రమాలు పూర్తి చేశారు. దీనిలో భాగంగా అవసరమైతే దేశం పార్టీ నుంచైనా అభ్యర్ధిని తీసుకుని అయ్యన్నను ఓడించేందుకు లక్ష్యంగా ప్లానింగ్ చేస్తున్నట్టు ఇంటెలిజెన్స్ వర్గాల భోగట్టా.

దిశ, అల్లూరి జిల్లా: జగన్మోహనరెడ్డి సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఆరు నెలల వరకు పట్టించుకోని మాజీ మంత్రి అయ్యన్న అక్కణ్ణుంచి ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రభుత్వాన్ని నిలదీసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. టీడీపీలో మిగిలిన నాయకులతో పోలిస్తే అయ్యన్నపాత్రుడు నేరుగా సీఎంనే లక్ష్యంగా చేసుకుని అరోపణలు చేయడం ప్రారంభించారు. ఇలా ఆయన రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో తిరుగుతూ సీఎం జగన్మోహనరెడ్డిపై సెటైర్లు వేస్తూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్నారు. దీంతో అయ్యన్నను నిలువరించేందుకు పోలీసులు ఇప్పటివరకు 14 వరకు కేసులు నమోదు చేశారు. ఎన్ని కేసులు నమోదు చేసినా, అరెస్టు చేసేందుకు వీలు లేకుండా ముందస్తుగా కోర్టును ఆశ్రయించి బెయిల్‌పై నిర్భయంగా తిరుగుతూ, ప్రభుత్వంపై ఆరోపణల పర్వం కొనసాగిస్తూనే ఉన్నారు.

ఇలాంటి పరిస్థితుల్లో అయ్యన్నపాత్రుణ్ణి నిలువరించాల్సిన స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే గణేష్ కేవలం ప్రెస్ మీట్లకే పరిమితమవుతున్నారు. ఇదేకాకుండా నియోజకవర్గంలోని అధికార పార్టీలో ఏర్పడిన గ్రూపులను సయోధ్య చేయడంలో ఆయన విఫలమయ్యారు. గత ఎన్నికల్లో జగన్మోహనరెడ్డి మానియాలో ఒకసారి గెలుపొందిన ఎమ్మెల్యే ఆ స్థానంపై పట్టును కోల్పోతున్నట్టు సాక్షాత్తూ ఆ పార్టీ నాయకులే మాట్లాడుకుంటున్నారు. టీడీపీని వీడిన అయ్యన్న సోదరుడు చింతకాయల సన్యాసిపాత్రుడితో సైతం ఎమ్మెల్యే గణేష్‌కు సయోధ్య లేదంటే నియోజకవర్గంలో మిగిలినవారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ విధమైన గణేష్ వ్యవహారశైలి వల్ల గత ఎన్నికల్లో సమయంలో కొంతమంది నాయకులు వైసీపీని వీడి, అయ్యన్నతో జత కలిశారు.

ఈ విధంగా నియోజకవర్గ పరిస్థితిని నిఘా వర్గాల ద్వారా తెలుసుకున్న సీఎం, అయ్యన్నను ఢీ కొట్టాలంటే ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలనే దానిపై ఒక స్పష్టతకు వచ్చారు. ఈ క్రమంలో పది రోజుల క్రితం మెడికల్ కాలేజీ శంఖుస్థాపన కార్యక్రమానికి నర్సీపట్నం వెళ్లినా, సీఎం సభ విజయవంతమైనా ఎక్కడా స్థానిక ఎమ్మెల్యే గణేష్ పేరును ప్రస్తావించకుండా జాగ్రత్త పడ్డారు. అదేవిధంగా నాలుగు మండలాల నాయకులతో మాట్లాడినా వచ్చే ఎన్నికల్లో పార్టీ గెలిచే విధంగా అందరూ కష్టపడాలని సూచించారే తప్ప. అక్కడే ఉన్న గణేష్‌కు ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వకపోవడం విశేషం. ఈ క్రమంలో అయ్యన్నను ఢీ కొట్టాలంటే ప్రత్యామ్నాయ అభ్యర్ధి కోసం సీఎం ఆలోచన చేస్తున్నట్టు తెలుస్తోంది. అవసరమైతే టీడీపీ నుంచి సైతం ఒక అభ్యర్థిని తీసుకొచ్చి, అయ్యన్నపై పోటీకి దింపి, గెలుపొందే విధంగా సీఎం వ్యూహ రచన చేస్తున్నట్టు తెలిసింది.

Next Story