పర్యాటక శాఖలో వైసీపీ అక్రమాలు.. విచారణ కమిటీ ఏం చేస్తుంది ?

by Y.Nagarani |   ( Updated:2024-10-04 01:51:10.0  )
పర్యాటక శాఖలో వైసీపీ అక్రమాలు.. విచారణ కమిటీ ఏం చేస్తుంది ?
X

దిశ ప్రతినిధి, విశాఖపట్నం: రాష్ట్ర పర్యాటక శాఖకు విలువైన ఆస్తులు, ఆదాయాన్నిచ్చే వ్యాపార సముదాయాలు ఉన్న విశాఖలో వైసీపీ పాలనా కాలంలో పెద్ద ఎత్తున జరిగిన అక్రమాలు, అవినీతి వ్యవహారాలు, లీజులపై విచారణ జరిపేందుకు రాష్ర్ట ప్రభుత్వం నియమించిన కమిటీ గురువారం విశాఖలో విచారణ ప్రారంభించింది. ఏపీటీడీసీ జీఎం రుషిబాబు, కాకినాడ ఆర్డీ స్వామి నాయుడు, మౌనిక, గోపాల నాయుడులతో కూడిక కమిటీ విశాఖలోని పలు పర్యాటక ప్రాజెక్టులను సందర్శించి రికార్డులను తనిఖీ చేసింది.

మొదటి కమిటీ నివేదిక బుట్ట దాఖలు..

విశాఖ పర్యాటక శాఖలో వందల కోట్ల అక్రమాలపై జనసేన కార్పొరేటర్ పీతల మూర్తి యాదవ్ లిఖిత పూర్వకంగా కూటమి ప్రభుత్వానికి ఫిర్యాదు చేశారు. దీనిపై నివేదిక ఇవ్వాల్సిందిగా జిల్లా పర్యాటక శాఖాధికారిణి జ్ఞానవేణిని జిల్లా కలెక్టర్ ఆదేశించినప్పటికీ ఆమె వాస్తవాలను నివేదించడం ఇష్టలేక జాప్యం చేశారు. దీంతో ప్రభుత్వం పర్యాటక శాఖ మాజీ మంత్రి రోజా వద్ద ఓఎస్డీగా పనిచేసిన శ్రీనివాస్ నేతృత్వంలో విచారణ కమిటీ వేసింది. ఈ కమిటీపై రోజాతో పాటు పలువురు కూటమి నేతలు కూడా ఒత్తిడి తెచ్చారనే ఆరోపణలు వచ్చాయి. వైసీపీ పాలనా కాలంలో జరిగిన అవినీతిని పర్యాటక శాఖా మంత్రి కందుల దుర్గేష్ పట్టించుకోకపోవడం, పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో మంత్రి లోకేష్ ఈ వ్యవహారాలపై ఆరా తీశారు. దీంతో ఉలిక్కిపడిన పర్యాటక శాఖాధికారులు తాజాగా నలుగురితో విచారణ కమిటీని ఏర్పాటు చేశారు.

బే వాచ్ సంగతి తేలుస్తారా?..

బీచ్ రోడ్ లోని పర్యాటక శాఖా ప్రాజెక్టు బే వాచ్ ను చేజిక్కించుకొన్న వైసీనీ నేతలు నిబంధనలను తుంగలోకి తొక్కి దానిని అక్రమాలకు, సంఘ వ్యతిరేక కార్యక్రమాలకు అడ్డాగా మార్చడంపై కమిటీ దృష్టి సారించనుంది. ఇక్కడ అక్రమంగా గదులను నిర్మించి గంటల లెక్కన అద్దెకు ఇవ్వడం, పర్యాటక శాఖ పేరిట మద్యం లైసెన్స్ తీసుకొని ప్రైవేటు వ్యక్తులకు దానిని బదిలీ చేయడంపై ఫిర్యాదులు వెళ్లాయి.

బ్లూ ఫ్లాగ్ బీచ్ దుమారం..

డిప్యుటేషన్ పై వచ్చిన అధికారి పాణిగ్రహి రుషికొండ బ్లూ ఫ్లాగ్ బీచ్ ను తన అవినీతికి కేరాఫ్ అడ్రస్ గా మార్చుకొన్నారనే ఫిర్యాదులు వెళ్లాయి. వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన హవాకు అంతేలేకుండా పోయింది. విచిత్రంగా కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కూడా ఉత్తమ అధికారి అంటూ ఆయనకే అవార్డు ఇవ్వడం పర్యాటక శాఖలోనే పెద్ద చర్చనీయాంశమైంది. వీటితో పాటు యాత్రి నివాస్ కాంట్రాక్టులు, బీచ్ లో లంచాలు వసూలు, పర్యాటక శాఖ పేరిట ఇష్టానుసారం షాపుల ఏర్పాటు వంటి వాటన్నింటిపై విచారణ జరగనుంది.

Advertisement

Next Story